అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనానికి కారణమయ్యారు. ఆయన మాట్లాడుతూ, “ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్–పాకిస్తాన్ మధ్య నెలకొన్న సంక్షోభాన్ని తానే ముగించానని” పునరుద్ఘాటించారు. వాణిజ్య మార్గాల ద్వారా ఆ వివాదాన్ని పరిష్కరించానని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను భారత విదేశాంగ మంత్రిత్వశాఖ (MEA) ఇప్పటికే పలు మార్లు ఖండించింది.
“మేము మళ్లీ ధనిక దేశంగా మారాం, శక్తివంతమైన దేశంగా ఉన్నాం. ఎందుకంటే నేను ఏడు యుద్ధాలను ముగించాను. వాటిలో కనీసం సగం నా వాణిజ్య, టారిఫ్ విధానాల వల్లే ఆగిపోయాయి. టారిఫ్ శక్తి లేకపోతే ఆ ఏడు యుద్ధాల్లో కనీసం నాలుగు ఇప్పటికీ కొనసాగుతున్నవే,” అని ట్రంప్ అన్నారు. భారత్–పాకిస్తాన్ విషయమై మాట్లాడుతూ “మీరు భారత్, పాకిస్తాన్‌ను చూడండి… వారు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు.
ఏడు విమానాలు కూల్చారు. నేను ఏమి చెప్పానో సరిగ్గా చెప్పదలుచుకోలేదు కానీ నా మాటలు చాలా ప్రభావవంతంగా పనిచేశాయి. మేము వందల బిలియన్ల డాలర్లు సంపాదించడమే కాకుండా, టారిఫ్‌ల వల్ల శాంతి సాధించగలిగాం,” అని ఆయన అన్నారు. అదే సమయంలో కెనడా ప్రధాని మార్క్ కార్నీ అమెరికా పర్యటనపై కూడా ట్రంప్ స్పందించారు.
“ఆయన వస్తున్నది టారిఫ్‌ల విషయమే మాట్లాడటానికి. ఎందుకంటే అనేక కంపెనీలు కెనడా, మెక్సికో, చైనా వంటి దేశాలనుంచి అమెరికాకు వస్తున్నాయి. ఇంత పెద్ద మార్పు ఇంతవరకు ఎవ్వరూ చూడలేదు,” అని వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 21న అమెరికా కార్నర్‌స్టోన్ ఇన్‌స్టిట్యూట్ ఫౌండర్ డిన్నర్‌లో పాల్గొన్న ట్రంప్ మాట్లాడుతూ, “నేను ఏడుగురు యుద్ధాలను ఆపాను.
అందుకే నోబెల్ బహుమతి ఇవ్వాలి” అని వ్యాఖ్యానించారు. “భారత్, పాకిస్తాన్, థాయ్‌లాండ్, కంబోడియా మధ్య యుద్ధాలను కూడా మేమే ఆపాము. వారు వాణిజ్యం చేయాలనుకున్నారు, దాంతోనే శాంతి సాధ్యమైంది,” అని తెలిపారు. ట్రంప్ తన జాబితాలో ఆర్మేనియా–అజర్‌బైజాన్, కొసోవో–సెర్బియా, ఇజ్రాయెల్–ఇరాన్, ఈజిప్ట్–ఇథియోపియా, రువాండా–కాంగో వంటి దేశాల మధ్య ఉన్న వివాదాలను కూడా తానే పరిష్కరించానని పేర్కొన్నారు.
“ఈ యుద్ధాలను చూశారా? భారత్, పాకిస్తాన్, థాయ్‌లాండ్, కంబోడియా, ఆర్మేనియా, అజర్‌బైజాన్, కొసోవో, సెర్బియా, ఇజ్రాయెల్, ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, రువాండా, కాంగో – వీటన్నిటిని మేమే ఆపాము. వాటిలో 60 శాతం వాణిజ్యం వల్లే ముగిశాయి,” అని ట్రంప్ అన్నారు. ట్రంప్ ఇంతకు ముందు చేసిన ఇలాంటి వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ ఇప్పటికే స్పష్టంగా స్పందించింది. “ఇండియా–పాకిస్తాన్ అంశం ద్వైపాక్షికం. మూడో దేశం జోక్యం ఉండదు,” అని భారత్ స్పష్టం చేసింది.