కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీ శరవేగంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. భారీ ప్రాజెక్టులు, లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో భారీ ప్రాజెక్టుకు కూటమి సర్కార్ శ్రీకారం చుట్టింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ప్రతిపాదించిన డ్రోన్ సిటీకి ఈ నెల 16వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. శ్రీశైలం పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ఈ కీలక ప్రాజెక్టుకు పునాదిరాయి వేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కలల ప్రాజెక్టుగా ఉన్న ఈ డ్రోన్ సిటీ, రాయలసీమ ప్రాంతానికే కాకుండా దేశంలోనే ఫస్ట్ అండ్ అతిపెద్ద డ్రోన్ సిటీగా రూపుదిద్దుకోనుంది.
కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలో దాదాపు 300 ఎకరాల విస్తీర్ణంలో డ్రోన్ సిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కేవలం తయారీ కేంద్రం మాత్రమే కాదు, డ్రోన్ టెక్నాలజీకి సంబంధించిన సమగ్ర కేంద్రంగా పనిచేయనుంది. ఇందులో డ్రోన్ల తయారీ, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, టెస్టింగ్ ఫెసిలిటీ, రిపేర్ సెంటర్స్, డ్రోన్ పైలట్‌లకు ట్రైనింగ్ అకాడమీ, కొత్త స్టార్టప్‌ల కోసం ఇంక్యుబేషన్ హబ్‌లు ఉంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కామన్ డ్రోన్ టెస్టింగ్ సదుపాయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యం.
కర్నూలు డ్రోన్ సిటీ ద్వారా సుమారు 40,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు డ్రోన్ టెక్నాలజీలో రాష్ట్రాన్ని దేశానికే డ్రోన్ క్యాపిటల్‌గా నిలపనుంది. ముఖ్యంగా రాయలసీమ యువతకు నైపుణ్యాభివృద్ధి, హై-టెక్ ఉద్యోగాలు లభించడంతో ప్రాంతీయ అసమానతలు తొలగిపోతాయి. గరుడ ఏరోస్పేస్ వంటి ప్రముఖ సంస్థలు ఇప్పటికే రూ. 100 కోట్ల పెట్టుబడిని ప్రకటించాయి. ఈ కేంద్రం దేశీయంగా డ్రోన్ల తయారీని పెంచడంతో పాటు, అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతులు చేసే ప్రధాన కేంద్రంగా మారుతుంది.
డ్రోన్ సిటీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలకంగా మారనుంది. వ్యవసాయంలో డ్రోన్ల ద్వారా ఎరువులు, పురుగుమందుల పిచికారీ, పంటల పర్యవేక్షణ ఇకపై మరింత సులభం కానుంది. వైద్యరంగంలో అత్యవసర మందులు, రక్త నమూనాలను మారుమూల ప్రాంతాలకు చేరవేయడంలో డ్రోన్ సేవలు కీలకం కానున్నాయి. అంతేకాక, శాంతిభద్రతల పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ, రవాణా మరియు మౌలిక సదుపాయాల పర్యవేక్షణలో డ్రోన్ల వినియోగం విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. ఈ సాంకేతికతతో ప్రభుత్వ సేవలు మరింత పారదర్శకంగా, ప్రజలకు వేగంగా అందుతాయి.
డ్రోన్ సిటీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే కంపెనీలకు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను అందిస్తోంది కూటమి సర్కార్. భూ కేటాయింపుల్లో రాయితీలు, సులభతర అనుమతుల ద్వారా పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తోంది. చైనా, బెల్జియం, అమెరికా లాంటి డ్రోన్ తయారీ దేశాలకు ధీటుగా ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ డ్రోన్ హబ్‌గా నిలపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.