బిహార్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) సీట్ల పంపకం ఆదివారం ఖరారైంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ నేతృత్వంలోని జెడీయూ (JD(U)), భారతీయ జనతా పార్టీ (BJP) తలో 101 సీట్లలో పోటీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మిగిలిన 41 సీట్లు చిన్న మిత్ర పార్టీలకు కేటాయించారు.
ఈ సీట్ల పంపంకం వివరాలను జెడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ ఝా, ఉపముఖ్యమంత్రి మరియు బీజేపీ నేత సమ్రాట్ చౌధరీ, అలాగే కేంద్ర మంత్రి చిరాగ్ పస్వాన్ తమ ‘ఎక్స్’ హ్యాండిల్స్ ద్వారా వెల్లడించారు. NDA కూటమిలో భాగమైన లోక్‌జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 29 సీట్లు, హిందుస్తానీ అవామ్ మోర్చా (HAM) 6 సీట్లు, రాష్ట్రీయ లోక్ మోర్చా (ఉపేంద్ర కుశ్వాహా పార్టీ) 6 సీట్లు పొందాయి.
ఢిల్లీ లో గత కొన్ని రోజులుగా ఈ పంపకంపై చర్చలు జరిపిన NDA నేతలు ముగ్గురూ ఒప్పందం “సుహృద్భావ వాతావరణంలో జరిగింది” అని పేర్కొన్నారు. హిందుస్తానీ అవామ్ మోర్చా అధినేత జితన్ రామ్ మాంఝీ కోరుకున్న 15 సీట్లకు బదులుగా కేవలం 6 మాత్రమే కేటాయించడంతో అసంతృప్తిగా ఉన్నారని సమాచారం.
అయితే మాంఝీ తన ‘ఎక్స్’ హ్యాండిల్‌లో “నేను పాట్నాకు తిరిగి వెళ్తున్నాను, కానీ నా చివరి శ్వాసవరకు ప్రధాని నరేంద్ర మోదీతోనే ఉంటాను” అని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో జెడీయూ 115 సీట్లలో పోటీ చేసి 43 సీట్లు మాత్రమే గెలుచుకోగా, బీజేపీ 110 సీట్లలో పోటీ చేసి 74 సీట్లు సాధించింది. మాంఝీ పార్టీ 7 సీట్లలో పోటీ చేసింది.
చిరాగ్ పస్వాన్ అప్పట్లో లోక్‌జనశక్తి పార్టీ పేరుతో NDA నుండి వేరుగా 135 సీట్లలో పోటీ చేశాడు. అప్పట్లో NDA భాగస్వామిగా ఉన్న వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ ఇప్పుడు ఇండియా బ్లాక్ వైపు వెళ్లింది. 2020 ఎన్నికల్లో జెడీయూ బలహీన ఫలితాలు సాధించడంతో ఈసారి పార్టీ తక్కువ సీట్లను తీసుకోవడానికి అంగీకరించింది.
గత ఎన్నికల్లో చిరాగ్ పస్వాన్ తిరుగుబాటు జెడీయూ పరాజయానికి కారణమైందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో నితీశ్‌కుమార్ కొద్దికాలం NDA నుండి బయటకు వచ్చి 17 నెలల తరువాత మళ్లీ కూటమిలో చేరారు. రాజకీయ విశ్లేషకులు ఈ సీట్ల పంపకాన్ని NDAలో ఐకమత్య ప్రదర్శనగా భావిస్తున్నారు.
నితీశ్‌కుమార్ కూటమి సమన్వయాన్ని కాపాడేందుకు తక్కువ సీట్లను స్వీకరించడం వ్యూహాత్మక నిర్ణయమని వారు అంటున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా NDA సీట్ల పంపకం ద్వారా కూటమి ఐక్యతను బలోపేతం చేసింది.