బాలికలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినా, సోషల్ మీడియాలో తప్పుగా పోస్ట్ చేసినా కఠిన చర్యలు తప్పవని ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురష్కరించుకుని యూజీసీ ఉమెన్స్ స్టీడీ సెంటర్, ఏపీ మహిళా కమిషన్ ల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ వన్ టౌన్ లోని కేబీఎన్ కళాశాలలో స్పాట్ లైట్ సెషన్ ను శుక్రవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాయపాటి శైలజ మాట్లాడుతూ అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని ప్రతి యేడాది అక్టోబర్11న జరుపుకుంటున్నామని, కాని బాలికా దినోత్సవాలు అంటూ ఒక్క రోజు జరుపుకోవడం కాదు.. ఏడాది మొత్తం అవగాహన సదస్సులు జరుపుకున్నప్పుడే అద్భుత ఫలితాలు సాధించగలమన్నారు. దీంతో సమాజంలో సైతం మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
చిన్నారులు, బాలికలు, మహిళలు స్వేచ్ఛగా,సంతోషంగా జీవించే హక్కు కలిగి ఉన్నారని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. బాలికలు, మహిళలు చదువుకునే సమయంలో, ఉద్యోగ విధుల్లో ఉన్నసమయంలో ఎటువంటి భయం లేకుండా జీవితం కొనసాగించేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు. పని ప్రదేశంలో అఘాయిత్యాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
రాష్ట్ర మహిళా కమిషన్ విధులు, విధానాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని రాయపాటి శైలజ సూచించారు. అలాగే ప్రతి ఒక్కరూ మహిళా చట్టాలపై అవగాహన పెంచేలా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. మహిళలు, బాలికలు స్వయంగా తమ కార్యాలయానికి రాలేని పరిస్థితులు ఉండటం, మరోక సందర్భంలో తమ వివరాల గోప్యత వంటి విషయాలను గుర్తించి ఆన్ లైన్ పోర్టల్ ను సిద్ధం చేస్తున్నామన్నారు.
సదరు పోర్టల్ లో ఫిర్యాదు నమోదు చేస్తే ఆ ఫిర్యాదు స్టేటస్ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చన్నారు. తమ వద్దకు ఫిర్యాదుల్లో ఎక్కువగా తెలిసీ తెలియని వయస్సులో చేసిన పొరపాట్ల వల్ల జరుగుతున్నాయని గుర్తించి రాష్ట్రవ్యాప్తంగా చట్టాలపై అవగాహన సదస్సులు నిర్వహించడంతో పాటు వారిలో చైతన్యాన్ని తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఇటీవల బాలికల నుంచి ఒక ప్రశ్న తరుచూ ఎదురవుతుందని, బాలికలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో ఆలస్యం అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారన్నారు. మహిళలపై అఘాయిత్యాయాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా దేశంలోనే మొదటి రాష్ట్రంగా మన ఏపీని నిలపాలన్న ఆలోచనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు.
మరోకరు అలాంటి తప్పుడు పనులు చేయకుండా భయపడే విధంగా చట్టాలు ఉండాలని విద్యార్థుల నుంచి పెద్ద సంఖ్యలో విజ్ఞప్తులు రావడం హర్షనీయమన్నారు.
చట్టాలపై అవగాహన సదస్సులు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడంతో పాటు విద్యలో ఒక భాగం చేయాలన్న ఆలోచన చేస్తున్నామని రాయపాటి శైలజ తెలిపారు. కురుపాం ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా తీసుకోవడం జరిగిందన్నారు. అక్కడికి వెళ్లి పరిస్థితులను అంచనా వేయడం జరిగిందన్నారు. ముందుగా మారపు ట్రస్ట్ ఛైర్మన్ ఆర్. సుయజ్ రాయపాటి శైలజతో ముఖాముఖి నిర్వహించారు.
మహిళలపై నేడు జరుగుతున్న అఘాయిత్యాలు, సోషల్ మీడియా వేదికగా వేధింపులు ఇలా పలు అంశాలపై అడిగిన ప్రశ్నలకు రాయపాటి శైలజ విపులంగా సమాధానాలు చెప్పారు. విద్యార్ధినీలు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పడంతో పాటు వారిలోని జిజ్ఞాసను ప్రశంసించారు. అనంతరం కేబీఎన్ కళాశాల ఉపాధ్యాయ, అధ్యాపక బృందం రాయపాటి శైలజను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి మెమోంటో బహుకరించారు. కార్యక్రమంలో కళాశాల బాలికలు పాల్గొన్నారు.