ఆంధ్రప్రదేశ్ దూకుడు తమిళనాడు సీఎం విజయ్‌కు నిద్రలేకుండా చేస్తోంది. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ చూపిస్తున్న వేగం తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా, రాష్ట్ర పెట్టుబడుల రహస్య సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్‌కు లీక్ చేస్తున్నారన్న ఆరోపణలతో తమిళనాడు ప్రభుత్వం ఏకంగా 15 మంది అధికారులపై వేటు వేయడం సంచలనంగా మారింది.
తమిళనాడుకు దేశ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించే అత్యంత కీలకమైన గైడెన్స్ తమిళనాడు విభాగంలో ఈ భారీ ప్రక్షాళన జరిగింది. మంత్రి ఎస్. కీర్తన ఆధ్వర్యంలోని ఈ శాఖలో పనిచేస్తున్న 15 మంది అధికారులను విజయ్ నేతృత్వంలోని TVK ప్రభుత్వం తక్షణమే తొలగించింది. తమిళనాడుకు రావాల్సిన భారీ ప్రాజెక్టులు, పెట్టుబడిదారుల రహస్య వివరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చేరవేస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు రావడంతో సీఎం విజయ్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన మరియు సంచలన విషయం ఏమిటంటే.. తమిళనాడు ప్రభుత్వం తొలగించిన వారిలో ముగ్గురు అధికారులు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేరినట్లు సమాచారం. దీన్ని బట్టి తమిళనాడుకు రావాల్సిన పెట్టుబడులను ఏపీ ఏ స్థాయిలో తన్నుకుపోతోందో అర్థం చేసుకోవచ్చు.
తమిళనాడుకు చెందిన కీలక అధికారులు ఏపీ వైపు చూడటం చూస్తుంటే.. పెట్టుబడుల వేటలో ఏపీ దూకుడుకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గట్టిగానే భయపడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.తమిళనాడు రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఎక్కడ గండి పడుతుందోనన్న ఆందోళనతోనే విజయ్ ప్రభుత్వం ఈ 15 మందిపై వేటు వేసి నష్టనివారణ చర్యలకు దిగింది.
