ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులతో వైకాపా అధినేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డికి తలనొప్పులు తప్పడం లేదు. వీరిద్దరి వ్యవహారశైలితో పార్టీకి నష్టం జరుగుతుందని, వీరి స్వంత సమస్యలకు పార్టీని అడ్డుపెట్టుకుంటున్నారని, పార్టీకి బలం కావాల్సిన వీరిద్దరూ పార్టీకి చికాకులు సృష్టిస్తున్నారని వైకాపా నాయకుల్లో చర్చ సాగుతోంది. వీరిద్దరినీ వదిలించుకుంటేనే పార్టీకి మేలని, వీరిని పట్టించుకోకుండా వదిలేస్తే మంచిదనే చర్చ కూడా పార్టీలో సాగుతోందట.
ఇంతకీ వీరెవరంటే..మాజీ మంత్రులు పేర్ని నాని, జోగి రమేష్‌లు. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ఈ ఇద్దరు నేతలు రెచ్చిపోయారు. ఒకరు అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు ఇంటిపై దాడికి వెళితే..మరొకరు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై అనవసరంగా విరుచుకుపడేవారు. దానివల్ల కాపుల్లో..వైకాపాకు రావాల్సిన ఓట్లు కూడా రాకుండా పోయాయనే చర్చ ఉంది.
మాజీ మంత్రి జోగి రమేష్ అధికారంలో ఉన్నప్పుడు అడ్డమైన పనులు చేశారని, ఇప్పుడు దాన్ని కవర్ చేసుకునేందుకు కల్తీ మద్యం విషయాన్ని ఆయనే బయటకు తెచ్చారని, ఇప్పుడు అది జగన్ మెడకు చుట్టుకోబోతోందని, ఆఫ్రికాలో మద్యం వ్యాపారం చేసే జగన్ కుటుంబాన్ని కూడా అది బయటకు లాగిందని, జోగి రమేష్ వ్యవహారం వల్లే ఇది ఇప్పుడు సమస్యగా మారిందనే చర్చ వైకాపాలో నడుస్తోంది.
ఇప్పటి దాకా..గతంలో జరిగిన మద్యం అమ్మకాలపైనే సీఐడీ విచారణ చేస్తోందని, ఇప్పుడు జోగి ఇచ్చిన క్లూతో..కల్తీ మద్యం వ్యవహారం బయటకు వచ్చిందని, ఇప్పుడు ఈ కేసు ఎంతమందికి చుట్టుకుంటుందో..తెలియదని, దీనంతటికీ ఆయనే కారణమని వైకాపా నేతలు అంటున్నారు. ఆయన చేసిన తప్పులను పార్టీకి పులిమేశారని, ఇప్పుడు పార్టీ ఆయనను వెనుకేసుకొచ్చే పరిస్థితి లేదని, ఆయనను వదిలించుకుంటేనే మంచిదని కొందరు పార్టీ నాయకులు అంతరంగిక సంభాషణల్లో చెబుతున్నారు.
మాజీ మంత్రి పేర్ని నాని వ్యవహారం కూడా పార్టీని ఇరుకున పెడుతోందని వారు అంటున్నారు. ఆయన మచిలీపట్నం రాజకీయాలను తాడేపల్లికి పులిమేస్తున్నారని, దీని వల్ల పార్టీ ఇబ్బంది పుడుతోందంటున్నారు. ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్రతో ఉన్న వ్యక్తిగత వివాదాలను ఆయన పార్టీకి అంటిస్తున్నారనే భావన పార్టీ పెద్దల్లో కూడా వ్యక్తం అవుతోందట.
అదే విధంగా కాపు కులాన్ని పదే పదే కించపరిచే వ్యాఖ్యలు చేయడంతో..అది మైనస్ అవుతుందని, తాజాగా పోలీసులతో ఆయన వ్యవహరించిన తీరు కూడా వివాదాస్పదం అయింది. ముందుగా వారిపై రంకెలు వేయడం…తరువాత వారి గడ్డాలు పుచ్చుకుని బతిమిలాడడం…పార్టీకి ఇబ్బందులు కల్గిస్తోందంటున్నారు. మొత్తం మీద ఈ ఇద్దరు మాజీ మంత్రులు వ్యవహారం అధినేతకు నచ్చడం లేదని, వీరిని సాగనంపడానికి సరైన సమయం కోసం అధినేత చూస్తున్నారనే ప్రచారం పార్టీ వర్గాల్లో ఉంది.