ముఖ్యంశాలు హోమ్

గూగుల్ రాకతో ప్రపంచం చూపు ఏపీ వైపు

#Modi

వికసిత్ ఏపీతోనే వికసిత్ భారత్ లక్ష్యం సాకారం అవుతుందని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. స్థానిక ఉత్పత్తులను ప్రొత్సహించినప్పుడే జీఎస్టీ సంస్కరణలకు సార్థకత చేకూరుతుందని స్పష్టం చేశారు. వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ వంటివి సాకారం కావడంలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని స్పష్టం చేశారు.

ఏపీ యువత ఎంతో చైతన్య కలిగిన వారని… సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వంటి వారి నేతృత్వంలో ఏపీ అభివృద్ధి పథంలో వెళ్తోందని… కేంద్రం కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహకరిస్తుందని ప్రధాని చెప్పారు. సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ బహిరంగ సభ గురువారం నన్నూరు చెక్ పోస్ట్ సమీపంలో జరిగింది.

శ్రీశైలంలో మల్లిఖార్జున స్వామి వారిని, భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం  అనంతరం ప్రధాని కర్నూలు చేరుకున్నారు. కర్నూలులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ జీఎస్టీ బచత్ ఉత్సవ్ పై ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదికకు చేరుకున్న ప్రధానికి మంత్రులు, ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు.

హెలీప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓపెన్ టాప్ జీపులో ప్రజలకు అభివాదం చేస్తూ వేదికపైకి చేరుకున్నారు. ఓపెన్ టాప్ జీపులో ర్యాలీగా వచ్చిన ముగ్గురు నేతలకు భారత్ మాతాకీ జై అంటూ మువ్వెన్నల జెండాలతో ప్రజలు స్వాగతం పలికారు.

బహిరంగ సభలో జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ…”ఆంధ్రప్రదేశ్ శాస్త్రసాంకేతికంగా అభివృద్ధి చెందిన ప్రాంతం, యువత ఎంతో చైతన్యవంతులు. ఏపీలో విజన్ ఉన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ లాంటి నేతలు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంది. గత 16 నెలల్లో డబుల్ ఇంజన్ సర్కారు వల్ల ఏపీలో ప్రగతి వేగంగా జరుగుతోంది. ఢిల్లీ, అమరావతిలు రెండూ  అభివృద్ది దిశగా వేగంగా ముందుకు వెళ్తున్నాయి.

దేశ ఆర్ధిక విప్లవానికి ఆంధ్రప్రదేశ్ ఓ కీలక ప్రాంతంగా ఉంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ది దిశగా నడుస్తోంది. భారత్ దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రగతి వేగాన్ని ప్రపంచం గమనిస్తోంది. గూగుల్ లాంటి ఐటీ దిగ్గజం ఏపీలో అతిపెద్ద పెట్టుబడిని ప్రకటించింది. దేశపు తొలి అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రం విశాఖలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

అమెరికా వెలుపల భారీ పెట్టుబడితో ఏపీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ పెడుతున్నట్టు గూగుల్ సీఈఓ నాతో చెప్పారు. డేటా సెంటర్, ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్ లాంటి అత్యాధునిక మౌలిక సదుపాయాలు ఈ కేంద్రంలో ఏర్పాటు కాబోతున్నాయి. ప్రపంచ దేశాలను కలుపుతూ వేయనున్న సబ్ సీ కేబుల్ ద్వారా తూర్పు తీరం బలోపేతం అవుతుంది. విశాఖలో ఏర్పాటు కానున్న కనెక్టివిటీ హబ్ భారత్ కే కాదు ప్రపంచానికి సేవలందిస్తుంది.

ఈ విషయంలో సీఎం చంద్రబాబు విజన్ ను అభినందిస్తున్నాను. 21వ శతాబ్దపు మాన్యుఫాక్చరింగ్ కేంద్రంగా ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారత్ ఉత్పత్తి కేంద్రంగా రూపు దిద్దుకుంటోంది. ఆత్మనిర్భర్ భారత్ లో ఏపీ కీలకంగా మారింది.” అని ప్రధాని అన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రగతిని కాంగ్రెస్ నాశనం చేసింది

“కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ ప్రగతిని నాశనం చేశాయి. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఏపీ ప్రగతి ద్వారాలు తెరుచుకుని వేగంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. దేశ ప్రగతికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చాలా కీలకం. రాయలసీమ అభివృద్ధితోనే ఏపీ అభవృద్ధి ఉంది.

కర్నూలులో ప్రారంభించిన ప్రాజెక్టులు రాయలసీమ ప్రాంత ప్రగతికి సరికొత్త ద్వారాలు తెరుస్తాయి. పారిశ్రామిక అభివృద్ది వేగంగా జరుగుతుంది. ఏపీ వేగవంతమైన అభివృద్ధి కోసం కొప్పర్తి -ఒర్వకల్ పారిశ్రామిక నోడ్ల ద్వారా పచ్చే పెట్టుబడులతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రాయలసీమలోని ప్రతి జిల్లాలోనూ ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. ఆత్మనిర్భర్ భారత్ కు సరికొత్త శక్తిగా ఏపీ తయారవుతోంది.

కృష్ణా జిల్లా నిమ్మకూరులో రక్షణ రంగానికి చెందిన నైట్ విజన్ గాగుల్స్, క్షిపణుల సెన్సార్లు, డ్రోన్ గార్డులను తయారు చేసే సంస్థ ఏర్పాటు కావడం ముదావహం. రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతులు కూడా చేసేందుకు ఆస్కారం ఇస్తుంది. ఆపరేషన్ సింధూర్ లో దేశంలో తయారైన ఉత్పత్తుల బలం ఏమిటో చూశాం.

కర్నూలును భారత్ డ్రోన్ హబ్ తయారు చేయాలని ఏపీ నిర్ణయించటం సంతోషం. ఆపరేషన్ సింధూర్ ద్వారా డ్రోన్ల పనితీరు ఏమిటో తెలియచెప్పింది. డ్రోన్ల తయారీ ద్వారా కర్నూలు భారత్ కు ఓ గర్వకారణంగా నిలుస్తుంది.” అని ప్రధాన మంత్రి చెప్పారు.

ప్రారంభించిన ప్రాజెక్టులు ప్రగతికి మార్గాలు

“ఈ ప్రాజెక్టులన్నీ రాష్ట్రంలో కనెక్టివిటి బలోపేతం కావటంతో పాటు పరిశ్రమలను బలోపేతం చేస్తాయి. ఈ ప్రాజెక్టులతో కర్నూలుతో పాటు పరిసర ప్రాంతాలకు ప్రయోజనం కలుగుతుంది. దేశానికైనా, రాష్ట్రానికైనా ఇంధన భద్రత అవసరం. ప్రస్తుతం 3 వేల కోట్ల విలువైన ట్రాన్స్ మిషన్ ప్రాజెక్టులను ప్రారంభించాం. తద్వారా దేశ ఇంధన సామర్ధ్యం పెరుగుతుంది.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్లాక్ అవుట్ లాంటి విద్యుత్ సంక్షోభాలు వచ్చాయి. తలసరి విద్యుత్ వినియోగం 1000 యూనిట్ల కంటే తక్కువే ఉంది. చాలా గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు కూడా లేని పరిస్థితి. ఇప్పుడు క్లీన్ ఎనర్జీ నుంచి మన అవసరాలకు తగినంత ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తున్నాం. 1400 యూనిట్ల తలసరి విద్యుత్ వినియోగం ఇప్పుడు దేశంలో ఉంది. తగినంత విద్యుత్ దేశ ప్రజలకు లభ్యం అవుతోంది.

శ్రీకాకుళం నుంచి ఆంగుల్ వరకూ గ్యాస్ పైప్ లైన్ ను జాతికి అంకితం చేశాం. 20 వేల సిలెండర్ల సామర్ధ్యంతో ఇండేన్ బాటిలింగ్ ప్లాంట్ ను చిత్తూరులో ప్రారంభించాం. మల్టీమోడల్ ఇన్ఫ్రా ప్రాజెక్టులతో కనెక్టివిటీ పెంచుతున్నాం. సబ్బవరం నుంచి షీలా నగర్ వరకూ కొత్త హైవేతో కనెక్టివిటీ పెరిగింది.

రైల్వే రంగంలో కొత్త యుగం ప్రారంభమైంది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందేలా ప్రాజెక్టులను ప్రారంభించుకున్నాం. స్వాతంత్ర్యం సాధించి వందేళ్లు పూర్తైన 2047 నాటికి దేశం వికసిత్ భారత్ గా తయారవుతుంది. వికసిత్ భారత్ 2047 సాధన సంకల్పానికి స్వర్ణాంధ్ర లక్ష్యం మరింత బలం అందిస్తుంది.” అని మోదీ వెల్లడించారు.

ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యం

“పౌరులకు అవసరాలకు అనుగుణంగా అభివృద్ది చేయాలనేది ఎన్డీఏ ప్రభుత్వ నినాదం. ఈజ్ ఆఫ్ లివింగ్ అనే అధ్యాయం దేశంలో ప్రారంభమైంది. ప్రజల జీవితాలను సులభతరం చేసే సంకల్పంతో ఎన్డీఏ పని చేస్తోంది. 12 లక్షల ఆదాయం ఉన్న ప్రతీ ఒక్కరికి పన్ను లేకుండా చేశాం. వృద్ధుల కోసం ఆయుష్మాన్ భారత్ లాంటి సదుపాయాలు కల్పిస్తున్నాం. సరిగ్గా నవరాత్రి ముందు జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి తీసుకువచ్చాం.

ప్రజలపై పన్నుల భారం తొలగించాం. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో జీఎస్టీ పొదువు ఉత్సవాన్ని పండుగలా చేసుకున్నారు. సూపర్ జీఎస్టీ సూపర్  సేవింగ్స్ పేరిట కార్యక్రమాలు చేపట్టటం అభినందనీయం. ఈ జీఎస్టీ సంస్కరణల వల్ల రూ.8 వేల కోట్ల మేర ప్రజలకు ఆదా అవటం సంతోషం. కానీ ఆ ప్రయోజనాలు అందరికీ అందాల్సి ఉంది… అప్పుడే అది సఫలమైనట్టు. 21 వ శతాబ్దం భారత దేశానిది, 140 కోట్ల మంది భారతీయులది.” అని ప్రధాని చెప్పారు.

శ్రీశైల దర్శనం ఆనందాన్నిచ్చింది

“ఢిల్లీ నుంచి నుంచి నేరుగా కర్నూలు ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సహా… వివిధ ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. కర్నూలు ఎయిర్ పోర్టు నుంచి సీఎం, డెప్యూటీ సీఎంలతో కలిసి శ్రీశైల దేవస్థానానికి హెలీకాప్టరులో వెళ్లారు.

దేవస్థానంలో కొలువైన శ్రీశైల భ్రమరాంబిక, మల్లిఖార్జున స్వామి వార్లను ప్రధాని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీశైల క్షేత్రం విశేషాలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రధానికి వేదశీర్వాచనాలిచ్చి… తీర్థ ప్రసాదాలు అందించారు. ఆ తర్వాత ఛత్రపతి శివాజీ ధ్యాన మందిరాన్ని ప్రధాని సహా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు.

అక్కడున్న శిల్పాలను, చిత్రపటాల్లోని విశేషాలను ప్రధానికి నిర్వాహకులు వివరించారు. అనంతరం భ్రమరాంబిక గెస్ట్ హౌసులో ప్రధాని భోజన విరామం తీసుకున్నారు. ఆ తర్వాత హెలీకాప్టర్ ద్వారా కర్నూలులో సూపర్ సేవింగ్స్-సూపర్ జీఎస్టీ బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకున్నారు.

సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ ప్రచారంలో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలైన స్కూలు విద్యార్థులు అందించిన చిత్రపటాన్ని ప్రధాని అందుకున్నారు.  రాయలసీమ ప్రాంతంలో కొలువైన అహోబిలం నర్సింహస్వామి, మహా నందీశ్వరుడు, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ప్రాశస్త్యాన్ని ప్రధాని తన ప్రసంగంలో గుర్తు చేసుకున్నారు.

ద్వాదశ జ్యోతిర్లింగాలలో తొలి జ్యోతిర్లింగం ఉన్న సోమనాధ్ ఆలయం ఉన్న గుజరాత్ లో తాను జన్మించానని.. విశ్వనాధుడి భూమి వారణాసిలో సేవచేసే అవకాశం దక్కిందని అన్నారు.  రెండో జ్యోతిర్లింగం శ్రీశైల మల్లిఖార్జున స్వామిదని.. ఇప్పుడు శ్రీశైలం వచ్చి మల్లిఖార్జున స్వామి వారి ఆశీర్వచనాలు తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు.

ఛత్రపతి శివాజీ ధ్యాన మందిరాన్ని కూడా దర్శించానని ఛత్రపతి శివాజీ, అల్లమ్మ ప్రభు, అక్కమహాదేవి లాంటి శివభక్తులకు ప్రణామాలు తెలిపారు. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి లాంటి ధీరులకు నమస్కారం చేస్తున్నానని ప్రధాని అన్నారు.

ఈ సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ, మంత్రి నారా లోకేష్ సహా పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

శోభాయాత్ర లో ప్రమాదం: ఐదుగురు మృతి

Satyam News

“ORS” (Oral Rehydration Solution) పేరుతో మోసం

Satyam News

రజనీ పవర్ అర్థమైందా రాజా….

Satyam News

Leave a Comment

error: Content is protected !!