సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణకు స్వాతంత్రం దక్కిన సందర్భంగా పండగ రోజు కానీ, ఇక్కడ మాత్రం ఏ ప్రత్యేకత లేకుండా పోయిందని బిజెపి జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో డీకే బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు మాట్లాడుతూ ఆగస్టు 15, 1947న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా, దేశ నడిబొడ్డున ఉన్న తెలంగాణ ప్రాంతం మాత్రం నిజాం నియంతృత్వం, రజాకార్ల అకృత్యాల మధ్య నలిగిపోయింది.
నిజాం రాజ్యంలో వందేమాతరం అంటే నేరమైంది… భారత్ మాతా కీ జై నినాదం శిక్షార్హం అయ్యింది… హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసేందుకు ససేమిరా అన్న నిజాం సొంత ఇస్లామిక్ దేశంగా ఉండాలని భావించాడు, కుదరని పక్షంలో పాకిస్తాన్ తో హైదరాబాద్ ను కలిపే ప్రయత్నం చేశాడు. నియంతృత్వాన్ని ఎదిరించిన ఇక్కడి ప్రజల వీరత్వానికి, ‘ఆపరేషన్ పోలో’ పేరిట పోలీస్ యాక్షన్ చేపట్టిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ధీరత్వం తోడవడంతో, భారత సైన్యం చేతిలో ఓడిన నిజాం 1948 సెప్టెంబర్ 17న లొంగిపోవడంతో తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చింది.
2014లో స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించుకోవచ్చని ప్రజలు అనుకున్నారు. కానీ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వంద్వ వైఖరి వల్ల తెలంగాణ ప్రజల ఆశలు అడియాసలే అయ్యాయి. ఉద్యమ కాలంలో 17 సెప్టెంబర్ అధికారికంగా ఎందుకు నిర్వహించరు అని నిలదీసిన కేసీఆర్ అధికారంలోకి రాగానే ఓవైసీలకు తలొగ్గి స్వరం మార్చారు.
రజాకార్ల వారసులైన ఎంఐఎంకు భయపడి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వమ్ము చేశారు. కేంద్రమే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్వహించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, సెప్టెంబర్ 17 ప్రాధాన్యాన్ని తప్పుదారి పట్టించేలా గత ముఖ్యమంత్రి కేసీఆర్ ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’గా, ప్రస్తుత రేవంత్ రెడ్డి సర్కార్ ‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం’గా వేడుకలను అధికారికంగా నిర్వహించారు.
పక్కదారి పట్టించే మారుపేర్లతో కాకుండా సెప్టెంబర్ 17 వేడుకలను ‘తెలంగాణ విమోచన దినోత్సవం’గానే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు నాయకత్వంలో బిజెపి పోరాటాలు కొనసాగిస్తోంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగి సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాలను జరపాలని కోరుకుంటున్నాం.
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకుందాం.. నిజాం, రజాకార్లను ఎదిరించిన యోధులను స్మరించుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శిలు రవి కుమార్ ఎక్బోటే, శ్యామ్ రావ్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లు బండల వెంకట రాములు,అక్కల రమాదేవి, పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ,మహిళ మోర్చా ఉపాధ్యక్షురాలు సమత, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దాస్, రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్య వర్గ సభ్యుడు అనిల్ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు,నరసింహ శెట్టి, బిజెపి సీనియర్ నాయకులు గాంజ సాయి, అసిఫ్,వాసు,తదితరులు ఉన్నారు.