ప్రకాశంహోమ్

బీసీలకు ఎన్డీఏ కూటమి నుంచి 34 శాతం స్థానాలు

#Kondepi

బీసీలు తెలుగుదేశం పార్టీకి గత 45 ఏళ్లుగా వెన్నెముకగా, అండగా నిలిచారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సమాజంలో 50 శాతానికి పైగా ఉన్న వెనుకబడిన వర్గాలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొచ్చిందని చెప్పారు.

ఎన్టీఆర్ స్థానిక సంస్థల్లో బీసీలకు 24 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, తాను వాటిని 34 శాతానికి పెంచానని గుర్తుచేశారు. అయితే, గత ప్రభుత్వం వాటిని తిరిగి 24 శాతానికి తగ్గించిందని విమర్శించారు. మళ్లీ రిజర్వేషన్లు పెంచే ప్రయత్నం చేసినప్పుడు వైఎస్సార్‌సీపీ కోర్టుకు వెళ్లి అడ్డుకుందని ఆరోపించారు. బీసీలకు న్యాయం చేయాలనే తమ సంకల్పం కొనసాగుతుందని, ఎన్డీఏ కూటమి తరఫున పార్టీ పరంగా 34 శాతం స్థానాలు కల్పిస్తామని ప్రకటించారు.

నిరంతరం శ్రమించే నాయకుడు డోలా బాల వీరాంజనేయస్వామి

ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలోని నర్సింగోలులో ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఈ ప్రాంతానికి గతంలో దామచర్ల ఆంజనేయులు మంచి సేవలు అందించారని, ప్రస్తుతం మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ప్రజల సమస్యలపై నిరంతరం ఆలోచించే నాయకుడని పేర్కొన్నారు.

రైతులు హలం పట్టుకుని పొలాలకు వెళ్లాలని, అర్జీలు పట్టుకుని అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని ముఖ్యమంత్రి అన్నారు. భూమి రైతుదేనని, దానిపై హక్కు కూడా రైతుదేనని స్పష్టం చేశారు. భూ వివాదాలకు తావులేకుండా రీ సర్వే ప్రక్రియను పూర్తి చేసి, భూ యజమానులకు స్పష్టమైన హక్కులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

గత ప్రభుత్వం వల్లే భూ సమస్యలు

రెవెన్యూ వ్యవస్థలో గత పాలనలో అనేక సమస్యలు పేరుకుపోయాయని, ఆక్రమణలు, భూ వివాదాలు, అక్రమ వ్యవహారాలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. ఆస్తులు ప్రజలవే అయినప్పటికీ, వాటిపై ఇతరుల ఫొటోలు ముద్రించడం, సర్వే రాళ్లపై రాజకీయ నాయకుల చిత్రాలు వేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూములకు సంబంధించి వివాదాలు సృష్టించారని విమర్శించిన చంద్రబాబు, తమ ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేసిందని తెలిపారు. రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా అత్యంత భద్రతతో, రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తున్నామని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రతి భూ యజమానికి పారదర్శకంగా పాస్ పుస్తకం అందించడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించేందుకే ప్రతి నెలా ప్రజల ముందుకు వస్తున్నానని, పంపిణీ ప్రక్రియ పూర్తయ్యే వరకు రైతులతో సమావేశమవుతూనే ఉంటానని వెల్లడించారు.

40.58 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

రాష్ట్రంలో ఇప్పటివరకు 40.58 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అక్టోబర్ నెలలోనే 790 గ్రామాల్లో నాలుగు లక్షలకు పైగా రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు అందించామని చెప్పారు. ఇంకా పంపిణీ చేయాల్సిన 51 లక్షల పాస్ పుస్తకాలను నెలవారీ లక్ష్యాలతో పంపిణీ చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలోని చివరి భూ యజమానికి సైతం పారదర్శకంగా, పటిష్ఠమైన భద్రతా లక్షణాలతో కూడిన పాస్ పుస్తకం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

గత పాలనలో రాజకీయంగా తమకు వ్యతిరేకంగా ఉన్నవారి భూములను కూడా 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చారని చంద్రబాబు ఆరోపించారు. తమ ప్రభుత్వం ఇప్పటివరకు 16.48 లక్షల ఎకరాల భూమిని ఆ జాబితా నుంచి తొలగించిందని తెలిపారు. కంగుంది, అమలాపురం, శెట్టిపల్లి తదితర ప్రాంతాల్లో వివాదాల్లో చిక్కుకున్న 41 వేల ఎకరాల భూములకు విముక్తి కల్పించామని చెప్పారు. ప్రకాశం జిల్లాలోని నాలుగు మండలాల్లో 2,915 ఎకరాలకు సంబంధించిన గర్భ కండ్రిక భూముల సమస్యలను కూడా పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. వివిధ కేటగిరీల్లోని భూములను డిజిటలైజ్ చేసి, రైతులు, భూ యజమానులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

నీటి పారుదల ప్రాజెక్టులకు ప్రధమ ప్రధాన్యత

కొండపి ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి తెలిపారు. పోతుల చెంచయ్య పాలేరు రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, రూ.166 కోట్ల వ్యయంతో రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. రిజర్వాయర్ పూర్తయితే ఈ ప్రాంతంలోని 9,500 ఎకరాలకు సాగునీరు, 15 గ్రామాల్లో సుమారు 35 వేల మందికి తాగునీరు అందుతుందని వివరించారు. పొన్నలూరు మండలంలోని వేమూరుపాడు రహదారి, పాలేరు నదిపై వంతెన నిర్మాణానికి రూ.28 కోట్లతో శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే స్థానిక ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు వ్యవసాయానికి అవసరమైన నీటి వసతులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

గత పాలనలో ప్రజలు ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్లినా భయంతో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు విమర్శించారు. అనేక వ్యవస్థల్లో సమస్యలు సృష్టించి వెళ్లారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కూడిన ఎన్డీఏ కూటమి పాలనలో ఆ సమస్యలను పరిష్కరిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు.

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడబోనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు అవసరమైన ప్రాజెక్టులు, నిధులు తీసుకురావడానికి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొంటున్నానని చెప్పారు. భూ హక్కుల పరిరక్షణ, సాగునీటి సదుపాయాల కల్పన, బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంపు వంటి అంశాలపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు.

Related posts

ఏపీ రోడ్లకు మహర్దశ… మూడేళ్లలో లక్షన్నర కోట్లు

Satyam News

గూగుల్ రాకతో ప్రపంచం చూపు ఏపీ వైపు

Satyam News

జగన్ సైతాన్ సైన్యం పై షర్మిల సంచలన ఆరోపణ

Satyam News

రష్యా సైన్యంలోకి బలవంతంగా పంజాబ్ యువకులు

Satyam News

తిరుపతిలో ఆరుగురిపై పిడి యాక్ట్

Satyam News

సొంత ప్రభుత్వంపై ‘రాములమ్మ’ నిప్పులు!

Satyam News

Leave a Comment