అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌లో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భారత ప్రజలకు, భారత మూలాలున్న అమెరికన్లకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ట్రంప్ ప్రసంగిస్తూ, భారత ప్రధాని నరేంద్ర మోదీని “అద్భుతమైన వ్యక్తి, గొప్ప మిత్రుడు”గా ప్రశంసించారు.
అమెరికా-భారత్ సంబంధాలు వాణిజ్యం, ప్రాంతీయ శాంతి దిశలో మరింత బలపడుతున్నాయని పేర్కొన్నారు. “భారత ప్రధాని మోదీతో నేడు ఫోన్‌లో మాట్లాడాను. వాణిజ్య అంశాలపై చర్చించాం. అలాగే భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధాలు జరగకూడదనే విషయంపై కూడా మాట్లాడాం. అది చాలా మంచి విషయమని భావిస్తున్నాను,” అని ట్రంప్ తెలిపారు. దీపావళి పండుగ ప్రతీకాత్మకతను వివరిస్తూ ట్రంప్ అన్నారు.
“కొద్దిసేపట్లో మనం దీపం వెలిగిస్తాం. అది వెలుగు చీకట్లపై గెలుపును, జ్ఞానం అజ్ఞానంపై, మంచి చెడుపై విజయాన్ని సూచిస్తుంది. దీపావళి సందర్భంగా ప్రజలు శత్రువులపై విజయం, అడ్డంకుల తొలగింపు, బందీల విముక్తిని గుర్తుచేసుకుంటారు” అని అన్నారు.
“దీప జ్యోతి మనందరికీ జ్ఞాన మార్గాన్ని అనుసరించాలని, శ్రద్ధగా పని చేయాలని, మనకు ఉన్న అనేక ఆశీర్వాదాల పట్ల కృతజ్ఞతతో ఉండాలని గుర్తుచేస్తుంది” అని అన్నారు. ప్రసంగం అనంతరం ట్రంప్ వైట్ హౌస్‌లో దీపాలు వెలిగించి దీపావళిని జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ట్రంప్ ప్రభుత్వంలోని పలువురు కీలక అధికారులు హాజరయ్యారు.
వీరిలో ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్, జాతీయ గూఢచార సంస్థ (ODNI) డైరెక్టర్ తుల్సీ గబ్బార్డ్, వైట్ హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ కుష్ దేసాయి, భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా, అమెరికా రాయబారి సెర్జియో గోర్ తదితరులు ఉన్నారు. అమెరికాలోని ప్రముఖ భారతీయ వ్యాపారవేత్తల బృందం కూడా వేడుకలో పాల్గొంది.
ఇది అమెరికా-భారత్ సంబంధాల్లో భారతీయ వలసదారుల పెరుగుతున్న పాత్రను ప్రతిబింబిస్తోంది. వైట్ హౌస్‌లో జరిగిన ఈ వేడుక అమెరికా సమాజంలో దీపావళి సాంస్కృతిక ప్రాధాన్యతను, భారత్-అమెరికా మైత్రిని స్పష్టంగా తెలియజేసింది.
ఇక ముందు రోజే అమెరికా కాంగ్రెస్ సభ్యులు రాజా కృష్ణమూర్తి, బ్రయాన్ ఫిట్జ్‌పాట్రిక్‌లు దీపావళి ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యతను గుర్తిస్తూ ద్విపక్ష తీర్మానాన్ని ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. దీపావళి ఐదు రోజుల పండుగ. ధనతేరస్‌తో ప్రారంభమవుతుంది. ఆ రోజు ప్రజలు బంగారు ఆభరణాలు లేదా పాత్రలు కొనుగోలు చేసి దేవతలను పూజిస్తారు.
రెండవ రోజు నరక చతుర్దశి లేదా చిన్న దీపావళిగా జరుపుకుంటారు. మూడవ రోజు ప్రధాన వేడుకలు జరుగుతాయి. ఆ రోజు ప్రజలు గణేశుడు, లక్ష్మీదేవిని పూజించి ధనసంపద, శ్రేయస్సు కోరుకుంటారు. నాలుగవ రోజు గోవర్ధన పూజ, ఐదవ రోజు భాయ్ దూజ్‌గా జరుపుకుంటారు. ఆ రోజు అక్కచెల్లెళ్లు తమ అన్నదమ్ముల దీర్ఘాయుష్షు కోసం ప్రార్థనలు చేసే కార్యక్రమం నిర్వహిస్తారు.