నకిలీ మద్యం కేసులో ఇప్పటికైనా పోలీసులకు లొంగిపోయి మాజీ మంత్రి జోగి రమేష్ నిజాలు చెప్పాలని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న హితవు చెప్పారు. బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ, “జోగి జోగి కలిస్తే బూడిద రాలినట్లు — జగన్, జోగి రమేష్ కలిస్తే బూడిద రాలుతుందని తేలిపోయింది,” అని విమర్శించారు.
గత ఐదేళ్లలో జగన్ అవినీతి, హత్యలు చేసిన వారిని ప్రోత్సహించారని ఆయన అన్నారు. అదే సమయంలో చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం తప్పుడు పనులు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. “జనార్ధన్ స్వయంగా జోగి రమేష్ కీలకపాత్ర ఉందని చెప్పాడు. తప్పు చేసి దొరికిపోయి కూడా జోగి రమేష్ సిగ్గు లేకుండా వాగుతున్నాడు,” అని వెంకన్న అన్నారు.
చంద్రబాబు ప్రమాణం చేయాలని వైఎస్సార్ నేతలు అడగడం హాస్యాస్పదమని విమర్శిస్తూ, “జగన్, భారతి గార్లు వెంకటేశ్వర స్వామి వద్ద ప్రమాణం చేస్తారా?” అని ప్రశ్నించారు. అలాగే జోగి రమేష్, జనార్ధన్ మధ్య వాట్సప్ చాటింగ్‌లు, వీడియో కాల్స్ ఉన్నాయని చెప్పారు. “నువ్వు ఏ తప్పు చేయలేదని చెబుతున్నావంటే సిట్ ముందుకు వెళ్లి ఆధారాలు చూపించు, నిజాయితీ నిరూపించు,” అని సవాల్ విసిరారు.
జగన్ పాలనలో అవినీతి పరాకాష్టకు చేరిందని బుద్దా వెంకన్న మండిపడ్డారు. “మద్యం కుంభకోణం వల్ల 12 మంది జైలుకు వెళ్లారు. ఇప్పుడు నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అడ్డంగా దొరికిపోయాడు. మరి జగన్ నిద్రపోతున్నాడా? ఎందుకు సస్పెండ్ చేయలేదు?” అని ప్రశ్నించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు అవినీతి, దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ, “కొడాలి నానీ, పేర్ని నాని, దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్, వల్లభనేని వంశీ వీరంతా గత ప్రభుత్వంపై అసభ్యంగా వ్యాఖ్యలు చేశారు. కానీ జగన్ వారిని ప్రోత్సహించారు,” అని చెప్పారు.
“నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ వెనుక ఇంకా పెద్దలున్నారు. రమేష్‌ను అరెస్టు చేసి విచారణ చేస్తే, వారి పేర్లు బయటకు వస్తాయి,” అని. అలాగే “సూపర్ సిక్స్” ద్వారా కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని, దానిని దెబ్బతీయడానికి వైసీపీ కుట్రలు పన్నిందని తెలిపారు.
వైసీపీ ప్రభుత్వ కాలంలోనే నకిలీ మద్యం తయారీ మొదలైందని, అప్పటి పాలకులు వారిని ప్రోత్సహించి లాభాలు దోచుకున్నారని ఆరోపించారు. “ఇప్పుడూ సిగ్గు లేకుండా మళ్లీ వస్తామని చెబుతున్నారు. ఈసారి వస్తే ప్రజలు కాళ్లు విరగ్గొట్టి కూర్చోపెడతారు,” అని ఆయన హెచ్చరించారు.
వెంకన్న మాట్లాడుతూ, “జోగి రమేష్ తప్పు లేకపోతే ఎందుకు సీపీ వద్ద అంతమందిని తీసుకుని వెళ్లారు? పేర్ని నానీ బియ్యం దొంగ అని ఒప్పుకున్నాడు. చంద్రబాబు ప్రమాణం చేయాలా? జగన్, భారతి గార్లు రమేష్ నిర్దోషి అని ప్రమాణం చేయాలి,” అన్నారు. “ప్రభుత్వం మద్యం దుకాణాలు నడిపి జగన్ 3,500 కోట్లు దోచుకున్నాడు. ఆన్‌లైన్ పేమెంట్లు లేకుండా డబ్బును బ్లాక్ మనీగా తరలించాడు,” అని ఆరోపించారు.
అదే సమయంలో “మా చంద్రబాబు నకిలీ మద్యం విషయం బయటపడగానే ఇద్దరిని సస్పెండ్ చేశారు. కానీ జగన్ ఒక్కరిపై కూడా క్రమశిక్షణ చర్య తీసుకోలేదు,” అని అన్నారు. వైఎస్సార్ నేతలను ఉద్దేశిస్తూ, “నోరు అదుపులో పెట్టుకోండి. జోగి రమేష్ పోలీసులు వద్ద లొంగి విచారణకు సహకరించాలి,” అని హెచ్చరించారు.
మొత్తం మీద, బుద్దా వెంకన్న చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త దుమారం రేపాయి. నకిలీ మద్యం కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు వాస్తవాలు బయటపడవు, కానీ ఈ అంశం రాజకీయ దిశను ప్రభావితం చేసే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.