అంతర్జాతీయ యోగా దినోత్సవం అంటే అందరూ ఏం చేస్తారు? ప్రశాంతంగా ఆసనాలు వేస్తారు.. ప్రాణాయామం చేస్తారు. కానీ, విజయనగరం జిల్లా ‘పోలీస్ బాస్’ మాత్రం కాస్త విభిన్నంగా ఆలోచించారు. మనసు ప్రశాంతత కోసం యోగాసనాలు వేస్తే ఏం లాభం.. సిబ్బందితో ‘లైజనింగ్’ పెరగాలంటే ‘విందు ఆసనం’ వేయాల్సిందేనని డిసైడ్ అయ్యారు. అంతే.. విజయనగరం బాలాజీనగర్‌లోని ఎస్పీ బంగ్లా వేదికగా రాత్రి ఒక రేంజ్‌లో పార్టీ జరిగిపోయింది. డిస్కో లైట్లు, డీజే సౌండ్లు, ఘుమఘుమలాడే వంటకాలతో బంగ్లా దద్దరిల్లిపోయింది. అంతా బాగానే ఉంది కానీ.. ఈ విందు కాస్తా పోలీస్ శాఖలో ‘ర్యాంకుల’ చిచ్చు రాజేసింది.
బాస్ పిలుపు.. కానీ ‘నో’ ఫ్యామిలీస్!అని.
సిబ్బందితో సత్సంబంధాల కోసమే ఈ విందు ఏర్పాటు చేశారట. ఎస్ఐ స్థాయి నుంచి అందరినీ కుటుంబాలతో సహా రమ్మని ఆహ్వానాలు వెళ్లాయి. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఇచ్చారు బాస్. సర్వీసులో ప్రమోషన్లు పొంది ‘ర్యాంకర్ ఎస్ఐలు’గా మారిన వారికి మాత్రం ఒక కండిషన్ పెట్టారంట. “మీరు రండి.. కానీ మీ భార్యాపిల్లలను మాత్రం తీసుకురావద్దు” అంటూ బంగ్లా నుంచి హుకుం జారీ అయింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఎస్ఐల కుటుంబాలకు లేని అభ్యంతరం.. మాకెందుకు? అంటూ ర్యాంకర్ ఎస్ఐల మనోభావాలు దెబ్బతిన్నాయి.
అలిగిన ‘ఖేల్‌రత్నాలు’.. పార్టీకి డుమ్మా!
మమ్మల్ని పిలిచినా.. మా కుటుంబాలు వస్తే రావొద్దంటూ అవమానిస్తారా? అంటూ ర్యాంకర్ ఎస్ఐలు గుర్రుమన్నారు. ‘ఫ్యామిలీ రాని,లేని విందు మాకొద్దు’ అంటూ అలకపాన్పు ఎక్కారు. రాత్రి జరిగిన ధూంధాం పార్టీకి సదరు ర్యాంకర్ ఎస్ఐలంతా ‘డుమ్మా’ కొట్టేశారని భోగట్టా. ముఖ్యంగా సిటీలో కీలక బాధ్యతల్లో ఉన్న ట్రాఫి, టూటౌన్ , అలాగే స్పెషల్ బ్రాంచ్,ఇంటలిజెన్స్ లలో ఉన్న సిబ్బంది ఈ వ్యవహారంతో తీవ్రంగా నొచ్చుకుని పార్టీ వైపు కన్నెత్తి కూడా చూడలేదని డిపార్ట్‌మెంట్‌లో టాక్ నడుస్తోంది.
బంగ్లా బయట ‘ట్రాఫిక్ జామ్’.. లోపల హంగామా!
ఒకవైపు కొందరు ర్యాంకర్ ఎస్ఐలు అలకతో ఇంట్లో కూర్చుంటే.. మరోవైపు మిగిలిన సిబ్బంది మాత్రం కుటుంబాలతో సహా ఎస్పీ బంగ్లాకు క్యూ కట్టారు. దీంతో బాలాజీనగర్‌లోని ఎస్పీ బంగ్లా చుట్టుపక్కల సిబ్బంది కార్ల పార్కింగ్‌తో కిక్కిరిసిపోయింది. సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా.. సదరు కార్ల రక్షణ కోసం ఒక ట్రాఫిక్ ఏఎస్ఐ, ఇద్దరు పీసీలు బంగ్లా గేటు ముందే పహారా కాయాల్సి వచ్చింది. లోపల డీజే పాటలకు స్టెప్పులు పడుతుంటే.. బయట మాత్రం డ్యూటీ కానిచ్చారు.
మొత్తానికి, అందరినీ కలపాల్సింది పోయి.. ‘డైరెక్ట్’ ఎస్ఐలు, ‘ర్యాంకర్’ ఎస్ఐలు అంటూ బాస్ చూపించిన ఈ తారతమ్యం ఇప్పుడు ఖాకీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. యోగా దినోత్సవం నాడు ఎస్పీ ఇచ్చిన పార్టీ.. కొందరికి ‘జోష్’ ఇస్తే.. మరికొందరికి మాత్రం ‘ఆక్రోశం’ మిగిల్చిందన్నమాట!
