దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం మరోసారి చుట్టుముట్టింది. శీతాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. స్థానికంగా గాలి నాణ్యత సూచీ (AQI) క్షీణించడంతో, ‘సెంట్రల్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్’ (CAQM) ఈ సీజన్‌లో తొలిసారిగా ఆంక్షలు విధించింది.
ఢిల్లీ-ఎన్‌సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్) పరిధిలో ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-1’ (GRAP-1) నిబంధనలను తక్షణమే అమలులోకి తెచ్చారు. మంగళవారం నాటికి ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ 211గా నమోదైంది. ఇది ‘పూర్’ (Poor) కేటగిరీ కిందకు వస్తుంది. రానున్న రోజుల్లో కూడా కాలుష్యం ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉందని వాతావరణ విభాగం అంచనా వేయడంతో అధికారులు ఈ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
వాయు నాణ్యత మరింత క్షీణించకుండా నిరోధించేందుకు వీలుగా, GRAP-1 నిబంధనలను వెంటనే అమలు చేయాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని అధికారులు సంబంధిత శాఖలను ఆదేశించారు. ఈ నిబంధనల ద్వారా కాలుష్యాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.