కొనసాగుతున్న గల్ఫ్ యుద్ధంతో ప్రపంచ దేశాలు అల్లకల్లోలం అవుతుంటే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం దీన్ని ఒక జోక్ గా మార్చేశారు. హోర్ముజ్ జలసంధి తెరిచేశాం. మాతో సంధి చేసుకోవడానికి ఇరాన్ హోర్ముజ్ జలసంధిని తెరిచింది. అందరూ వెళ్లి తమ తమ చమురు నౌకలను తెచ్చుకోండి అంటూ ట్రంప్ ఒక ప్రకటన చేశారు.
అమెరికా అధ్యక్షుడు మరోసారి తన వ్యాఖ్యలతో అంతర్జాతీయ వేదికపై చర్చకు దారితీశారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి విషయంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, అమెరికాకు సహకరించని దేశాలపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా నిలిచిపోవడంతో ఇంధన ధరలు పెరిగి ప్రపంచ మార్కెట్లు కుదేలవుతున్న పరిస్థితిలో, ఆయా దేశాలు స్వయంగా వెళ్లి తమ చమురును తెచ్చుకోవాలని సూచించారు.
సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టులో ట్రంప్ మాట్లాడుతూ, అమెరికా-ఇజ్రాయెల్ చర్యలకు సహకరించని దేశాలు, ముఖ్యంగా బ్రిటన్, ఫ్రాన్స్ పై విమర్శలు గుప్పించారు. ఇరాన్‌పై చర్యల్లో పాల్గొనకుండా ఉండటంతో ఈ దేశాలు ఇప్పుడు ఇంధన కొరతను ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో చమురు సమృద్ధిగా ఉందని, అవసరమైతే అక్కడి నుంచి కొనుగోలు చేయాలని సూచించారు.
రమ్మంటే రాలేదుగా… అయినా సరే వెళ్లి చమురు తెచ్చుకోండి
లేదంటే హోర్ముజ్ జలసంధికి వెళ్లి తమకు కావాల్సిన చమురును స్వయంగా తీసుకురావాలని వ్యాఖ్యానించారు. “మీరు మీరే పోరాడటం నేర్చుకోవాలి. అమెరికా ఎప్పుడూ మీకు సహాయం చేయదు. మేము కష్టమైన పని పూర్తిచేశాం, ఇప్పుడు మీరు మీ చమురును మీరు తీసుకోండి” అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. అలాగే ఇజ్రాయెల్‌కు సైనిక సరఫరాలు తీసుకెళ్లే విమానాలకు తమ భూభాగం మీదుగా అనుమతి ఇవ్వలేదని ఫ్రాన్స్‌పై కూడా విమర్శలు చేశారు.
ఇరాన్ హోర్ముజ్ జలసంధిపై తన నియంత్రణను కొనసాగిస్తుండటంతో ప్రపంచ చమురు సరఫరాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో కూడా ఇంధన ధరలు గ్యాలన్‌కు 4 డాలర్లకు పైగా చేరినట్లు సమాచారం. ఈ పరిస్థితిపై ట్రంప్ అసహనం వ్యక్తం చేస్తూ, అధిక ఇంధన ధరలపై ఆందోళన చెందుతున్న దేశాలు “మీ చమురును మీరే తెచ్చుకోండి” అని స్పష్టం చేశారు.
ఇక మరోవైపు చౌనా ఈ విషయంలో కొంత భిన్నంగా స్పందించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ ప్రకారం, ఇటీవల చమురు సరఫరా కోసం వెళ్తున్న మూడు చైనా నౌకలు హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటాయని తెలిపారు. ఇందుకు సహకరించిన సంబంధిత పక్షాలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇరాన్ పేరు ప్రస్తావించకపోయినా, వ్యూహాత్మక సంబంధాల నేపథ్యంలో చైనా నౌకలకు అనుమతి ఇచ్చినట్లు అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. హోర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు కీలక మార్గంగా ఉండటంతో అక్కడి పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. పరిస్థితులు ఉద్రిక్తంగా కొనసాగుతున్న నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం నెలకొల్పాలని చైనా పిలుపునిచ్చింది.
