యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్టెండెడ్ రియాలిటీ (ఏవీజీసీ-ఎక్స్ఆర్) రంగాల్లో తెలంగాణకు అపార అవకాశాలు ఉన్నాయని, హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి క్రియేటివ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
ఈ రంగాల ద్వారా యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. బుధవారం హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో పరిశ్రమ ప్రముఖులతో నిర్వహించిన ఏవీజీసీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
తెలంగాణ రైజింగ్ లో గేమింగ్ కీలక పాత్ర
తెలంగాణ రైజింగ్-2047 లక్ష్యాల సాధనలో ఏవీజీసీ-ఎక్స్ఆర్, పర్యాటక రంగాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. 2034 నాటికి లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
తెలుగు సినిమా ఇప్పటికే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, డిజైన్, ఆధునిక సృజనాత్మక సాంకేతిక రంగాల్లోనూ హైదరాబాద్‌కు మంచి ప్రతిభ, అనుభవం ఉన్నాయని మంత్రి చెప్పారు. ఈ సామర్థ్యాలను మరింత విస్తరించి, యువత తమ సృజనాత్మక ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు, సొంతంగా ప్రాజెక్టులు రూపొందించేందుకు రాష్ట్రంలోనే మరిన్ని అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
ఫ్యూచర్ సిటీలో ఇండియా జాయ్ 2026
డిసెంబర్ 7 నుంచి 13 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో ఇండియా జాయ్-2026 నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా ఈ కార్యక్రమం జరగనుందని తెలిపారు. సృజనాత్మక పరిశ్రమలు, సాంకేతిక సంస్థలు, పెట్టుబడిదారులు, యువ ప్రతిభావంతులకు ఈ రెండు కార్యక్రమాలు ఉమ్మడి వేదికగా నిలుస్తాయన్నారు.
రాష్ట్రంలోని ఆరు ప్రత్యేక పర్యాటక సర్క్యూట్లైన ఆధ్యాత్మిక, వారసత్వ, ఎకో-వెల్నెస్, హస్తకళలు, జల పర్యాటక, బౌద్ధ పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో ఏవీజీసీ, ఎక్స్ఆర్ సంస్థలు భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్) సాంకేతికతల ద్వారా తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని సరికొత్త అనుభూతులతో ప్రపంచానికి పరిచయం చేయవచ్చని అన్నారు.
ఏడు రోజులపాటు జరిగే ఇండియా జాయ్-2026కు 80 వేల మందికి పైగా బీ2సీ సందర్శకులు, 8,500 మందికి పైగా బీ2బీ ప్రతినిధులు, 20కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, సినిమా, డిజిటల్ కంటెంట్, ఈ-స్పోర్ట్స్, డిజైన్, ఆధునిక సృజనాత్మక సాంకేతిక రంగాలకు ఈ కార్యక్రమం వేదికగా నిలుస్తుందని చెప్పారు.
ప్రతిభ ప్రదర్శనకు సరైన వేదిక
‘ఎడ్యుకేట్, ఎగ్జిబిట్, ఎక్స్పీరియన్స్, ఎంజాయ్’ అనే నాలుగు ప్రధాన అంశాలతో విజ్ఞానం, ప్రతిభ ప్రదర్శన, సాంకేతిక అనుభవం, వినోదానికి అవకాశం కల్పించనున్నట్లు వివరించారు. ఇండియా జాయ్ విజయవంతం కావడంలో పరిశ్రమల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్న మంత్రి, స్టూడియోలు, కంపెనీలు తమ ప్రాజెక్టులు, సాంకేతికతలు, సృజనాత్మక పనితీరును ప్రదర్శించాలని కోరారు.
పరిశ్రమల సంఘాలు తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లోని తమ సభ్యులను భాగస్వాములను చేయాలని, దేశవిదేశాల నుంచి ప్రముఖ సంస్థలు, సృజనకారులు, నిపుణులను ఆహ్వానించాలని సూచించారు.
విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, ఫిల్మ్ స్కూళ్లు, యానిమేషన్, గేమింగ్ సంస్థలు తమ విద్యార్థులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రోత్సహించాలని అన్నారు. విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించడంతోపాటు పరిశ్రమ నిపుణులతో నేరుగా మాట్లాడి భవిష్యత్తు ఉపాధి అవకాశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
ఏఐతో అద్భుతాలు సృష్టించే వీలు
కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా సృజనాత్మక రంగాల్లో చోటుచేసుకుంటున్న మార్పులను ప్రస్తావిస్తూ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను వైవిధ్యభరితంగా, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో ఏవీజీసీ-ఎక్స్ఆర్ రంగాన్ని వ్యూహాత్మక రంగంగా అభివృద్ధి చేయాలని మంత్రి పేర్కొన్నారు.
ఇండియా జాయ్ విజయాన్ని కేవలం కార్యక్రమ నిర్వహణ, సందర్శకుల సంఖ్య ఆధారంగా అంచనా వేయరాదని, దాని ద్వారా ఏర్పడే కొత్త వ్యాపార అవకాశాలు, పెట్టుబడి చర్చలు, భాగస్వామ్యాలు, స్థానిక స్టూడియోలకు లభించే అవకాశాలే అసలైన ఫలితాలని స్పష్టం చేశారు. ప్రతి సంస్థ కనీసం ఒక కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని, ప్రాజెక్టుల ప్రదర్శన, ప్రత్యేక సెషన్లు, విద్యార్థి బృందాల భాగస్వామ్యం, అంతర్జాతీయ అతిథుల ఆహ్వానం వంటి కార్యక్రమాలకు సహకరించాలని పిలుపునిచ్చారు.
ప్రపంచ స్థాయి పెట్టుబడులకు ఆహ్వానం
ప్రపంచస్థాయి భాగస్వామ్యాలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, స్థిరమైన విధానాలు, సృజనాత్మక ప్రతిభ తెలంగాణలో ఉన్నాయని మంత్రి తెలిపారు. ప్రభుత్వం, పరిశ్రమలు సమన్వయంతో పనిచేసి ఇండియా జాయ్-2026, ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లను అంతర్జాతీయ స్థాయిలో విజయవంతం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో పర్యాటక శాఖ డైరెక్టర్ లక్ష్మణ్ రంజిత్ నాయక్, గ్రీన్ గోల్డ్ యానిమేషన్ డైరెక్టర్ టోమాజ్ వాల్జాక్, సీఎంఓ భరత్ లక్ష్మీపతి, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ కవిత, రోటోమేకర్ సీఈఓ, టీవీఏజీఏ జనరల్ సెక్రటరీ, ఇండియా జాయ్ సహ వ్యవస్థాపకుడు మైక్ యాతం, పర్పుల్టాక్ సీటీఓ వంశీ, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్, ఎక్స్పీరియం చైర్మన్ రాందేవ్, ఇన్వెస్ట్ తెలంగాణ ఏవీజీసీ అండ్ ఆరెంజ్ ఎకానమీ డైరెక్టర్ వల్లభి ఏ. తదితరులు పాల్గొన్నారు.
