ఏపీకి భారీగా పెట్టుబడులే లక్ష్యంగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు మంత్రి నారా లోకేష్. ఆస్ట్రేలియా పర్యటనలో మూడో రోజు ఆయన బిజీబిజీగా గడిపారు. సిడ్నీలోని సీ ఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా(SIA) ప్రతినిధులు, ఆ సంస్థ CEO వెరోనికా పాపకోస్టా, SIA ఎంగేజ్ మెంట్ మేనేజర్ జాస్మిన్ కెల్లేలతో సమావేశమయ్యారు. ఏపీ తీర ప్రాంతం గురించి ఆ కంపెనీ ప్రతినిధులకు వివరించారు.
సముద్ర ఉత్పత్తుల ఎగుమతిలో ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే టాప్ ప్లేస్‌లో ఉందన్నారు. దేశం మొత్తం మీద ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిలో ఏపీ 60 శాతానికి పైగా వాటా కలిగి ఉందని 2024-25లో 7.4 బిలియన్ డాలర్లు అంటే రూ.66 వేల కోట్లు విలువైన 16.98 మిలియన్ టన్నుల ఆక్వా ఉత్పత్తులు ఏపీ నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యాయని తెలిపారు. ఆస్ట్రేలియా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులతో ఏపీ సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారులను అనుసంధానించేందుకు ట్రేడ్ మిషన్లు, నెట్‌వర్కింగ్ కార్యక్రమాలను చేపట్టాలని మంత్రి లోకేశ్ కోరారు.
భారత సముద్ర ఉత్పత్తుల మార్కెట్ విస్తరణ కోసం ఆంధ్రప్రదేశ్ ఆక్వా పరిశ్రమదారులు, ఆస్ట్రేలియా దిగుమతి దారుల మధ్య భాగస్వామ్యాలను సులభతరం చేయాలని అన్నారు. ఆక్వా ఉత్పత్తుల నాణ్యత, నిల్వ కాలాన్ని పెంచేందుకు ప్రాసెసింగ్, కోల్డ్ చైన్ మేనేజ్మెంట్, ప్యాకేజింగ్ రంగాల్లో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను పరిచయం చేయాలని అన్నారు.
పర్యావరణ ప్రభావాన్ని తగ్గిస్తూ ఉత్పాదకతను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్‌లో స్థిరమైన ఆక్వా కల్చర్, మత్స్య సంపద నిర్వహణకు ఏపీ ఆక్వా పరిశ్రమదారులతో కలిసి నైపుణ్యాన్ని పంచుకోవాలని లోకేశ్ కోరారు. ఆంధ్రప్రదేశ్ సీఫుడ్ వంటకాలను ప్రోత్సహించి, కలినరీ టూరిజంను ఆకర్షించేందుకు సంయుక్త కార్యక్రమాలు చేపట్టాలని అలానే సముద్ర మట్టాల పెరుగుదల, తీవ్రమైన వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనేలా ఏపీ సీఫుడ్ పరిశ్రమలో నిరోధకశక్తిని పెంచే ప్రాజెక్టులపై కలిసి పనిచేయాలని మంత్రి లోకేశ్ కోరారు.