దీపావళి పండుగ సందర్భంగా భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో మెరిశాయి. మదుపరుల నుంచి కొనుగోళ్ల జోరు పెరగడంతో దేశీయ సూచీలు సరికొత్త గరిష్ట స్థాయిలకు చేరాయి. వరుసగా నాలుగో రోజు కూడా స్టాక్ మార్కెట్ వృద్ధిని నమోదు చేసుకుంది. 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 411 పాయింట్లు పెరిగి 84,363.37 వద్ద స్థిరపడింది.
ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 133 పాయింట్లు లాభపడి 25,843.15 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ ఏకంగా 700 పాయింట్లకు పైగా ఎగిసి 84,656.56 వద్ద గరిష్ట స్థాయిని తాకడం విశేషం.
ముఖ్యంగా దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 3.5 శాతం మేర పెరగడం మార్కెట్ ర్యాలీకి ప్రధాన కారణమైంది.
శుక్రవారం ప్రకటించిన త్రైమాసిక ఫలితాలు అంచనాలకు మించి ఉండటంతో రిలయన్స్ షేర్లలో భారీ కొనుగోళ్లు కనిపించాయి. రిలయన్స్‌తో పాటు బజాజ్ ఫిన్‌సర్వ్, యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టీసీఎస్ వంటి బ్లూ-చిప్ షేర్లు కూడా గణనీయంగా లాభపడ్డాయి.
మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి కొన్ని కంపెనీల షేర్లు నష్టాల్లో ముగిశాయి. పండుగ సీజన్ అమ్మకాలు పెరగడం, విదేశీ పెట్టుబడులు స్థిరంగా కొనసాగడం మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత పెంచింది. రేపు (మంగళవారం) స్టాక్ ఎక్స్ఛేంజీలు సంప్రదాయ ముహూరత్ ట్రేడింగ్‌ను నిర్వహించనున్నాయి.