నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో పండుగ పూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను గొంతు నులిమి చంపి, ఆ తర్వాత తానూ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణ ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మృతులు ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా జనగాల గ్రామానికి చెందిన కుంచాల నాగలక్ష్మి (27), ఆమె కూతురు అవంతిక (9), కొడుకు భవన్ సాయి (7). బతుకు తెరువు నిమిత్తం నాలుగేళ్ల క్రితం ఈ కుటుంబం కొండమల్లేపల్లికి వలస వచ్చి జీవిస్తోంది.
భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని, ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన నాగలక్ష్మి ఈ దారుణానికి ఒడిగట్టిందని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ముందుగా నాగలక్ష్మి తన ఇద్దరు పిల్లలను గొంతు నులిమి చంపి, అనంతరం తానూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
సమాచారం అందుకున్న కొండమల్లేపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పండుగ రోజున జరిగిన ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా విషాద ఛాయలు నింపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.