ఇద్దరు వ్యక్తుల మధ్య చెలరేగిన వివాదం హత్యకు దారితీయగా దాన్ని కులాలకు ఆపాదిస్తూ వైసీపీ ముఠాలు చెలరేగిపోతున్నాయి. కమ్మ కాపు కులాల మధ్య వివాదంగా దీన్ని చూపుతూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రాళ్లపాడు గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంఘటన తప్ప దీనికి కులాలకు సంబంధం లేదని జిల్లా ఎస్ పి అజితా వేజెండ్ల స్పష్టం చేసిన తర్వాత కూడా కులాల మధ్య తగాదాలు రేకెత్తించేందుకే వైసీపీ ప్రయత్నిస్తున్నది.
రాళ్లపాడు గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం ముసుగులో దారుణ హత్య జరిగింది. ఈ ఘటనలో దారాకనిపాడు గ్రామానికి చెందిన తిరుమలశెట్టి లక్ష్మీ నాయుడు (25) మృతిచెందగా, అతని సోదరుడు తిరుమలశెట్టి పవన్ (24), బంధువు భార్గవ నాయుడు (24) తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అక్టోబర్ 2న మధ్యాహ్నం 12 గంటల సమయంలో చోటుచేసుకుంది.
ఫిర్యాదుదారు తిరుమలశెట్టి పవన్ తెలిపిన వివరాల ప్రకారం తాను, తన అన్న లక్ష్మీ నాయుడు, భార్గవ నాయుడు ముగ్గురూ బైక్ (నంబరు AP40FH2550)పై కందుకూరు వైపు వెళ్తుండగా, రాళ్లపాడు గ్రామ శివారులో ఎదురు దిశగా వస్తున్న ఫార్చ్యూనర్ కారు (నంబరు AP39MP0090) వారిని ఢీకొట్టింది. ఆ కారు నడిపింది దారకనిపాడు గ్రామానికి చెందిన కాకర్ల హరికృష్ణ ప్రసాద్ @ నాయుడు (27) గా గుర్తించారు.
కారు బైక్‌ను బలంగా ఢీకొట్టి, కొంత దూరం ఈడ్చుకుంటూ వెళ్ళడంతో లక్ష్మీ నాయుడు అక్కడికక్కడే మృతిచెందాడు. పవన్, భార్గవ నాయుడు తీవ్రంగా గాయపడి మొదట కందుకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అనంతరం గుంటూరులోని ఉదయ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. వ్యక్తిగత కారణాల తో పాటు ఆర్థికపరమైన లావాదేవీలు ఇరువురి మధ్య ఉన్నట్టు జిల్లా ఎస్పీ వెల్లడించారు.
ఇప్పటికే హత్య ఘటన లో నిందితులు హరిశ్చంద్ర ప్రసాద్, మాధవ రావులను అరెస్టు చేసి జైలుకు పంపినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. పోలీసుల దర్యాప్తులో తెలుస్తున్న వివరాల ప్రకారం సుమారు రెండు నెలల క్రితం హరికృష్ణ ప్రసాద్ తిరుమలశెట్టి లక్ష్మీ నాయుడు వద్ద రూ.2.30 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు తిరిగి ఇవ్వమని పలుమార్లు అడిగినప్పుడు, ఒక ట్రాక్టర్ వాహనాన్ని అప్పగించి, ఇంకా రూ.50,000 పెండింగ్‌లో ఉంచాడు.
ఈ అప్పు వివాదమే హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై గుడ్లూరు పోలీస్‌స్టేషన్‌లో క్రైం నంబర్ 107/2025 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు 103 (1), 109 BNS (302, 307 IPC) సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేశారు. నిందితుల ఆర్థిక ఆస్తుల వివరాలు సేకరించి, బాధిత కుటుంబానికి పరిహారం కోసం కోర్టుకు సమర్పిస్తున్నట్లు తెలిపారు.
కులాలకు ముడిపెట్టి రెచ్చగొట్టే విధంగా ప్రభుత్వం పై దుష్ప్రచారం చేయడాన్ని సీరియస్ గా తీసుకుంటామని పోలీసు ఎస్ పి వెల్లడించారు. అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు. అలాగే సామాజిక మాధ్యమాల్లో కేసుపై తప్పుడు ప్రచారం చేయడం, ద్వేషం రగిలించే పోస్టులు పెట్టడం, పోలీసు విభాగాన్ని అపహాస్యం చేసే కంటెంట్ సృష్టించడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
జాతి, మతం, భాష, వర్గం, ప్రాంతం లేదా సంస్థల మధ్య అసహనం కలిగించే పోస్టులు పెట్టిన వారిపై BNS 353(2), (3) సెక్షన్ల కింద చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో తప్పుడు కంటెంట్ సృష్టించి ప్రచారం చేసే వారిపై కూడా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామని, సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా ఉపయోగించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి చికిత్స ఖర్చులను కూడా తానే భరిస్తానని హామీ ఇచ్చారు. మృతుడి భార్యకు ఉపాధి కల్పించాలని ఆయన ఇప్పటికే జిల్లా కలెక్టర్ ను కోరగా అందుకు సంబంధించిన చర్యలు తీసుకుంటున్నారు. కొసమెరుపు ఏమిటంటే నిందితుడి కుటుంబం, బాధితుడి కుటుంబం కూడా చాలా సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ లోనే ఉన్నారు.