అనకాపల్లి జిల్లాలోని యస్ రాయవరంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి హోం మంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర ప్రధాన అతిథులుగా హాజరయ్యారు. సభకు ముందు మంత్రులు మహాకవి గురజాడ అప్పారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
యస్ రాయవరం గ్రామ ప్రజలు మంత్రులను ఘనంగా సత్కరించారు. మహిళలు హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యస్ రాయవరం ZPTC కాకర దేవి వైసీపీని వీడి తెలుగు దేశం పార్టీలో చేరారు. సభలో హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ రాష్ట్రం ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ కాలంలో గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. “పెన్షన్‌లు రూ.2000 నుండి రూ.3000 చేయడానికి జగన్‌కు ఐదు సంవత్సరాలు పట్టింది. కానీ చంద్రబాబు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచారు,” అని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆమె తెలిపారు.
“ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇచ్చాం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఎంతో ఉపయోగపడుతోంది. అర్హులందరికీ మూడు సెంట్ల స్థలాన్ని త్వరలో ప్రభుత్వం ఇవ్వనుంది,” అని వెల్లడించారు. అనిత మాట్లాడుతూ, పాయకరావుపేట నియోజకవర్గంలో లక్ష ఉద్యోగాలు ఇవ్వాలనే ప్రణాళికతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
“2014లో రాజయ్యపేట గ్రామ ప్రజలకు ఎకరాకు 18 లక్షల రూపాయలు ఇప్పించాం. అదే గ్రామంలో గత ప్రభుత్వం బల్క్ డ్రగ్ పార్క్‌కు శంకుస్థాపన చేసి పాలాభిషేకాలు చేసింది. ఇప్పుడు అదే వైసీపీ నాయకులు ధర్నాలు చేయడం ప్రజలు ఆలోచించాల్సిన విషయం,” అని విమర్శించారు.
“వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది. కులాలు, మతాలు మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మెడికల్ కాలేజీల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు,” అని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైసీపీకి చెందిన బొలిశెట్టి గోవిందరావు టీడీపీలో చేరారు.
ఆయన యస్ రాయవరం నుండి పెనుగొల్లు వరకు రహదారి వేయాలని అభ్యర్థించగా, మంత్రి అనిత త్వరలోనే ఆ రోడ్డు శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, యస్ రాయవరంలో జూనియర్ కాలేజ్ ఇప్పటికే మంజూరు అయినట్లు ప్రకటించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.