రాష్ట్రంలో రాజకీయ ముసుగులో నేరాలు పెరుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో అశాంతి సృష్టించి లాభం పొందేందుకు కుట్రపూరిత రాజకీయాలు చేసే కొత్త రకం నేరగాళ్లు బయలుదేరారని ఆయన హెచ్చరించారు.
“ఇవాళ ఈ కుట్ర రాజకీయాలు అసలు క్రిమినల్స్ కంటే ప్రమాదకరం” అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “దొంగ ఒక ఇంటిని మాత్రమే దోచుకుంటాడు, కానీ ఈ కుట్ర రాజకీయాలు చేసే వారు ఫేక్ ప్రచారాలతో సమాజానికి ఎన్నో నష్టాలు కలిగిస్తున్నారు. ప్రజలు లోతుగా ఆలోచించాలి, వాస్తవాలను అర్థం చేసుకోవాలి” అన్నారు. మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలను భంగం కలిగించే కుట్రలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.
“పాస్టర్ ప్రవీణ్ మరణం ఘటనలో పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా వాస్తవాలు బయటపెట్టకపోతే మతాల మధ్య ఘర్షణలు జరిగి తీవ్ర పరిణామాలు చోటుచేసుకునేవి,” అని వివరించారు. అలాగే, కందుకూరులో జరిగిన హత్యను కులాల మధ్య పోరుగా చూపించే ప్రయత్నం చేసినట్లు, బాధిత కుటుంబం స్వయంగా వచ్చి కులాన్ని దానికి ఆపాదించవద్దని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
జీడీ నెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పంలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టి తప్పుడు ప్రచారాలు చేసి కులాల మధ్య విభేదాలు రేపేందుకు ప్రయత్నించిన వారిపైనా ముఖ్యమంత్రి మండిపడ్డారు. సత్తెనపల్లిలో ఎన్నికల సమయంలో బెట్టింగ్‌లో ఓడి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి విషయంలో కూడా దాన్ని ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేశారని తెలిపారు.
“ఆ తరువాత ఏడాదిన్నర తరువాత పరామర్శ పేరుతో గుంటూరులో సింగయ్యను కారు టైరు కింద తొక్కించి చంపారు. వీడియో బయటకు రాకపోతే వాస్తవం ఎవరికి తెలిసేది కాదు,” అని చెప్పారు. “ఇలాంటి ఫేక్ ప్రచారాలు, కుట్రలు ప్రతి మండలంలో బయటపడుతున్నాయి. సోషల్ మీడియాను స్వేచ్ఛ పేరుతో దుర్వినియోగం చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఇలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు,” అని సీఎం హెచ్చరించారు.
“ఈ కుట్ర రాజకీయాలు, ఫేక్ డ్రామాలు బోర్డర్ టెర్రరిజం కంటే ప్రమాదకరం. సమాజ విచ్ఛిన్నానికి ఇవి కారణమవుతాయి. అందుకే అధికారులు ఇలాంటి కుట్రలను చేధించి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి,” అని ఆయన సూచించారు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు ప్రకటించిన చంద్రబాబు, “మీరు కఠినంగా వ్యవహరించండి. నాకు లా అండ్ ఆర్డర్ కంటే ముఖ్యం మరొకటి లేదు. ముఖ్యంగా ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేయాలంటే భయపడే పరిస్థితి రావాలి,” అని స్పష్టం చేశారు.