అభివృద్ధికి పట్టుగొమ్మలుగా నిలవాల్సిన జాతీయ రహదారులు అక్రమార్కులకు అడ్డాగా మారాయి. కాకినాడ జిల్లా పరిధిలోని జాతీయ రహదారి (తుని నుంచి జగ్గంపేట వరకు) ఇప్పుడు పూర్తిస్థాయిలో మాఫియా చేతుల్లో కీలుబొమ్మగా మారింది. రాత్రింబవళ్లు తేడా లేకుండా, లారీలను టార్గెట్ చేస్తూ సాగుతున్న ఈ దోపిడీ పర్వం చూస్తుంటే సామాన్యులు విస్మయానికి గురవుతున్నారు.
డీజిల్, ఐరన్, తారు.. ఇలా ఏది పడితే అది! లారీలను ఆపడం, డ్రైవర్లను ప్రలోభపెట్టడమో లేక బెదిరించడమో చేసి అత్యంత తక్కువ ధరకు ఆ సరుకును దింపేసుకోవడం ఈ మాఫియా దినచర్యగా మారింది. నిబంధనలను గాలికొదిలేసి జాతీయ రహదారిపై సాగుతున్న ఈ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేసే నాథుడే కరువయ్యాడు.
తుని నుంచి జగ్గంపేట వరకు రహదారికి ఇరువైపులా సుమారు 71కి పైగా ఎలాంటి లైసెన్సులు లేని షాపులు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఇవన్నీ కేవలం ఈ అక్రమ దందా కోసమే ఏర్పాటు చేసినవి కావడం గమనార్హం. జాతీయ రహదారిపై వెళ్లే భారీ రవాణా వాహనాలను ఇక్కడ ఆపి, అత్యంత పకడ్బందీగా ఈ దొంగచాటు వ్యాపారం నిర్వహిస్తున్నారు.
లారీల నుంచి కొట్టేసిన సరుకును మళ్లీ బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తూ రాత్రికి రాత్రే లక్షాధికారులు అవుతున్నారు. ఈ అక్రమ షాపుల వల్ల ప్రభుత్వ ఖజానాకు గండి పడటమే కాకుండా, పర్యావరణానికి కూడా తీవ్ర నష్టం వాటిల్లుతోంది.
ఈ భారీ దందా వెనుక ‘సుబ్బారావు’ అనే వ్యక్తి చక్రం తిప్పుతున్నట్లు ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అన్నవరం నుంచి కత్తిపూడి వరకు సాగుతున్న ఈ అక్రమ సామ్రాజ్యానికి ఆయనే షాడో బాస్ అని స్థానికులు చెవులు కొరుక్కుంటున్నారు. చిన్న చిన్న షాపుల నిర్వాహకులను ఏకం చేసి, ఒక సిండికేట్‌గా మార్చి, అధికారులకు ఎప్పటికప్పుడు ‘మామూళ్లు’ అందజేస్తూ ఈ దందాను ఎలాంటి ఆటంకాలు లేకుండా నడిపిస్తున్న ఘనత ఇతనిదేనని తెలుస్తోంది. ఈ మాఫియా వెనుక ఇంకెంత మంది పెద్దల హస్తం ఉందో అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
బంకుల్లో డ్రై.. దొంగల చేతిలో ఫుల్!
ప్రస్తుతం మార్కెట్లో ఇంధన కొరత సామాన్యులను తీవ్రంగా బాధిస్తోంది. పెట్రోల్ బంకుల వద్ద డీజిల్, పెట్రోల్ దొరకక వాహనదారులు, రైతులు ఇబ్బందులు పడుతుంటే.. ఈ మాఫియా వద్ద మాత్రం వేల లీటర్ల డీజిల్ నిల్వలు ఉండటం వ్యవస్థ డొల్లతనానికి అద్దం పడుతోంది.
లారీల నుంచి కారుచౌకగా కొట్టేసిన డీజిల్‌ను, బారెల్స్‌లో రహస్యంగా నిల్వ చేసి, కృత్రిమ కొరత సృష్టించి మరీ బ్లాక్ మార్కెట్లో అడ్డగోలు ధరలకు అమ్ముకుంటున్నారు. అత్యంత ప్రమాదకరమైన ఈ పేలుడు పదార్థాల నిల్వల వల్ల చుట్టుపక్కల ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నా ఫైర్, సివిల్ సప్లై అధికారులు కన్నెత్తి చూడకపోవడం దారుణం.
“మామూళ్లు ఇస్తున్నాం.. మా ఇష్టం”
ఈ సిండికేట్ సభ్యుల బరితెగింపు ఏ స్థాయిలో ఉందంటే.. “నెలనెలా అందరికీ మామూళ్లు ముట్టజెబుతున్నాం.. మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. మా వ్యాపారం ఇంతే” అంటూ బహిరంగంగానే సవాళ్లు విసురుతున్నారు. కళ్లెదుటే కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నా, యథేచ్ఛగా దోపిడీ జరుగుతున్నా.. స్థానిక పోలీసులు, హైవే పెట్రోలింగ్, రెవెన్యూ, రవాణా శాఖాధికారులు నింపాదిగా ప్రేక్షకపాత్ర వహించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మామూళ్ల మత్తులో అధికారులు సైతం ఈ దందాకు పరోక్షంగా సహకరిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
