మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామంలో బిజెపి మండల అధ్యక్షుడు యేట మధుకర్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో బిజెపి శ్రేణులు షాక్‌కు గురయ్యాయి. స్థానిక సమాచారం ప్రకారం, మధుకర్ పార్టీ కోసం నిరంతరం శ్రమించారు.
రాజకీయ ఒత్తిళ్లు, కాంగ్రెస్ నాయకుల వేధింపులు ఆయనను తీవ్ర మనస్థాపానికి గురి చేశాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆయనపై తప్పుడు కేసులు నమోదు చేయడంతో తీవ్ర నిరాశకు గురై ఈ దారుణ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మధుకర్ మృతిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “రాజకీయ కక్షలతో నిరపరాధ కార్యకర్త ప్రాణాలు కోల్పోవడం విచారకరం” అని ఖండించారు.
కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాన్ని ప్రజలు తిరస్కరించాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నీల్వాయి గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.