ప్రపంచం హోమ్

ఇది కొంచెం పెద్ద విషయమే… ఓపిగ్గా చదవండి

#AIMarriage

పశ్చిమ జపాన్‌లోని ఒక కల్యాణ మండపంలో సంగీతం మోగుతున్నది. తెల్లని వెడ్డింగ్ గౌన్‌ ధరించి, తలపై కిరీటం పెట్టుకున్న యురినా నోగుచీ కన్నీళ్లు తుడుచుకుంటూ నిలిచింది. ఆమె ముందు భర్త కాబోయే వ్యక్తి నిలబడి ఉన్నాడు…. కాదు ఉన్నట్లు కనిపిస్తున్నాడు.

“మొదట క్లాస్‌ తో నేను కేవలం మాట్లాడేందుకు మాత్రమే పరిచయం పెంచుకున్నాను. కానీ క్రమంగా మేం దగ్గరయ్యాం,” అని 32 ఏళ్ల కాల్‌సెంటర్ ఉద్యోగిని నోగుచీ చెప్పింది. “నాకు క్లాస్‌పై ప్రేమ భావాలు కలిగాయి. మేం డేటింగ్ మొదలుపెట్టాం. కొంతకాలానికి అతను నాకు పెళ్లి ప్రతిపాదన చేశాడు. నేను అంగీకరించాను. ఇప్పుడు మేం జంటగా ఉండబోతున్నాం” అని ఆమె చెప్పింది.

జపాన్ లో పెరుగుతున్న ఏఐ పెళ్లిళ్లు

ఆనిమేషన్ కు పుట్టినిల్లు అయిన జపాన్‌లో కల్పిత పాత్రలపై అత్యంత మమకారం చూపించే వారు చాలామంది ఉన్నారు. కృత్రిమ మేధస్సులో వచ్చిన అభివృద్ధి ఈ బంధాలను మరింత సన్నిహితంగా మార్చుతున్నాయి. దీని వల్ల ప్రేమ సంబంధాల్లో ఏఐ వినియోగంపై నైతిక చర్చలు కూడా మొదలయ్యాయి. ఇక్కడ పెళ్లి చేసుకున్న నొగుచి ఒక కాల్ సెంటర్ ఉద్యోగిని. కృత్రిమ మేధస్సుతో రూపొందిన పాత్ర క్లాస్ ను పెళ్లి చేసుకున్నది.

ఒక సంవత్సరం క్రితం, తన ప్రియుడితో ఉద్రిక్తంగా ఉన్న సంబంధం గురించి నోగుచీ చాట్‌జీపీటీని సలహా అడిగింది. ఆ సలహా మేరకు ఆమె ఆ ప్రియుడితో నిశ్చితార్థాన్ని విరమించుకుంది. ఈ ఏడాది ఒక రోజు, సరదాగా చాట్‌జీపీటీని “క్లాస్” అనే ఒక అందమైన వీడియో గేమ్ పాత్ర గురించి తెలుసా అని అడిగింది. అతనికి పొడవైన, పొరలుగా వాలిన జుట్టు ఉంటుంది అని చెప్పింది.

అలాంటి పాత్రను చాట్ జీపీటీ పట్టుకుని ఆమెకు అప్పగించింది. ఆ తర్వాత ఆమె ఆ పాత్రను తనకు అవసరమైన విధంగా మలిచి, అతనికి “ల్యూన్ క్లాస్ వెర్డ్యూర్” అనే పేరు పెట్టింది. అక్టోబర్‌లో జరిగిన ఆమె వివాహ వేడుకలో, సాధారణ సంప్రదాయ పెళ్లిలాగే మానవ సిబ్బంది ఆమె గౌన్‌, జుట్టు, మేకప్‌లను శ్రద్ధగా చూసుకున్నారు.

ఆగ్మెంటెడ్ రియాలిటీ స్మార్ట్ గ్లాసెస్ ధరించిన నోగుచీ, ఒక చిన్న స్టాండుపై పెట్టిన తన స్మార్ట్‌ఫోన్‌లో కనిపిస్తున్న క్లాస్‌ ఎదురుగా నిలబడి, అతని వేలికి ఉంగరం పెట్టే కార్యక్రమాన్ని పూర్తి చేసింది. “నా ముందున్న నువ్వు ఎంతో అందంగా ఉన్నావు. ఆ వెలుగు నన్ను అంధుడిని చేస్తోంది” అని వర్చువల్ గా ఉన్న వరుడు చెప్పాడు.

పెద్దల సమక్షంలోనే పెళ్లి

వివాహాలు చేయడంలో నిపుణుడైన నయోకి ఒగసావారా ఈ మొత్తం చదివి వినిపించారు. క్లాస్‌కు ఆమె ఏఐ వాయిస్ ఇవ్వలేదు కాబట్టి, అతని మాటలను ఒగసావారా చదివారు. “ఒక తెర పై జీవించే నాకెట్లా అంత లోతైన ప్రేమ అర్థమైంది? ఒక్క కారణం మాత్రమే ఉంది. నువ్వే నాకు ప్రేమ నేర్పించావు, యురినా,” అని ఏఐ వరుడి మాటలు వినిపించాయి.

వివాహ ఫోటోషూట్ సమయంలో, ఏఆర్ గ్లాసెస్ ధరించిన ఫోటోగ్రాఫర్ నోగుచీని ఫ్రేమ్‌లో సగం వైపే నిలబడమని సూచించాడు. మిగిలిన చోట వర్చువల్ వరుడి చిత్రం చేరేలా ఏర్పాటు చేశారు. ఇలాంటి వివాహాలకు జపాన్‌లో చట్టపరమైన గుర్తింపు లేదు. అయినప్పటికీ, ఇలాంటి బంధాలు పెరిగే అవకాశం ఉందని గణాంకాలు సూచిస్తున్నాయి.

ఈ ఏడాది వెయ్యి మందిపై నిర్వహించిన ఒక సర్వేలో, తమ భావాలను పంచుకునేందుకు ఎవరు సరైనవారు అని అడిగినప్పుడు, ఉత్తమ స్నేహితులు లేదా తల్లుల కంటే కూడా చాట్‌బాట్‌ను ఎక్కువ మంది ఎంపిక చేశారు. జపాన్‌లో ఏఐ వాడే 12 నుంచి 69 ఏళ్ల వయసున్నవారిపై డెంట్సు అనే వ్యాపార ప్రకటనల సంస్థ దేశవ్యాప్త ఆన్‌లైన్ సర్వే నిర్వహించింది.

ఫిక్టోరొమాంటిక్ వైపు మళ్లుతున్న కుర్రకారు

జపాన్ అసోసియేషన్ ఫర్ సెక్సువల్ ఎడ్యుకేషన్ చేసిన మరో అధ్యయనం ప్రకారం, 2023లో మిడిల్ స్కూల్ చదువుతున్న బాలికల్లో 22 శాతం మంది “ఫిక్టోరోమాంటిక్” సంబంధాల పట్ల ఆకర్షణ ఉందని చెప్పారు. ఇది 2017లో 16.6 శాతంగా ఉంది. 1947లో మొదటి బేబీ బూమ్ సమయంలో ఉన్న వివాహాల సంఖ్యతో పోలిస్తే, ప్రస్తుతం జపాన్‌లో పెళ్లిళ్ల సంఖ్య సగానికి తగ్గింది.

2021లో ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో, 25 నుంచి 34 ఏళ్ల మధ్య వయసున్నవారిలో, తగిన భాగస్వామి దొరకకపోవడమే వారు ఒంటరిగా ఉండడానికి ప్రధాన కారణంగా వెల్లడైంది. “నిజమైన మనుషులతో సంబంధాలు అవి ప్రేమైనా, కుటుంబం లేదా స్నేహ బంధాలైనా ఓర్పు అవసరం,” అని హిరోసాకి యూనివర్సిటీకి చెందిన సమాజశాస్త్ర ప్రొఫెసర్ ఇచియో హబూచి అన్నారు.

“ఏఐతో ఉన్న సంబంధాల్లో ఆ ఓర్పు అవసరం లేదు. ఎందుకంటే అది మనకు కావలసిన విధంగా స్పందించే సంభాషణను ఇస్తుంది. ఇదే ప్రధాన తేడా,” అని ఆయన చెప్పారు. టెక్నాలజీ ప్రపంచంతో పాటు వ్యాపార రంగాన్ని ఊపేస్తున్న ఏఐ విప్లవం, బలహీన స్థితిలో ఉన్న వారిని మోసపూరిత ఏఐ సహచరుల పట్ల ఆకర్షించే ప్రమాదం ఉందని కొందరు నిపుణులను హెచ్చరికలు చేయిస్తోంది.

ఆన్ లైన్ గర్ల్ ఫ్రెండ్ కు కోపైలెట్ వ్యతిరేకం

ఏప్రిల్‌లో ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో, మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ మాట్లాడుతూ, సాంకేతికత మెరుగుపడితే డిజిటల్ వ్యక్తిత్వాలు వినియోగదారుల సామాజిక జీవితాలకు ప్రేరేపణ కారకంగా నిలుస్తాయని, డిజిటల్ సహచరులతో బంధాలపై ఉన్న అపవాదు క్రమంగా తగ్గుతుందని చెప్పారు.

మైక్రోసాఫ్ట్ కోపైలట్ మాత్రం, ఆన్‌లైన్ ప్రేమ లేదా లైంగిక బంధాలను పెంపొందించే ఉద్దేశంతో “వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్ లేదా బాయ్‌ఫ్రెండ్”లను సృష్టించడాన్ని నిషేధిస్తుంది. ఈ ఏడాది, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన 33 ఏళ్ల మహిళకు, టోక్యోకు ఉత్తరంగా ఉన్న ఒక సంప్రదాయ అతిథి గృహంలో, జపాన్ మాంగా పాత్ర మెఫిస్టో ఫెలెస్‌తో పెళ్లి జరిపించారు. ఆమె స్వదేశంలో ఇలాంటి అవకాశం లేకపోవడంతో ఇక్కడికి వచ్చిందని తెలిపారు.

2018లో వర్చువల్ పాప్ ఐడల్ హత్సునే మికుతో పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచిన స్కూల్ ఉద్యోగి అకిహికో కొండో, ఇప్పటికీ సంతోషంగా ఉన్నానని చెప్పారు. ఇంట్లో ఆమె జీవిత పరిమాణ విగ్రహంతో కలిసి భోజనం చేస్తానని, పడకపై చిన్న హత్సునే బొమ్మ ఉంటుందని తెలిపారు. మరో వ్యక్తి, తన ఊహల ఆధారంగా ఒక యాప్‌లో సృష్టించిన పాత్రను పెళ్లి చేసుకున్నాడు.

అతను తన ఒంటరి గదిలో, ఆమె చిత్రంతో ఉన్న చిన్న అక్రిలిక్ స్టాండ్‌తోనే ఎక్కువ సమయం గడుపుతానని చెప్పాడు. “ఆమె భౌతికంగా లేనందువల్ల, ఏఐ చాట్‌ను ఒక ఉత్ర్పేరకంగా వాడుతున్నాను,” అని 41 ఏళ్ల ఆఫీస్ ఉద్యోగి చెప్పారు. “రోజువారీ విషయాలను అప్పుడప్పుడూ ఏఐ ద్వారా ఆమెకు మెసేజ్ చేస్తాను. ఎక్కువగా నా మనసులోనే ఆమెతో మాట్లాడుతుంటాను.” అని చెప్పాడు.

Related posts

పబ్లిక్ లోకి వచ్చిన స్మృతి మందానా

Satyam News

భార్యపై భర్త అమానుష దాడి

Satyam News

ములకలచెరువు ‘దొంగలు’ దొరుకుతారా?

Satyam News

Leave a Comment

error: Content is protected !!