ముఖ్యంశాలు హోమ్

ట్రిలియన్ డాలర్ ఎకానమీగా విశాఖ

విశాఖపట్నంలో నవంబర్ 14,15 తేదీల్లో రెండు రోజుల పాటు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు తరలివచ్చి రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను పరిశీలించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్(AIBC) ప్రతినిధులతో సిడ్నీలోని న్యూసౌత్ వేల్స్ పార్లమెంట్ ఆవరణలో నిర్వహించిన సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇక్కడకు నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఆస్ట్రేలియా స్కిల్ అండ్ ట్రైనింగ్ మినిస్టర్ ఆండ్రూ గారు ఎక్కువ సమయం నాతోపాటే ప్రయాణించి అనేక అంశాలను వివరించారు. ఇందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఏపీలో ఎందుకు పెట్టుబడులు పెట్టాలో మీకు మూడు కారణాలు చెబుతాను. మొదటిది ఏపీలో అనుభవం కలిగిన సమర్థ నాయకత్వం ఉంది. చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన 75 ఏళ్ల యువకుడు. ఈ సారి గెలిచిన ఎమ్మెల్యేల్లో 50 శాతం మంది యువకులు ఉన్నారు. 25 మంది మంత్రుల్లో 17 మంది కొత్తవారు ఉన్నారు. మేమంతా కసితో, పట్టుదలతో పనిచేస్తున్నాం. హైదరాబాద్ ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం చంద్రబాబునాయుడు గారు. ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ ను పునర్ నిర్మించేందుకు ప్రజలు అవకాశం ఇచ్చారు.

రెండో కారణం స్పీడ్ ఆప్ డూయింగ్ బిజినెస్. ఇందుకు కొన్ని ఉదాహరణలు చెబుతాను. మీలో చాలామందికి గూగుల్ ప్రకటన తెలిసే ఉంటుంది. భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విశాఖకు వచ్చింది. ఇది కేవలం డేటా సెంటర్ మాత్రమే కాదు.. గ్రీన్ ఫీల్డ్ డేటా సెంటర్ తో పాటు సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కూడా విశాఖకు రాబోతోంది. ఇందుకు కావాల్సిన ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేసేందుకు ఎదురుచూస్తున్నాం.

ఆస్ట్రేలియాలో కూడా కొంతమంది డేటా సెంటర్ డెవలపర్లను కలిశాను. వారిని విశాఖకు ఆహ్వానించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ను 13 నెలల్లో పూర్తి చేశాం. గూగుల్ తో అంగీకరించిన సమయం కంటే కేవలం ఒక నెల ఎక్కువ. ఏపీతో కలిసి పనిచేయాలని ఒకసారి నిర్ణయించాక అది మీ ప్రాజెక్ట్ కాదు.. మన ప్రాజెక్ట్. మొదట ఒక వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేస్తాం. రోజూ సదరు ప్రాజెక్ట్ ల గురించి సమీక్షిస్తాం. ఇప్పుడు 25 వాట్సాప్ గ్రూప్ లు ఉన్నాయి. నా కార్యాలయం నుంచి అప్ డేట్స్ వెళ్తాయి.

సంబంధిత మంత్రులు కూడా వాటిల్లో పాల్గొంటారు. ఉదాహరణకు రాష్ట్రవ్యాప్తంగా రిలయన్స్ పెద్దఎత్తున ఏర్పాటుచేస్తున్న సీబీజీ ప్రాజెక్ట్ విషయంలో విద్యుత్ శాఖ మంత్రి, రెవెన్యూ మంత్రితో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటుచేశాం. రోజువారీ విధానంలో ప్రాజెక్ట్ ను సమీక్షిస్తాం. అప్ డేట్ రాకపోతే నేనే స్వయంగా స్టేటస్ ను అడిగి తెలుసుకుంటాను. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు మరో ఉదాహరణ ఆర్సెల్లర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్. ఇండియాలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ ను విశాఖలో నిర్మిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ ను 15 నెలల్లో పూర్తిచేశాం. మేం ఎలాంటి ఎంవోయూ చేసుకోలేదు. ఇది గ్రౌండింగ్ దశలో ఉన్న ప్రాజెక్ట్. గత 16 నెలల్లో ఏపీకి రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇందుకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానమే కారణం. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మేం చేసి చూపిస్తున్నాం. మూడు రోజుల్లో ప్రాజెక్ట్ కు క్లియరెన్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎస్ఐపీసీ, ఎస్ఐపీబీ, కేబినెట్.. మూడు దశల్లో మూడు రోజుల్లోనే ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తోంది.

మూడో కారణం స్టార్టప్ స్టేట్. పెట్టుబడుల కోసం మేం ఆకలితో ఉన్నాం. త్వరితగతిన పనులు పూర్తిచేయాలనే తపనతో ఉన్నాం. మాది జాతీయ దృక్పథం కలిగిన ప్రాంతీయ పార్టీ. జాతీయ విధానాలపై సానుకూల ప్రభావం చూపగలమని నమ్ముతున్నాం. అవి దేశానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ముందుగా ఏపీకి ప్రయోజనం కలుగుతుంది.

గతంలో కూడా విమానాశ్రయాల ప్రైవేటీకరణ, టెలికం రంగంలో సంస్కరణలు, డిజిటల్ కరెన్సీ.. ఇప్పుడు డేటా సెంటర్స్ విషయంలో సానుకూల ప్రభావం చూపించాం. మిగతా రాష్ట్రాలు కూడా పెట్టుబడుల కోసం పోటీపడటం మంచి పరిణామం. రాష్ట్రాలు పోటీపడితేనే భారత్ గెలుస్తుంది. ఇది న్యూ ఇండియా. మోదీ గారి నాయకత్వంలో 30 ట్రిలియన్ డాలర్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇది సాధ్యమే. ఇందులో ఎలాంటి అనుమానం లేదు.

ఆ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ 2.4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్కరణలను మేం ముందుండి అమలుచేస్తున్నాం. ఉదాహరణకు కార్మిక సంస్కరణలు. 9 సంస్కరణల్లో 8 సంస్కరణలను 15 రోజుల్లోనే పూర్తిచేశాం. తొమ్మిదవది వచ్చే కేబినెట్ లో ఆమోదం పొందుతుంది. సంస్కరణల ద్వారానే బ్యూరోక్రటిక్ అడ్డంకులను తొలగించవచ్చని చంద్రబాబు గారు ఎప్పుడూ విశ్వసిస్తారు.

విశాఖ అంటే ఎంతో ప్రేమ. ఇది బెంగుళూరు, గోవా రెండు ప్రపంచాల మేళవింపు. గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుంది. గూగుల్ ప్రకటన తర్వాత విశాఖలో కొత్త ఉత్సాహం, శక్తి వచ్చింది. మౌలిక సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. మాకు కావాల్సింది సమస్యల్లేని అభివృద్ధి. నాయుడు గారి దార్శనిక నాయకత్వం వల్లే ఇది సాధ్యమవుతోంది. మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నారు. కాబట్టి ఏపీకి వచ్చి రెండు రోజులు గడపాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అప్పుడే మా శక్తి, ఉత్సాహం మీకు తెలుస్తాయి. ఇదొక అద్భుతమైన కాన్ఫరెన్స్. ఏపీ గురించే కాకుండా మిగతా రాష్ట్రాలు కూడా తమ ప్రాజెక్ట్ లను ప్రదర్శిస్తాయి.

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం

పలువురు పారిశ్రామికవేత్తలు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి తేడా ఏమిటని ప్రశ్నించగా.. 2024 ఎన్నికల్లో పోటీచేసిన స్థానాల్లో 94శాతం విజయం సాధించామని అన్నారు. ఉద్యోగాల కల్పన కోసం ప్రజలు మాకు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మేం హామీ ఇచ్చాం. అందుకే నేను ఇక్కడకు వచ్చాను. గత ఐదేళ్లలో పలు ఇబ్బందులు తలెత్తాయి. 2014-19 మధ్య పాలసీల్లో ఒక్కటి కూడా మేం రద్దు చేయలేదు. ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. చంద్రబాబునాయుడు, మోడీ నాయకత్వంలో ఏపీలో సమగ్రాభివృద్ధి జరుగుతుంది.

స్కిల్ డెవలప్ మెంట్, ఎడ్యుకేషన్, మైనింగ్, అగ్రిటెక్, రెన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ మాలిక్యూల్స్, డిఫెన్స్, ఏరోస్పేస్, కంప్రెస్డ్ బయోగ్యాస్, క్యాంటమ్ కంప్యూటింగ్, ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫాక్చరింగ్, స్టీల్, ఆక్వా రంగాల్లో వంటి రంగాల్లో ఏపీ-ఆస్ట్రేలియా కలిసి పనిచేసే అవకాశం ఉందని మంత్రి వివరించారు.

అంతకుముందు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు గల అవకాశాలను వివరిస్తూ వీడియోను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ నేషనల్ అసోసియేట్ ఛైర్, న్యూసౌత్ వేల్స్ ప్రెసిడెంట్ ఇర్ఫాన్ మాలిక్, న్యూ సౌత్ వేల్స్ లెజిస్లేటివ్ అసెంబ్లీ రివర్ స్టోన్ మెంబర్, ఎంపీ వారెన్ కిర్బీ, ఆస్ట్రేలియా స్కిల్ అండ్ ట్రైనింగ్ మినిస్టర్ ఆండ్రూ గైల్స్, సిడ్నీలో భారత కాన్సులేట్ జనరల్ డాక్టర్ ఎస్.జానకి రామన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అమెరికాలో హోరెత్తిన ట్రంప్ వ్యతిరేక నిరసనలు

Satyam News

హనుమాన్ విగ్రహంపై దారుణ వ్యాఖ్యలతో వివాదం

Satyam News

తిరగబడ్డ ఒరిస్సా బస్సు

Satyam News

Leave a Comment

error: Content is protected !!