ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) 11వ సమావేశంలో మొత్తం ₹1.14 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో 67 వేలకుపైగా కొత్త ఉద్యోగాలు సృష్టించబడనున్నాయని అధికారులు వెల్లడించారు. సమావేశంలో ఐటీ, ఇంధనం, టూరిజం, ఎరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి విభాగాల్లో 30కుపైగా ప్రాజెక్టులకు అనుమతి లభించింది.
అందులో ముఖ్యంగా, RAIDEN INFO TECH DATA CENTER సంస్థ రూ.87,520 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి ఆమోదం పొందింది. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (FDI) గా నిలవనుందని SIPB పేర్కొంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల రంగం కొత్త దిశగా అడుగుపెడుతోందని అధికారులు తెలిపారు. ఇంత భారీ స్థాయిలో FDI ఇప్పటి వరకు ఎప్పుడూ రాలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
భారీ పెట్టుబడులు రాష్ట్రానికి రాకలో ఐటీ మంత్రి నారా లోకేష్ చేసిన కృషిని ప్రశంసిస్తూ ముఖ్యమంత్రి మరియు ఇతర మంత్రులు అభినందనలు తెలిపారు. 15 నెలలుగా జరుగుతున్న పెట్టుబడుల ప్రోత్సాహక యత్నాలు ఫలితాలను ఇస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. మూడు గంటల పాటు కొనసాగిన SIPB సమావేశంలో ప్రతి ప్రాజెక్టు మీద వివరంగా చర్చ జరిగింది.
భారీ ప్రాజెక్టులకు ప్రత్యేక అధికారులను నియమించేందుకు నిర్ణయం తీసుకుంది. వీరు సంస్థలు త్వరగా కార్యకలాపాలు ప్రారంభించేలా బాధ్యత తీసుకోనున్నారు. ఇప్పటి వరకు జరిగిన 11 SIPB సమావేశాల ద్వారా మొత్తం ₹ 7.07 లక్షల కోట్ల పెట్టుబడులు ఆమోదం పొందగా, వీటి ద్వారా 6.20 లక్షల ఉద్యోగాలు సృష్టించబడనున్నాయి.