అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చమురు నిల్వలు, నిక్షేపాలపై ఆధిపత్యం కొనసాగించేందుకు ఎత్తుగడలు వేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే వెనిజులాతో అమెరికా చరిత్రలోనే అతిపెద్ద చమురు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ఒప్పందం ద్వారా వెనిజులాలో ఉన్న 65 బిలియన్ బ్యారెళ్లకు పైగా ముడి చమురు నిల్వలపై అమెరికాకు నియంత్రణ లభించనున్నట్లు ట్రంప్ వెల్లడించారు.
తన ఆదేశాల మేరకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, యుద్ధ శాఖ మంత్రి పీట్ హెగ్‌సెత్ లు వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్‌తో కలిసి ఈ ఒప్పందాన్ని ఖరారు చేసినట్లు ట్రంప్ తెలిపారు. ప్రైవేటు వ్యాపార సంస్థల భాగస్వామ్యంతో ఈ ఒప్పందం సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ భారీ ఒప్పందం కోసం అమెరికా పన్ను చెల్లింపుదారులపై ఎలాంటి భారం పడదని ఆయన స్పష్టం చేశారు.
ఈ ఒప్పందం అమెరికా చమురు నిల్వలను రెండింతలకు పైగా పెంచుతుందని ట్రంప్ పేర్కొన్నారు. దేశీయ చమురు సరఫరా గణనీయంగా పెరగడంతో దీర్ఘకాలంలో అమెరికాలో పెట్రోల్ ధరలు తగ్గే అవకాశం ఉందని ఆయన అన్నారు. అదే సమయంలో వెనిజులా ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ఈ ఒప్పందం సహాయపడుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
అమెరికా-వెనిజులా సంబంధాలను మరింత బలోపేతం చేసే చారిత్రక లావాదేవీగా ట్రంప్ ఈ ఒప్పందాన్ని అభివర్ణించారు. వెనిజులా ఆర్థిక పునరుద్ధరణకు, ఇంధన రంగం అభివృద్ధికి అమెరికా సహకారం అందించనున్నట్లు తెలిపారు. వెనిజులా చమురు రంగంపై అమెరికా గత కొన్ని నెలలుగా తీవ్ర దౌత్యపరమైన ఒత్తిడి తీసుకువచ్చింది.
ఆ దేశంపై విధించిన ఆంక్షల అమలు, చమురు ఎగుమతుల పర్యవేక్షణతో పాటు ఇంధన రంగాన్ని స్థిరీకరించే చర్యలను అమెరికా ప్రభుత్వం చేపట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలో తాజా భారీ ఒప్పందం కుదిరినట్లు ట్రంప్ ప్రకటించారు.
నికోలస్ మదురోను అధికారంలో నుంచి తొలగించిన తర్వాత వెనిజులా చమురు రంగంలో అమెరికా సంస్థలకు తిరిగి ప్రవేశం కల్పించాలనే ఆలోచనను ట్రంప్ గతంలోనే వ్యక్తం చేశారు. హ్యూగో చావెజ్ హయాంలో విదేశీ సంస్థలకు చెందిన ఆస్తులను జాతీయం చేశారని, అమెరికా సంస్థల ఆస్తులు కూడా స్వాధీనం చేసుకున్నారని ట్రంప్ పలుమార్లు ఆరోపించారు. అందువల్ల వెనిజులా చమురు రంగంలో అమెరికా కంపెనీలకు తిరిగి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన వాదించారు.
ప్రపంచంలోనే అత్యధిక ముడిచమురు నిల్వలు కలిగిన దేశాల్లో వెనిజులా అగ్రస్థానంలో ఉంది. అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ (EIA) అంచనాల ప్రకారం వెనిజులాలో సుమారు 303 బిలియన్ బ్యారెళ్ల ముడిచమురు నిల్వలు ఉన్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముడిచమురు నిల్వల్లో దాదాపు 17 శాతానికి సమానం.
అయితే చమురు నిల్వలు భారీగా ఉన్నప్పటికీ, పాతబడిన మౌలిక వసతులు, పెట్టుబడుల కొరత, ఆర్థిక సంక్షోభం కారణంగా వెనిజులా ఉత్పత్తి సామర్థ్యం చాలా తక్కువగా ఉంది. ప్రస్తుతం ప్రపంచ చమురు ఉత్పత్తిలో ఆ దేశం వాటా సుమారు ఒక శాతం మాత్రమే.
అమెరికాలో పెట్రోల్ ధరలను తగ్గించడం, దేశీయ ఇంధన సరఫరాను పెంచడం, వ్యూహాత్మక చమురు నిల్వలను బలోపేతం చేయడం వంటి అంశాలపై ట్రంప్ ప్రభుత్వం దృష్టి సారిస్తున్న సమయంలో ఈ ఒప్పంద ప్రకటన వెలువడింది. ఆగస్టు ప్రారంభంలో అమెరికా వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు 300 మిలియన్ బ్యారెళ్ల దిగువకు పడిపోయాయి. జనవరి నుంచి ఈ నిల్వల్లో 100 మిలియన్ బ్యారెళ్లకు పైగా తగ్గుదల నమోదైన నేపథ్యంలో వెనిజులా నుంచి భారీ స్థాయిలో చమురు సరఫరా అమెరికాకు కీలకంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ ఒప్పందం అమలు విధానం, అమెరికాకు లభించే నియంత్రణ స్వరూపం, ప్రైవేటు కంపెనీల పాత్ర, వెనిజులా ప్రభుత్వానికి లభించే ఆర్థిక ప్రయోజనాలు వంటి అంశాలపై పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది. 65 బిలియన్ బ్యారెళ్లకు పైగా నిర్ధారిత చమురు నిల్వలపై మెజారిటీ అమెరికా నియంత్రణ సాధిస్తే, ప్రపంచ ఇంధన మార్కెట్లతో పాటు అమెరికా-వెనిజులా సంబంధాలపై కూడా దీని ప్రభావం గణనీయంగా ఉండే అవకాశం ఉంది.
