కల్తీ మద్యం అంశంపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి నారా లోకేష్. ఈ మేరకు జగన్ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ ఘాటుగా సమాధానం చెప్పారు. కల్తీ మద్యం పట్టుకున్నది కూటమి ప్రభుత్వమేనన్నారు నారా లోకేష్. కల్తీ మద్యం నిందితుల్లో తెలుగుదేశం పార్టీ నేతలున్నా ఎలాంటి పక్షపాతం లేకుండా అరెస్టు చేయించామని చెప్పారు. ఇక నిందితుల్లో ఇద్దరు టీడీపీ వారుంటే వారిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేశామని గుర్తు చేశారు.
ఇక జగన్ ఐదేళ్ల పాలనపై సెటైర్లు వేశారు లోకేష్. ఐదేళ్ల పాలనలో ఏం చేశారో మర్చిపోయి ఆరోపణలు చేయొద్దంటూ జగన్‌కు చురకలు అంటించారు. డబ్బు కక్కుర్తితో జే బ్రాండ్స్‌తో వేల మంది ప్రజల ప్రాణాలు తీశారని మండిపడ్డారు లోకేష్. మీ జమానాలో జంగారెడ్డి గూడెంలో కల్తీ మద్యం తాగి ప్రజలు చనిపోతే, సహజమరణాలని నిందితులను కాపాడే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. పోతే పోయారు… ఇంకా ఏడుస్తారేంటి? అని మీ మంత్రి జోగి రమేష్ గారు అహంకారం ఇప్పటికీ ప్రజలు గుర్తుంచుకున్నారంటూ ఫైర్ అయ్యారు.
దళితుడైన డ్రైవర్ సుబ్రహ్మణ్యంని చంపి డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసిన మీ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుని అప్పటి నుంచి ఇప్పటివరకూ పార్టీ నుంచి కనీసం సస్పెండ్ చేయలేదని జగన్‌ను నిలదీశారు. అనంతబాబును ఇంటికి పిలిపించుకుని భోజనం పెట్టి సన్మానించారని గుర్తు చేశారు. కల్తీ మద్యం గురించి, నిందితులకు వత్తాసు పలకడం గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడుంది జగన్ అంటూ ప్రశ్నించారు లోకేష్.
ఇంతకీ ఏం జరిగిందంటే –
అన్నమయ్య జిల్లా ములకలచెరువులో కల్తీ మద్యం తయారీ కేంద్రాన్ని ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఈ దాడుల్లో సుమారు కోటి 75 లక్షల రూపాయల విలువైన నకిలీ మద్యం స్టాక్‌లు, తయారీ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో పై ఇద్దరు టీడీపీ నాయకుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలు రావడం సంచలనంగా మారింది.
ఐతే విషయం తెలిసిన వెంటనే తెలుగుదేశం పార్టీ చర్యలకు సిద్ధమైంది. ఏ మాత్రం ఉపేక్షించకుండా కల్తీ మద్యం తయారీ, సరఫరా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దాసరిపల్లి జయచంద్రారెడ్డి తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి),కట్టా సురేంద్ర నాయుడు-స్థానిక టీడీపీ నాయకుడిని టీడీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.