మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనను వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు తీవ్ర నిరసన చేపట్టాయి. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, ‘గో బ్యాక్ జగన్’ అంటూ నినాదాలతో తమ ఆందోళనను వ్యక్తం చేశాయి.
ఈ సందర్భంగా దళిత నాయకుడు మరిడయ్య మాట్లాడుతూ, మాకవరపాలెం మండలంలో నిర్మించతలపెట్టిన మెడికల్ కాలేజీ పనులు ముందుకు సాగడం లేదని, నిర్మాణ ప్రాంతం తుప్పలతో నిండిపోయిందని ఆరోపించారు. “ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్న కాలేజీని చూపి, అడ్మిషన్లు కూడా జరుగుతున్నాయని చెప్పి ప్రజలను మోసం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తున్నారు,” అని ఆయన విమర్శించారు.
”దళిత డాక్టర్ సుధాకర్‌ను హింసించి చంపిన మీరు నర్సీపట్నంలో ఎలా అడుగు పెడతారు?” అని ప్రశ్నించారు. కడప జిల్లాకు సమీపంలోని చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేస్తే, కనీసం అక్కడి దళితులను పరామర్శించడానికి వెళ్లని ముఖ్యమంత్రి, ఇప్పుడు నర్సీపట్నంలో ఫేక్ మెడికల్ కాలేజీ, ఫేక్ జీవోలతో ప్రజలను మభ్యపెట్టడానికి వస్తున్నారని మండిపడ్డారు.
“అసలు మెడికల్ కాలేజీ కట్టడానికి మీకు అనుమతి ఉందా? దొంగ జీవోలన్నీ చూపిస్తూ ఏ మొహం పెట్టుకొని నర్సీపట్నం వస్తున్నారు?” అని వారు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.