నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 36 గంటల్లో నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
దక్షిణ తీర ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించింది.
వర్షాల సమయంలో చెట్ల క్రింద నిలబడరాదని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సంస్థ హెచ్చరించింది. అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ టోల్‌ఫ్రీ నంబర్లు 112, 1070, 18004250101 ద్వారా సంప్రదించాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.