ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్‌పర్సన్ నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక డిస్టింగ్విష్డ్ అవార్డు లభించింది. భువనేశ్వరి ప్రజాసేవ , సామాజిక రంగంలో చేస్తున్న కృషిని గుర్తిస్తూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ ఆమెను ఎంపిక చేసింది. ఈ పురస్కారాన్ని ఆమె నవంబర్ 4, 2025న లండన్‌లో అందుకోనున్నారు. భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ , బ్లడ్ బ్యాంక్‌ను విజయవంతంగా నిర్వహిస్తూ సామాజిక సేవలో తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ అవార్డు భువనేశ్వరి సేవా స్ఫూర్తి , నాయకత్వ లక్షణాలకు నిదర్శనంగా నిలుస్తుందన్న ప్రశంసలు వస్తున్నాయి. నందమూరి కుటుంబసభ్యులంతా భువనేశ్వరిని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
డిస్టింగ్విష్డ్ అవార్డును ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IOD) అనే ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సంస్థ అందజేస్తోంది. నాయకత్వం, కార్పొరేట్ గవర్నెన్స్, సామాజిక సేవలలో విశిష్ట సహకారం అందించిన వ్యక్తులను IOD గుర్తిస్తుంది. 1903లో స్థాపించారు. 1906లో రాయల్ చార్టర్ పొందింది. సుమారు 30,000 మంది సభ్యులు ఇందులో ఉన్నారు. FTSE 100 కంపెనీలలో 78 శాతం కి IoD సభ్యులు బోర్డుల్లో లేదా సీనియర్ మేనేజ్‌మెంట్‌లో ఉన్నారు. ఇండియా నుంచి ఇంతకు ముందు సన్ ఫార్మా దిలీప్ సింఘ్వి, ఆర్సెలార్ మిట్టల్ యజమాని లక్ష్మి మిట్టల్, రాజశ్రీ బిర్లా వంటి వారు అందుకున్నారు.
ఎన్టీఆర్ ట్రస్ట్‌ను 1997లో ప్రారంభించారు. “సేవలో మానవత్వం దైవ సేవ” అనే NTR స్ఫూర్తితో ప్రేరణ పొంది, 28 సంవత్సరాలుగా 18 లక్షల మంది పైగా ప్రజలకు సాయం అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపింది. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత , విపత్తు సాయాల్లో పాల్గొంటుంది. పేద పిల్లలు, యువతకు ఉచిత పాఠశాలలు, కోచింగ్ సెంటర్లు. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తుంది. NABH అక్రెడిటెడ్ బ్లడ్ బ్యాంకులు, తలస్సేమియా బాలలకు ఉచిత రక్తదానం, ఉచిత మెడికల్ క్యాంపులు, NTR సుజల వంటి సేవలు అందిస్తోంది.