నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. రాష్ట్ర విభజన తర్వాత అర్ధాంతరంగా నిలిచిపోయిన రాజధాని నిర్మాణ కలలకు ఊపిరిపోస్తూ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ – AP CRDA బిల్డింగ్ ప్రారంభోత్సవానికి రెడీ అయిపోయింది.
ఈ బిల్డింగ్ కేవలం ఆఫీసు మాత్రమే కాదు..అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా నిర్మించాలనే ఆశయానికి ఓ చిరునామా. 2014-19 మధ్య కాలంలోనే CRDA బిల్డింగ్ పనులకు శ్రీకారం చుట్టినప్పటికీ..2019లో అధికారంలోకి వచ్చిన జగన్ 3 రాజధానుల పేరుతో ఈ పనులను నిలిపివేశారు. ఐతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పనులపై ఫోకస్ పెట్టి వేగంగా పూర్తి చేసింది.
అమరావతి రాయపూడి ప్రాంతంలో అత్యాధునిక హంగులతో నిర్మించిన ఈ బిల్డింగ్‌ను ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ బిల్డింగ్‌ను G+7 అంతస్తుల్లో దాదాపు 3.62 ఎకరాల్లో నిర్మించారు. ఈ భవనం దాదాపు 2 లక్షల 42 వేల చదరపు అడుగుల్లో విస్తరించి ఉంది.
ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్‌తో పాటు అధునాతన సౌకర్యాలతో అమరావతి అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా ఈ CRDA బిల్డింగ్ మారనుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలల వ్యవధిలోనే ఈ బిల్డింగ్‌ను నిర్మించారు. దాదాపు 500 మందికి పైగా కార్మికులు, ఇంజనీర్లు రేయింబవళ్లు శ్రమించి ఈ బిల్డింగ్‌ను పూర్తి చేశారు.
ఈ CRDA బిల్డింగ్‌లో పురపాలక శాఖ మంత్రి, CRDA కమిషనర్ల ఛాంబర్లతో పాటు పరిపాలన, ఇంజనీరింగ్, ప్రణాళికా విభాగాలు, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫీసులు ఉండనున్నాయి. ఈ కొత్త CRDA బిల్డింగ్‌లో ప్రతి అంతస్తులో అధికారుల కేబిన్‌లు, ఉద్యోగుల వర్క్‌స్టేషన్‌లు, కామన్ ఫెసిలిటీలు అలాగే అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్‌తో ప్రణాళికాబద్ధంగా నిర్మించారు.
అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులను రియల్-టైమ్‌లో మానిటర్ చేయడానికి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను నిర్మించారు. ఈ కంట్రోల్ రూమ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో నిర్మించారు. ఇది సీఆర్‌డీఏ, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టరేట్ వంటి విభాగాలకు కోఆర్డినేషన్ ప్లాట్‌ఫాంగా ఉపయోగపడుతుంది.
ఈ భవనంలో ఉద్యోగులు, ఇతర సిబ్బంది పనిచేసేందుకు ఎలక్ట్రికల్ ఫిటింగ్స్, ఇంటీరియర్ వర్క్‌లు, ల్యాండ్‌స్కేపింగ్, మోడరన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో పని చేసే వాతావరణాన్ని సిద్ధం చేశారు. ఈ బిల్డింగ్ పనులు పూర్తి కావడంతో మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. కొత్త ప్రారంభానికి కౌంట్ డౌన్ మొదలైందన్నారు.
4 రోజుల్లో APCRDA అమరావతిలో తన భవనాన్ని ప్రారంభిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచస్థాయి రాజధాని కావాలన్న కలకు ఈ ఆఫీసు ఇంధనంగా ఉపయోగపడుతుందన్నారు. ప్రజా రాజధాని భవిష్యత్తు రూపు దిద్దుకుంటోందంటూ లోకేష్ హర్షం వ్యక్తం చేశారు.