కుమారుడి హత్య కేసులో అనుమానంతో అతడి తల్లి తండ్రిని అరెస్టు చేసిన సంఘటన హర్యానాలో జరిగింది. అరెస్టు అయిన తల్లి పంజాబ్ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి కావడం గమనార్శం. పంజాబ్ మాజీ డీజీపీ మహ్మద్ ముస్తఫా, ఆయన భార్య, పంజాబ్ మాజీ మంత్రి రజియా సుల్తానాల కుమారుడు అఖిల్ అఖ్తర్ (35) హర్యానా పంచకులాలోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు.
హర్యానా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటన అక్టోబర్ 16న జరిగింది. పంచకులా ఎంఢీసీ సెక్టార్-4లో నివసిస్తున్న అఖ్తర్ ఇంట్లో విగతజీవిగా ఉండగా కనుగొనబడ్డాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారి వాంగ్మూలం నమోదు చేశారు. మొదట్లో ఎటువంటి అనుమానం లేకపోవడంతో పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
అయితే, అనంతరం సామాజిక మాధ్యమాల్లో అఖ్తర్ స్వయంగా పోస్ట్ చేసినట్లు చెబుతున్న వీడియోలు వెలుగుచూశాయి. అందులో కుటుంబ సభ్యులతో తనకు వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని చెబుతూ తనకు తన కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని భయం ఉన్నట్లు పేర్కొన్నాడు. మలేర్‌కోట్‌లాకు చెందిన షంషుద్దీన్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు అఖిల్ అఖ్తర్ మరణంపై కేసు నమోదు చేశారు.
అక్టోబర్ 17న షంషుద్దీన్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసును మళ్లీ దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు దర్యాప్తు కోసం ఏసీపీ హోదా ఉన్న అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఐటీ) ఏర్పాటు చేశారు. ఈ బృందం సాంకేతిక ఆధారాలతో సహా ప్రతి కోణంలో లోతుగా విచారణ జరపనుంది.
పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో, “దర్యాప్తు పూర్తిగా నిష్పాక్షికంగా, పారదర్శకంగా సాగుతుంది. దోషి ఎవరైనా వదిలిపెట్టరు, నిర్దోషి ఎవరికీ అన్యాయం జరగదు” అని తెలిపారు. ఫిర్యాదుదారుడు షంషుద్దీన్ తన ఫిర్యాదులో, అఖ్తర్ మరియు కుటుంబ సభ్యుల మధ్య కొంతకాలంగా తగాదాలు ఉన్నాయని తెలిపాడు.
మరణానికి ముందు అఖ్తర్ సామాజిక మాధ్యమాల్లో వీడియో విడుదల చేసి కుటుంబ వివాదాలపై తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు తనకు ప్రాణహాని ఉందని స్పష్టంగా పేర్కొన్నాడని తెలిపారు. అక్టోబర్ 20న బీఎన్‌ఎస్ సెక్షన్ 103(1), 61 కింద ఎంఢీసీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పంచకులా డీసీపీ శ్రీష్టి గుప్తా తెలిపారు.
దాంతో తండ్రి, పంజాబ్ మాజీ డీజీపీ మహ్మద్ ముస్తఫా, ఆయన భార్య, అఖిల్ అఖ్తర్ తల్లి పంజాబ్ మాజీ మంత్రి రజియా సుల్తానాతో సహా నలుగురిపై హర్యానా పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.