ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నెల్లూరు జిల్లా మైపాడు గేటులో ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ ను వర్చువల్‌గా ప్రారంభించారు. రూ. 7 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా ఏర్పాటు చేసిన ఈ స్మార్ట్ కంటెయినర్ షాపులు వీధి వ్యాపారులకు స్థిరమైన వ్యాపార వేదికను కల్పించనున్నాయి. ఈ మార్కెట్‌లో మొత్తం 30 మోడ్యులర్ కంటెయినర్లతో 120 షాపులు ఏర్పాటు చేశారు.
ప్రతి కంటెయినర్‌లో 4 షాపులు ఉండేలా ప్రభుత్వం వినూత్నంగా రూపకల్పన చేసింది. ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ స్మార్ట్ వెండింగ్ మార్కెట్ ద్వారా మహిళలు, దివ్యాంగులు, వెనుకబడిన వర్గాలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. వీధి వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా స్థిరమైన వ్యాపారం చేసుకునే వేదికను ప్రభుత్వం అందిస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ కొత్త ఆలోచనకు ప్రశంసలు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేషన్ ఛైర్మన్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు.