కోల్డ్రిఫ్ దగ్గు మందు తరచూ వాడుతున్నారా? ఈ వార్త చదివిన తర్వాత నిర్ణయం తీసుకోండి. మధ్యప్రదేశ్‌లో కోల్డ్రిఫ్ దగ్గు మందు తాగడం వల్ల 14 మంది పిల్లలు మృతి చెందిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో కోల్డ్రిఫ్ దగ్గు మందుపై నిషేధం విధిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో కలుషితమైన కోల్డ్రిఫ్ దగ్గు మందు సేవించి 14 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపుతోంది.
ఈ సంఘటన నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకుంది. రాష్ట్ర ఆహార మరియు ఔషధ నియంత్రణ సంస్థ (FDA) విడుదల చేసిన ఆదేశాల ప్రకారం కోల్డ్రిఫ్ దగ్గు మందు అమ్మకం, పంపిణీ, వినియోగం పంజాబ్‌లో తక్షణమే నిషేధించారు.
FDA ఆదేశాల్లో పేర్కొన్నదేమిటంటే “ఈ కార్యాలయ దృష్టికి వచ్చిన సమాచారం ప్రకారం, కోల్డ్రిఫ్ సిరప్ నమూనాను మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఔషధ పరీక్షా ప్రయోగశాల ‘స్టాండర్డ్ క్వాలిటీకి తగని ఔషధం’గా ప్రకటించింది” అని పేర్కొంది. సిరప్ బ్యాచ్ నంబర్ SR-13, తయారీ సంస్థ స్రేసన్ ఫార్మాస్యూటికల్, బెంగళూరు హైవే, సుంగువర్చత్రం (మథుర), కాంచీపురం జిల్లా, తమిళనాడులో ఉన్నట్లు FDA తెలిపింది.
పరీక్షల్లో ఈ సిరప్‌లో డైఎథిలిన్ గ్లైకాల్ (DEG) అనే అత్యంత విషపూరిత రసాయనం 46.28 శాతం (w/v) మేర ఉన్నట్లు తేలింది. ఈ రసాయనం మానవ శరీరానికి తీవ్రమైన హానికరమని అధికారులు హెచ్చరించారు. “ఈ ఔషధం వల్ల మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లాలో చిన్నారులు మరణించిన దృష్ట్యా, ప్రజారోగ్య రక్షణ దృష్ట్యా పంజాబ్ రాష్ట్రంలో ఈ ఉత్పత్తి విక్రయం, పంపిణీ, వినియోగం పూర్తిగా నిషేధించబడుతుంది” అని ఆదేశంలో పేర్కొన్నారు.
పంజాబ్‌లోని అన్ని ఔషధ విక్రేతలు, పంపిణీదారులు, వైద్యులు, ఆస్పత్రులు, ఆరోగ్య సంస్థలు ఈ ఉత్పత్తిని కొనుగోలు చేయకూడదని, విక్రయించకూడదని లేదా ఉపయోగించకూడదని సూచించారు. రాష్ట్రంలో ఎవరి వద్దైనా ఈ సిరప్ నిల్వలో ఉంటే, వెంటనే ఆ సమాచారం FDA (డ్రగ్స్ విభాగం)కి అందించాలని ఆదేశించారు.
మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారాలో చిన్నారులు కిడ్నీ వైఫల్య లక్షణాలతో మరణించడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. తమిళనాడులో తయారైన ఈ సిరప్‌లో ప్రమాదకరమైన డైఎథిలిన్ గ్లైకాల్ కలుషితంగా ఉన్నట్లు నిర్ధారణ కావడంతో దేశవ్యాప్తంగా ఆరోగ్య అత్యవసర హెచ్చరిక జారీ చేశారు. ఈ ఘటనతో మధ్యప్రదేశ్‌లో అనేక మంది ఆరోగ్య అధికారులను సస్పెండ్ చేయగా, కొన్ని అరెస్టులు కూడా జరిగాయి. దేశవ్యాప్తంగా కోల్డ్రిఫ్ సిరప్ నిల్వల స్వాధీనం చర్యలు చేపట్టారు. కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాలు ఔషధాల నియంత్రణ మార్గదర్శకాలను మరింత కఠినతరం చేశాయి.