గూగుల్ $15 బిలియన్ల (సుమారు ₹1,25,000 కోట్లు)భారీ పెట్టుబడితో విశాఖపట్నం ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. అమెరికా వెలుపల గూగుల్ అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హబ్‌గా ఇది రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో, టెక్ దిగ్గజాలు తమ వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ గిగావాట్-స్కేల్ AI డేటా సెంటర్‌ను కేవలం డేటా స్టోరేజ్ సెంటర్‌గా చూడలేం. ఇది భవిష్యత్తులో భారత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు, అంతర్జాతీయ AI ఆవిష్కరణలకు డిజిటల్ బ్యాక్‌బోన్ గా పనిచేయనుంది. ఈ చారిత్రక అభివృద్ధిపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేయగా, కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ దీనిని ‘AI మౌలిక సదుపాయాలకు, స్టార్టప్‌లకు, పరిశోధనలకు’ ప్రధాన శక్తిగా అభివర్ణించారు.
అంతర్జాతీయంగా, ఈ పెట్టుబడిని ప్రపంచ టెక్ దిగ్గజాల మధ్య AI ఆధిపత్యం కోసం జరుగుతున్న రేసులో భారతదేశం వ్యూహాత్మక విజయంగా చూస్తున్నారు. గూగుల్ ఈ మెగా ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,88,000 మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. ఈ ఉద్యోగాలలో కేవలం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు మాత్రమే కాకుండా, పలు కీలక రంగాల నిపుణులు కూడా ఉంటారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు మెషీన్ లెర్నింగ్ (ML) ఇంజనీర్లు
గూగుల్ టెన్సార్ ప్రాసెసింగ్ యూనిట్స్ (TPU), గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ (GPU) ఆధారిత కంప్యూట్ పవర్‌ను ఉపయోగించి, జెమిని వంటి పెద్ద భాషా నమూనాలకు (LLMs) శిక్షణ ఇవ్వడం, వాటిని నిర్వహించడం ఇక్కడ నుంచి చేస్తారు.
క్లౌడ్ ఆర్కిటెక్టులు (Cloud Architects): ఎంటర్‌ప్రైజ్ కస్టమర్‌ల కోసం గూగుల్ క్లౌడ్ సేవలను రూపొందించడం, క్లౌడ్ మౌలిక సదుపాయాలను ఆప్టిమైజ్ చేయడం.
సైబర్ సెక్యూరిటీ మరియు డేటా గోప్యతా నిపుణులు:
భారతదేశపు డేటా సార్వభౌమాధికారం (Data Sovereignty) మరియు భద్రతా అవసరాలకు అనుగుణంగా గిగావాట్-స్కేల్ డేటా సెంటర్ భద్రతను పర్యవేక్షించడం.
డేటా సెంటర్ టెక్నీషియన్లు: సర్వర్లు, నెట్‌వర్క్ పరికరాలు మరియు స్టోరేజ్ సిస్టమ్‌ల ఇన్‌స్టాలేషన్, నిర్వహణ మరియు ట్రబుల్‌షూటింగ్. 24/7 పర్యవేక్షణ మరియు నిర్వహణకు అవసరమైన సాంకేతిక సిబ్బందిని నియమిస్తారు.
నెట్‌వర్క్ ఇంజనీర్లు: హై-కెపాసిటీ, లో-లాటెన్సీ ఫైబర్-ఆప్టిక్ నెట్‌వర్క్‌లను రూపొందించడం మరియు నిర్వహించడం, సబ్‌సీ కేబుల్ లాండింగ్ స్టేషన్ (CLS) కనెక్టివిటీని పర్యవేక్షించడం.
కూలింగ్ & ఎలక్ట్రికల్ ఇంజనీర్లు: 1 GW డేటా సెంటర్ కోసం క్లీన్ ఎనర్జీ సరఫరా, బ్యాకప్ పవర్ మరియు అత్యాధునిక శీతలీకరణ వ్యవస్థల నిర్వహణ.
ఈ పరోక్ష ఉద్యోగాలు రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్ మరియు రవాణా రంగాలలో కూడా పెను మార్పులు తీసుకువస్తాయి. సుందర్ పిచాయ్ పోస్ట్‌లో పేర్కొన్నట్లుగా, ఈ హబ్ కొత్త అంతర్జాతీయ సముద్రగర్భ గేట్‌వే (new international subsea gateway) మరియు కేబుల్ మౌలిక సదుపాయాలను కలిగి ఉంటుంది. రాయిటర్స్ ఇతర వార్తా సంస్థలు దీనిని భారతదేశానికి మరో కీలకమైన అంతర్జాతీయ ఇంటర్నెట్ గేట్‌వేగా అభివర్ణించాయి. వైజాగ్ ప్రపంచ నెట్‌వర్క్‌తో నేరుగా అనుసంధానించబడి, తక్కువ జాప్యం (low-latency) గల AI సేవలకు కీలక కేంద్రంగా మారుతుంది.
క్లీన్ ఎనర్జీ మరియు గిగావాట్ పవర్:
డ్యూయిష్ వెల్లే (DW) ఈ ప్రాజెక్ట్‌లో క్లీన్ ఎనర్జీపై పెడుతున్న దృష్టిని ప్రత్యేకంగా ప్రశంసించింది. గిగావాట్ స్కేల్‌లో పనిచేయడానికి అవసరమైన భారీ స్థాయి విద్యుత్ మౌలిక సదుపాయాలను ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఇందులో పునరుత్పాదక శక్తి (clean energy) ఉత్పత్తి, నిల్వ వ్యవస్థలు కూడా ఉంటాయి. AdaniConneXతో కలిసి కొత్త ట్రాన్స్‌మిషన్ లైన్లు, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా, వైజాగ్ ‘గ్రీన్ AI’ కి ఒక మోడల్‌గా నిలవబోతోంది. రాయిటర్స్ విశ్లేషణలో, ఈ భారీ పెట్టుబడి అమెరికా మరియు భారత్ మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక టెక్ భాగస్వామ్యం చెక్కుచెదరలేదని ప్రపంచానికి సందేశం ఇస్తోందని పేర్కొంది.
విశాఖపట్నంలో గూగుల్ పెట్టుబడి అంచనా $10 బిలియన్ల నుండి $15 బిలియన్లకు పెరగడం వెనుక ఉన్న ప్రధాన కారణం, భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అవసరాలకు సరిపోయేలా ఈ హబ్‌ను ప్రపంచంలోనే అత్యంత అత్యాధునిక మౌలిక సదుపాయంగా తీర్చిదిద్దాలనే గూగుల్ వ్యూహాత్మక నిర్ణయమే. ఈ అదనపు $5 బిలియన్ల పెంపు ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్‌ను గిగావాట్ (GW) స్కేల్‌లో నిర్మించడానికి, అంటే భారీ AI నమూనాలకు (LLMs) శిక్షణ ఇవ్వడానికి అవసరమైన అత్యంత ఖరీదైన TPUలు, GPUలతో కూడిన కంప్యూటింగ్ శక్తిని స్థాపించడానికి వినియోగిస్తారు. అలాగే, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజాలతో పెరుగుతున్న గ్లోబల్ AI రేసులో, తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి, భారత్‌లో దీర్ఘకాలికంగా బహుళ గిగావాట్ల సామర్థ్యం కోసం పునాది వేయడానికి ఈ భారీ పెట్టుబడి అవసరం.
సరిగ్గా 11 ఏళ్ల క్రితం మనం ఇదే నెలలో విశాఖ కోసం దీపావళి టపాకాయలు కాల్చలేదు. సీఎం చంద్రబాబునాయుడి పిలుపుతో కేవలం దీపం వెలిగించి, హుద్‌హుద్ విషాదంలో యావత్తు ఆంధ్రా అండగా నిలబడింది. ఆ నాడు అక్కడే బస్సులో ఉండి చంద్రబాబునాయుడు తిరిగి నగరాన్ని పూర్వ స్థితికి తెచ్చి, వెంటనే క్లీన్ సిటీగా దేశంలో నిలబెట్టారు.