ఆధ్యాత్మికంహోమ్

తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు

#Tirumala

తిరుమలలో భక్తుల నీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ పటిష్ట చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి గురువారం తిరుమలకు నీటిని సరఫరా చేసే డ్యామ్‌లు, నీటి నిల్వలను పరిశీలించి సమీక్షించారు.

ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు మీడియాతో మాట్లాడుతూ, తిరుమలకు నీటి సరఫరా అందించే డ్యామ్‌లను స్వయంగా పరిశీలించి నీటి నిల్వలపై సమీక్షించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు మార్చి, ఏప్రిల్ నెలల వరకు సరిపోతాయని వెల్లడించారు.

ఒకవేళ వర్షాలు కురవని పరిస్థితి ఏర్పడితే చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అధికారులు సమర్పించే నివేదిక ఆధారంగా ప్రభుత్వ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి తగిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.

ఇటీవల జరిగిన సమావేశంలో తిరుమల నీటి అవసరాల అంశాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా, వర్షాలు కురుస్తాయని, నీటి కొరత ఉండదని ఆయన విశ్వాసం వ్యక్తం చేసినట్లు తెలిపారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కళ్యాణి డ్యామ్ లేదా ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటి సరఫరాను మెరుగుపరిచేందుకు యుద్ధప్రాతిపదికన ప్రణాళికలు రూపొందిస్తామని వెల్లడించారు.

టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, తిరుమలలోని డ్యామ్‌ లలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలు రాబోయే 150 రోజులకు సరిపోతాయని వివరించారు.

తిరుమలలో రోజువారీ నీటి అవసరం 50 లక్షల గ్యాలన్లు కాగా, ఇందులో 50 శాతం టీటీడీ సొంత డ్యామ్‌ల నుంచి, మిగిలిన 50 శాతం కళ్యాణి డ్యామ్ నుంచి వినియోగిస్తున్నట్లు తెలిపారు. సాధారణంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో కురిసే వర్షాలతో డ్యామ్‌లు పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉందన్నారు. అన్ని డ్యామ్‌లు నిండితే సుమారు ఏడాదిన్నర పాటు తిరుమలలో నీటి ఎద్దడి ఉండదని పేర్కొన్నారు.

తిరుమలలో నీటి వృథాను అరికట్టి పొదుపుగా వినియోగించేందుకు భక్తులకు వివిధ మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు అదనపు ఈవో తెలిపారు. కాటేజీలు, గదుల్లో నీటి లీకేజీలను అరికట్టడంతో పాటు ఆటోమేషన్ గేట్ల ఏర్పాటు వంటి చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

రాబోయే రోజుల్లో డ్యామ్‌లలో డ్రెడ్జింగ్, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, నీటి సంరక్షణ, డ్యామ్‌ల భద్రతకు సంబంధించి నిర్దిష్ట కార్యాచరణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. తిరుమలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు నిరంతరాయంగా నీటి సరఫరా అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.

Related posts

పేదలకు 6 లక్షల ఇళ్లు… బడ్జెట్‌లో భారీ కేటాయింపులు

Satyam News

అయోధ్య రాముడి సొమ్ము చోరీ కేసులో కీలక మలుపు

Satyam News

లో ప్రొఫైల్…. హై ఇంపాక్ట్‌…. లోకేష్ వర్కింగ్ స్టయిల్

Satyam News

కన్నుల పండుగగా శ్రీనివాసుని కళ్యాణం

Satyam News

తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్ర సానుకూలం

Satyam News

సంచలన నిర్ణయం తీసుకున్న తమిళనాడు దళపతి

Satyam News

Leave a Comment