విజయవాడలో జరిగిన రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్-2026 వేదికపై పద్మవిభూషణ్ రామోజీరావు జయంతిని ఇకపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు చేసిన ప్రకటించిన విషయం తెలిసిందే. ఐతే ఈ ప్రకటన వెలువడిన వెంటనే వైసీపీ నేతలు, ఆ పార్టీ మద్దతు దారులు సోషల్‌మీడియా వేదికగా విమర్శలు మొదలుపెట్టారు. గుడ్డి వ్యతిరేకతతో రామోజీ తెలుగు భాషకు, పత్రికా రంగానికి చేసిన సేవను గుర్తించలేకపోతున్నారు.
రామోజీరావును కేవలం వ్యాపారవేత్తగానో, పత్రికా అధినేతగానో మాత్రమే చూడటం ఆయన 5 దశాబ్దాల ప్రజా సేవను, సమాజానికి ఆయన చేసిన బహుముఖ సేవలను విస్మరించడమేనని వారు కౌంటర్ ఇస్తున్నారు. 2016లో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్న రామోజీరావు ప్రస్థానాన్ని పరిశీలిస్తే, వివిధ రంగాల్లో ఆయన సృష్టించిన వ్యవస్థలు, ప్రజల జీవితాల్లో తెచ్చిన మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి.
ఆన్‌లైన్ క్రౌడ్ ఫండింగ్ అనే భావన రాకముందే ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఈనాడు సహాయనిధి ద్వారా లక్షలాది మంది దాతలను ఏకం చేసి వందల కోట్ల రూపాయలను సమీకరించారు. తుఫాన్లు, భూకంపాలు, సునామీ బాధితుల కోసం శాశ్వత గృహాలు, స్కూల్స్ నిర్మించారు. కరోనా విపత్తు వేళ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు రూ. 20 కోట్ల విరాళం అందించారు. అలాగే రామోజీ ఫౌండేషన్ ద్వారా గ్రామాల్లో తాగునీరు, పారిశుధ్యం, పాఠశాలల నిర్మాణం, వృత్తి విద్యా శిక్షణ వంటి కార్యక్రమాలతో గ్రామీణుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచారు.
ఉపాధి కల్పన, పర్యాటక రంగాల్లోనూ రామోజీరావు చెరగని ముద్ర వేశారు. రామోజీ గ్రూప్ సంస్థల ద్వారా ప్రత్యక్షంగా సుమారు 25,000 మందికి, పరోక్షంగా సినిమా, పర్యాటక, రవాణా రంగాల ద్వారా లక్షలాది కుటుంబాలకు జీవనోపాధి కల్పించారు. 1996లో సుమారు 2,000 ఎకరాల్లో నిర్మించిన రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్‌గా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కి, ఏటా సుమారు 15 లక్షల మంది పర్యాటకులను ఆకర్షిస్తూ హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది.
మరోవైపు, వ్యవసాయం, జర్నలిజం, సాహిత్య రంగాలకు ఆయన చేసిన సేవలను విమర్శకులు విస్మరించకూడదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 1969లోనే అన్నదాత’ మాసపత్రికను ప్రారంభించి శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను రైతులకు చేరువ చేశారు. ఈనాడులో జిల్లా ఎడిషన్ల ద్వారా గ్రామీణ సమస్యలకు గొంతుకనిచ్చారు. 1990వ దశకంలో మహిళలు చేపట్టిన సారా వ్యతిరేక ఉద్యమానికి పత్రికా పరంగా ఇచ్చిన మద్దతు ప్రభుత్వ విధానాలనే మార్చే స్థాయికి చేరిందని, అలాగే ఈటీవీ ద్వారా ప్రాంతీయ భాషా టెలివిజన్‌ను దేశవ్యాప్తం చేయడంతో పాటు, చతుర, విపుల, తెలుగు వెలుగు, బాలభారతం పత్రికల ద్వారా తెలుగు భాషా సాహిత్యానికి ఎనలేని సేవ చేశారు.
