ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ దూకుడు కొనసాగుతోంది. త్యాగరాజ్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన 97వ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 30-25 పాయింట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది. ఈ సీజన్‌లో 17 మ్యాచ్‌లలో ఇది టైటాన్స్‌కు పదో విజయం. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో టైటాన్స్ మూడో స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. మరోవైపు 16 మ్యాచ్‌లలో 10వ ఓటమిని చవిచూసిన గుజరాత్‌కు ప్లేఆఫ్స్ ప్రయాణం దాదాపు కష్టంగా మారింది.
టైటాన్స్ విజయంలో కెప్టెన్ విజయ్ మాలిక్ (8 పాయింట్లు), భరత్ (7 పాయింట్లు) కీలక పాత్ర పోషించగా, డిఫెన్స్‌లో అంకిత్ (4) రాణించాడు. గుజరాత్ తరఫున హిమాన్షు సింగ్ 6, హెచ్‌ఎస్ రాకేష్ 5, డిఫెన్స్‌లో లక్కీ 4 పాయింట్లు సాధించారు.
పోరు హోరాహోరీగా..
రెండు జట్లు ఆరంభంలో ఆచితూచి ఆడాయి. ఆరు నిమిషాల ఆట తర్వాత స్కోరు 4-4తో సమమైంది. ఆ తర్వాత రెండు పాయింట్లు సాధించిన టైటాన్స్ 6-4 ఆధిక్యం సాధించింది. అయితే, గుజరాత్ రైడ్, డిఫెన్స్‌తో స్కోరును సమం చేసింది. బ్రేక్ తర్వాత రెండు జట్లకు డిఫెన్స్‌లో చెరొక పాయింట్ లభించింది. హిమాన్షు అంకిత్‌ను ఔట్ చేసి తొలిసారి గుజరాత్‌కు ఆధిక్యం అందించినా, విజయ్ వెంటనే స్కోరును 8-8తో సమం చేశాడు.
ఆ తర్వాత టైటాన్స్ వరుసగా మూడు పాయింట్లు సాధించి ఆధిక్యాన్ని పెంచుకుంది. గుజరాత్ కూడా వరుసగా మూడు పాయింట్లు సాధించి తేడాను తగ్గించింది. హాఫ్‌టైమ్ సమయానికి స్కోరు 11-11తో సమంగా నిలిచింది.
ముందుకు దూసుకెళ్లిన టైటాన్స్
ద్వితీయార్థంలో తొలి రెండు నిమిషాల ఆట తర్వాత కూడా స్కోరు 13-13తో సమంగా ఉంది. కానీ టైటాన్స్ త్వరలోనే మూడు పాయింట్ల ఆధిక్యం సాధించింది. విశ్వంత్ ‘డూ ఆర్ డై’ రైడ్‌లో పాయింట్ సాధించి స్కోరును 14-16 చేయగా, లక్కీ భరత్‌ను ఔట్ చేసి పాయింట్ల తేడాను 1కి తగ్గించాడు. హిమాన్షు రైడ్‌లో రెండు జట్లకు చెరొక పాయింట్ లభించింది. 30 నిమిషాల ఆట ముగిసే సమయానికి గుజరాత్ స్కోరును 17-17తో సమం చేసింది.
కానీ ఆ తర్వాత టైటాన్స్ తమ పట్టు బిగించింది. భరత్ మల్టీ-పాయింటర్ రైడ్ సాయంతో 21-18 ఆధిక్యం సాధించింది. అనంతరం టైటాన్స్ గుజరాత్‌ను సూపర్ ట్యాకిల్ స్థితిలోకి నెట్టి, భరత్ సహాయంతో ‘ఆలౌట్’ చేసి 24-19 ఆధిక్యం సంపాదించింది. ఆలౌట్ తర్వాత గుజరాత్ రెండు పాయింట్లకు బదులుగా మూడు పాయింట్లు సాధించి తేడాను 4కు తగ్గించింది.
38వ నిమిషం వరకు ఈ తేడా అలాగే కొనసాగింది. ఈ దశలో అజిత్, షాద్లూను ట్యాకిల్ చేయడంతో స్కోరు 28-23కి చేరింది. ఇక్కడి నుంచి గుజరాత్‌కు తిరిగి పుంజుకోవడం కష్టమైంది. చివరకు 3 పాయింట్ల తేడా వరకు తగ్గించినా, గుజరాత్ ఈ సీజన్‌లో 10వ ఓటమిని తప్పించుకోలేకపోయింది. ఈ ఓటమితో గుజరాత్‌కు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపుగా మూసుకుపోయాయి.