గాజా నగరంపై ఇజ్రాయెల్ రక్షణ దళాలు మరింత తీవ్రమైన వైమానిక దాడులు కొనసాగిస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు గాజా సిటీ, ఖాన్ యూనిస్, రాఫా ప్రాంతాలపై సుమారు 100కి పైగా బాంబులు కురిపించినట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ దాడుల్లో కనీసం 340 మందికి పైగా మరణించగా, వందలాది మంది గాయపడ్డారు.
ఒక వైపు కాల్పుల విరమణ ఒప్పందం జరుగుతున్న తరుణంలోనే ఇలా దాడులకు పాల్పడటంపై విమర్శలు వెల్లువెత్తతున్నాయి. ఇజ్రాయెల్ వైమానిక దళం హమాస్ నాయకత్వం దాగి ఉన్న ప్రాంతాలపై దాడులు జరుపుతున్నట్లు తెలిపింది. అయితే, స్థానిక వర్గాలు మాత్రం లక్ష్యం లేని బాంబింగ్ వల్ల సాధారణ పౌరులు, పిల్లలు, మహిళలు పెద్దఎత్తున మరణిస్తున్నారని ఆరోపిస్తున్నాయి.
గాజాలోని ప్రధాన ఆసుపత్రులు ఇప్పుడు పూర్తిగా పనిచేయలేని స్థితికి చేరుకున్నాయి. ఇంధనం, నీరు, వైద్య సరఫరాలు లేకుండా వేలాది మంది గాయపడినవారు చికిత్స లేక మృతి చెందుతున్నారని ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ రక్షణ దళాలు గాజా నగరానికి ప్రధాన రహదారిని బ్లాక్ చేశాయి. ప్రజలకు “దక్షిణ గాజా వైపు తరలిపోమని” హెచ్చరికలు జారీ చేశారు. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది ఇళ్లు వదిలి తాత్కాలిక శిబిరాలకు వెళ్లారు.
ఇదిలా ఉండగా, అమెరికా, ఈజిప్ట్, కటార్ దేశాల మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి. తొలి దశలో 20 మంది బందీల విడుదల, 1,700 మంది పౌరుల మార్పిడి ప్రతిపాదనలు ఉన్నాయని విదేశీ వార్తా సంస్థలు వెల్లడించాయి. అయితే, ఇజ్రాయెల్ సైనికులు గాజా నగర పరిసర ప్రాంతాల నుంచి పూర్తిగా ఉపసంహరించబడతారా అనే అంశంపై స్పష్టత ఇంకా లేదు.
హమాస్ ప్రతినిధులు “అధికారికంగా శాంతి కోరుతున్నామని” చెబుతున్నా, కొన్ని ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం గాజాలో మానవతా పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. సుమారు 17 లక్షల మందికి పైగా నిరాశ్రయులు, వేలాది మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని యూఎన్ నివేదిక చెబుతోంది.
విదేశీ మీడియా నివేదికల ప్రకారం, ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 67,000 మందికి పైగా పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చాలా మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. ఇజ్రాయెల్ వైపు నుండి 1,500 మందికి పైగా సైనికులు, పౌరులు మరణించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్‌ను “తక్షణం బాంబింగ్ ఆపాలని” ఆదేశించినట్లు ఒక వార్తా సంస్థ పేర్కొన్నది.
అయితే, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు “హమాస్ పూర్తిగా అంతరించేవరకు ఆపరేషన్ కొనసాగుతుందని” అన్నారు. మొత్తం మీద గాజా ప్రస్తుతం శిథిలాల మైదానంగా మారింది. బాంబింగ్ మధ్య ప్రజలు జీవనోపాధి కోల్పోయి, ప్రపంచం నుంచి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.