రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పీఎస్ఆర్ యువ నేస్తం పేరిట ఆన్లైన్లో ఎన్ని లక్షల మందికైనా ఉచిత శిక్షణ అందించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
ప్రతిష్ఠాత్మక ఆర్సీ ఎగ్జామ్స్ సంస్థ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఈరోజు నుంచి ఏడాది పాటు ఈ ఉచిత శిక్షణ ఉంటుందని అవసరమైతే ఈ శిక్షణా కాలాన్ని పొడిగిస్తామని తెలిపారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా బుధవారం సచివాలయంలోని తన ఛాంబర్లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
నిరుద్యోగ యువతకు అండగా నిలవడమే లక్ష్యం
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతీ యువకులకు నాణ్యమైన శిక్షణ అందించి, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.
గత 30 ఏళ్లుగా ఆర్సీ ఎగ్జామ్స్ సంస్థ ఎంతోమంది ప్రతిభావంతులను తీర్చిదిద్దిందని, ఐఏఎస్ వంటి ఉన్నతస్థాయి ఉద్యోగాలు సాధించేందుకు కూడా అభ్యర్థులకు మార్గనిర్దేశం చేసిందని తెలిపారు. ఈ సంస్ధలో కరీం, కృష్ణారెడ్డి, మేముల సైదులు వంటి అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఫ్యాకల్టీ సభ్యులు ఈ శిక్షణ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉండటం అభ్యర్థులకు ఎంతో ఉపయోగకరమని అన్నారు.
గత అనుభవమే ‘యువ నేస్తం’కు స్ఫూర్తి
2013లో రాజకీయాల్లోకి ప్రవేశించి, 2014లో ఎంపీగా ఎన్నికైన అనంతరం 2016లో ఖమ్మం ప్రాంతంలో నిరుద్యోగ యువత కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మంత్రిగారు గుర్తుచేశారు. అప్పట్లో సుమారు 2,300 మంది నిరుద్యోగులకు ఆఫ్లైన్లో శిక్షణ అందించడంతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించినట్లు చెప్పారు. ఆ శిక్షణ పొందిన వారిలో 462 మంది వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సాధించారని వెల్లడించారు.
ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు తమ కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేసిన సందర్భాలు తనను ఎంతగానో కదిలించాయని, వారి ఆనందాన్ని చూసి తన కళ్లలో నీళ్లు తిరిగాయని మంత్రి భావోద్వేగంగా పేర్కొన్నారు. ఆ అనుభవమే మరింతమంది నిరుద్యోగ యువతకు శిక్షణ అందించాలనే సంకల్పానికి ప్రేరణగా నిలిచిందన్నారు. గతంలో ఒక ప్రాంతానికి పరిమితమైన శిక్షణను ఇప్పుడు ఆన్లైన్ విధానం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు.
ఇంటి వద్ద నుంచే నాణ్యమైన శిక్షణ
ప్రస్తుత ఆన్లైన్ శిక్షణ విధానం వల్ల అభ్యర్థులు హైదరాబాద్ కు రాకుండానే తమ ఇళ్ల వద్ద నుంచే శిక్షణ పొందవచ్చని మంత్రి తెలిపారు. దూర ప్రాంతాల్లో నివసించే యువతకు ప్రయాణ ఖర్చులు, వసతి తదితర ఇబ్బందులు లేకుండా ఈ విధానం ఉపయోగపడుతుందని చెప్పారు. నాణ్యమైన శిక్షణ అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
ఒక్కో అభ్యర్థికి ఇలాంటి శిక్షణ అందించేందుకు సాధారణంగా కనీసం రూ.లక్ష వరకు ఖర్చవుతుందని, పుస్తకాలు, ఇతర శిక్షణా సామగ్రి కోసమే సుమారు రూ.14 వేల నుంచి రూ.30 వేల వరకు వ్యయం అవుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ ఖర్చులన్నింటినీ ట్రస్ట్ భరిస్తుందని, అభ్యర్థులకు శిక్షణతో పాటు అవసరమైన పుస్తకాలు, ఇతర సామగ్రిని ఉచితంగా అందిస్తామని స్పష్టం చేశారు.
లక్ష మందికి పైగా నమోదు.. ఎంతమందికైనా శిక్షణ
‘పీఎస్ఆర్ యువ నేస్తం’ కార్యక్రమంపై తొలుత కొందరు అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ, ఉచిత శిక్షణ నిజంగానే అందిస్తున్నట్లు తెలుసుకున్న తర్వాత పెద్ద సంఖ్యలో యువత పేర్లు నమోదు చేసుకుంటున్నారని మంత్రి తెలిపారు. ప్రకటన విడుదల చేసిన పది రోజుల్లోనే లక్ష మందికి పైగా అభ్యర్థులు పేర్లు నమోదు చేసుకోవడం ఈ కార్యక్రమంపై యువత చూపుతున్న ఆసక్తికి నిదర్శనమన్నారు.
ఈ కార్యక్రమానికి ఎలాంటి కటాఫ్ తేదీ విధించలేదని, లక్ష మందితోనే పరిమితం కాకుండా ఎంతమంది అభ్యర్థులు ముందుకొచ్చినా శిక్షణ అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది వరకు ఏడాది పాటు ఈ శిక్షణ కార్యక్రమం కొనసాగుతుందని, అవసరమైతే శిక్షణా కాలాన్ని మరింత పొడిగిస్తామని తెలిపారు. తెలంగాణలోని నిరుద్యోగ యువతీ యువకులందరికీ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
త్వరలో మరో 15 వేల ఉద్యోగాల భర్తీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని మంత్రి గారు తెలిపారు. ఇప్పటికే రెండేళ్లలో 72 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు పేర్కొన్నారు. త్వరలో సుమారు మరో 15 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. రానున్న కాలంలో మరిన్ని ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు వెలువడనున్నాయని చెప్పారు.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు సరైన మార్గదర్శకత్వం, నాణ్యమైన శిక్షణ ఎంతో అవసరమని పేర్కొన్న మంత్రి.. ఆ దిశగా ‘పీఎస్ఆర్ యువ నేస్తం’ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితులు, శిక్షణ ఖర్చులు, దూరప్రాంతాల సమస్యలు యువత లక్ష్యసాధనకు అడ్డంకులు కాకూడదనే ఉద్దేశంతోనే ఉచిత ఆన్లైన్ శిక్షణకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో కృషి చేస్తున్న ప్రతి నిరుద్యోగ యువతీ యువకుడికి ఈ కార్యక్రమం ఒక అవకాశంగా నిలవాలని, యువత తమ ప్రతిభను నిరూపించుకొని ఉద్యోగాలు సాధించేలా ఈ వేదిక తోడ్పడాలని మంత్రి ఆకాంక్షించారు.
దీపావళి లోగా జర్నలిస్టులకు ఇళ్ల స్ధలాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఈరోజు కలిసిన సందర్బంలో పాత్రికేయుల ఇళ్ల స్ధలాల అంశం చర్చకు వచ్చిందని మంత్రి పొంగులేటి తెలిపారు. రానున్న దీపావళి లోగా జర్నలిస్టుల ఇళ్ల స్ధలాల సమస్య పరిష్కారించేందుకు ముఖ్యమంత్రి సమ్మతించారని తెలిపారు. దీనివలన దీర్ఘకాలిక సమస్య తీరుతుందన్నారు. దీనిపై పాత్రికేయుల స్పందిస్తూ మంత్రి పుట్టినరోజున తమకు శుభవార్త వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు.
