అమెరికా H-1B వీసా విధానంలో పెద్ద మార్పులు తీసుకువస్తూ ట్రంప్ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ కొత్త నిబంధనల ప్రకారం అమెరికా వెళ్లడం కష్టమే. ఒక వేళ కష్టపడి వెళ్లినా అక్కడ నుంచి భారత్ కు డబ్బులు పంపడం లేదా అక్కడ దాచిపెట్టుకోవడం మరింత కష్టం.
అందువల్ల అమెరికా వెళ్లకపోవడమే మంచిదనే వాదనలు వినిపిస్తున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం H-1B వీసా కార్యక్రమంలో విస్తృత మార్పులు చేయడానికి ముందడుగు వేసింది. ఈ ప్రణాళిక కింద వీసా నిబంధనలను మరింత కఠినతరం చేయడం, అర్హత ప్రమాణాలను పునర్ పరిశీలించడం వంటి కీలక మార్పులు చేపట్టనుంది.
హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ (DHS) తాజాగా “Reforming the H-1B Nonimmigrant Visa Classification Program” అనే పేరుతో కొత్త ప్రతిపాదనను తమ నియంత్రణ అజెండాలో చేర్చింది. ఈ ప్రతిపాదనలో ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి:
వీసా క్యాప్ మినహాయింపుల అర్హతను పునః సమీక్షించడం
నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై కఠిన చర్యలు
తృతీయ సంస్థల (third-party) నియామకాలపై మరింత పర్యవేక్షణ
నియమాలు, వేతనాలు, ఉద్యోగ పరిస్థితుల పరిరక్షణకు పటిష్ట యంత్రాంగం ఏర్పాటు
అదనంగా, H-1B వీసా దరఖాస్తుకు $100,000 ఫైలింగ్ ఫీజు తప్పనిసరి చేయాలన్న ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. ఈ నియమావళి 2025 డిసెంబర్‌లో ఫెడరల్ రిజిస్టర్ ద్వారా ప్రకటించబడే అవకాశం ఉందని DHS తెలిపింది. ఇంతకుముందు వచ్చిన వార్తల ప్రకారం, ట్రంప్ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న లాటరీ విధానం స్థానంలో వేతన ఆధారిత ఎంపిక విధానాన్ని అమలు చేయాలని కూడా ఆలోచిస్తోంది. దీనివల్ల ఎక్కువ వేతనాలు పొందే నైపుణ్యం కలిగిన వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వబడనుంది.
H-1B వీసా ప్రాముఖ్యత
1990 వలస చట్టం కింద ప్రారంభమైన H-1B వీసా ద్వారా అమెరికా సంస్థలు శాస్త్రం, సాంకేతికం, ఇంజనీరింగ్, గణితం (STEM) వంటి రంగాల్లో విదేశీ నిపుణులను తాత్కాలికంగా నియమించుకోవచ్చు. ఈ వీసా ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులు ఉపయోగించే ప్రధాన మార్గంగా ఉంది.
ప్రతి ఏడాది 65,000 వీసాలు జారీ చేస్తారు. అదనంగా, అమెరికా మాస్టర్స్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ అర్హత కలిగిన వారికి 20,000 వీసాలు కేటాయిస్తారు. విశ్వవిద్యాలయాలు, లాభాపేక్షలేని సంస్థలు వంటి కొన్ని యజమానులు ఈ పరిమితి నుంచి మినహాయింపుకు అర్హులు.
Pew Research Center ప్రకారం, 2023లో H-1B వీసా మంజూరైన వారిలో 75 శాతం భారతీయులు ఉన్నారు. 2012 నుండి ఇప్పటివరకు 60 శాతం కంటే ఎక్కువ వీసాలు కంప్యూటర్ రంగానికి సంబంధించిన ఉద్యోగాలకే జారీ అయ్యాయి.
గణాంకాల ప్రకారం, H-1B వీసా పొందిన భారతీయులు అమెరికన్ ఉద్యోగుల కంటే సమానమైన లేదా ఎక్కువ వేతనం పొందుతున్నారు. అమెరికా చట్టం ప్రకారం, యజమానులు H-1B ఉద్యోగులకు స్థానిక సగటు వేతనం లేదా తాము చెల్లిస్తున్న అత్యధిక వేతనం ఏది ఎక్కువైతే దానిని చెల్లించాలి.
భారతీయులపై ప్రభావం ఎలా ఉంటుంది?
ఈ కొత్త ప్రతిపాదనలు అమలులోకి వస్తే, అమెరికాలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది భారత విద్యార్థులు, ఐటీ నిపుణులు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది.