కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి 13వ వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఏలూరు రేంజ్ ఐజి అశోక్ కుమార్ ఐపీఎస్ సంతృప్తి వ్యక్తం చేశారు. బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా శుక్రవారం ఆయన వాడపల్లి విచ్చేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఐపీఎస్, కొత్తపేట డిఎస్పి సుంకర మురళీమోహన్, రావులపాలెం రూరల్ సిఐ సిహెచ్ విద్యాసాగర్, ఆత్రేయపురం ఎస్సై రాంబాబు, వాడపల్లి దేవస్థానం డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావులతో కలిసి ఆయన బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు.
మాడవీధులను, పార్కింగ్ ప్రదేశాన్ని, క్యూలైన్ల ఏర్పాటును పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు బాగున్నాయన్నారు. గత ఏడాదిలో ఆలయం మరింత అభివృద్ధి చెందిందని తెలిపారు. మాడవీధులు విశాలవంతమైయ్యాయని, ఆలయ దక్షిణ,ఉత్తరసింహ ద్వారాల వెడల్పుతో భక్తులకు సులభతరంగా దర్శనం అవుతుందని ఆయన అన్నారు.