బెంగళూరు నగరంలో చోటు చేసుకున్న ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 25 ఏళ్ల ఎలక్ట్రీషియన్ తన భార్యను హత్య చేసి, ఆ మరణాన్ని ప్రమాదవశాత్తు జరిగిన కరెంట్ షాక్‌గా నమ్మించేందుకు ప్రయత్నించాడు. అయితే, పోస్ట్‌మార్టం నివేదికలో అసలు విషయం బయటపడటంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మార్గొండనహళ్లికి చెందిన ప్రశాంత్ కమ్మర్ అనే ఎలక్ట్రీషియన్, రష్మా కమ్మర్ (32)ను సుమారు తొమ్మిది నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకుని వివాహం చేసుకున్నాడు. వీరు రష్మాకు మొదటి వివాహం ద్వారా కలిగిన 15 ఏళ్ల కూతురితో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. అక్టోబర్ 15న రష్మా బాత్‌రూమ్‌లో అపస్మారక స్థితిలో పడి ఉందని ఆమె కూతురు అత్తకు ఫోన్ చేయడంతో విషయం బయటపడింది. ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
తన భార్య వేడి నీటి కోసం ఇమ్మర్షన్ కాయిల్ వాడుతుండగా కరెంట్ షాక్‌తో చనిపోయిందని నిందితుడు ప్రశాంత్ పోలీసులకు తెలిపాడు. అయితే, రష్మా మెడపై గాయాలు ఉండటం, నిందితుడి కథనంలో పొంతన లేకపోవడంతో ఆమె బంధువులు అనుమానం వ్యక్తం చేశారు.
దీంతో పోలీసులు పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఆ నివేదికలో రష్మా కరెంట్ షాక్‌తో కాకుండా, గొంతు నులమడం (Strangulation) వల్ల చనిపోయినట్లు స్పష్టమైంది. ఈ నివేదికతో పోలీసులు ప్రశాంత్‌ను గట్టిగా ప్రశ్నించగా, అతను నేరం అంగీకరించాడు.
వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో తానే గదిలో గొంతు నులిమి చంపినట్లు ప్రశాంత్ ఒప్పుకున్నాడు. ఆ తర్వాత మృతదేహాన్ని బాత్‌రూమ్‌కు తీసుకెళ్లి, కరెంట్ షాక్‌గా చిత్రీకరించేందుకు ఇమ్మర్షన్ కాయిల్‌ను పక్కన పెట్టానని చెప్పాడు.
ప్రశాంత్ కమ్మర్‌పై పోలీసులు సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. ప్రస్తుతం అతను పరప్పన అగ్రహారలోని బెంగళూరు సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.