ఆదిలాబాద్హోమ్

తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్ర సానుకూలం

#Tummidihatti

ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం, దాని ఎత్తు పెంపు ప్రతిపాదనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించారు. మహారాష్ట్రకు, అక్కడి ప్రజలకు ఎలాంటి ప్రతికూల ప్రభావం లేకుంటే ప్రస్తుతం ఉన్న 148 మీటర్ల ఎత్తు ఒప్పందాన్ని పునఃపరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

బ్యారేజీ ఎత్తును 152 మీటర్లకు పెంచాలన్న తెలంగాణ ప్రతిపాదనపై సాంకేతిక, పర్యావరణ, ఇతర అంశాలను సమగ్రంగా అధ్యయనం చేయాలని సూచించారు. ముంబైలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్ హౌస్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో సమావేశమైంది. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు.

152 మీటర్ల ఎత్తుతోనే గ్రావిటీ ద్వారా నీటి తరలింపు

సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని వివరించారు. 2016లో బ్యారేజీ ఎత్తును 148 మీటర్లుగా నిర్ణయిస్తూ ఒప్పందం కుదిరిందని గుర్తుచేశారు. అయితే, ఆ ఎత్తుతో నిర్మిస్తే తెలంగాణలోని తాగునీరు, సాగునీటి అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చడం కష్టమని వివరించారు.

ప్రస్తుత విద్యుత్ అవసరాలు, ఇంధన వ్యయం, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులు, ప్రాజెక్టు నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే గ్రావిటీ ద్వారా నీటిని తరలించడానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో బ్యారేజీ ఎత్తును 152 మీటర్లకు పెంచడం ప్రయోజనకరమైన ప్రత్యామ్నాయమని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

ముంపు భూములకు పరిహారం చెల్లిస్తాం

బ్యారేజీ నిర్మాణం వల్ల మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే వ్యవసాయ భూములకు ఆ రాష్ట్ర నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభావిత రైతులకు న్యాయబద్ధంగా పరిహారం అందించే అంశాన్ని కూడా సమావేశంలో ప్రస్తావించారు.

గిరిజనుల సాగు, తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను గుర్తుచేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వెనుకబాటుతనం, అక్కడి గిరిజనులు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను మహారాష్ట్ర సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

కొమురం భీమ్ సాగించిన ‘జల్, జంగిల్, జమీన్’ పోరాటాన్ని ప్రస్తావించిన సీఎం.. ఆదిలాబాద్ ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా సాగు, తాగునీటి సదుపాయాల కోసం ఎదురుచూస్తున్నారని వివరించారు. ఐదు దశాబ్దాలుగా వివిధ స్థాయుల్లో ప్రయత్నాలు జరిగినప్పటికీ ఆశించిన పురోగతి సాధించలేకపోయామని తెలిపారు.

1975 అక్టోబర్ 6న అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, మహారాష్ట్రకు చెందిన ఎస్.బి. చవాన్ మధ్య కుదిరిన ఒప్పందం నుంచి ఈ ప్రాజెక్టు విషయంలో పలు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సమావేశంలో ప్రస్తావించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, గిరిజనుల జీవన ప్రమాణాల మెరుగుదలకు రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని రేవంత్ రెడ్డి కోరారు.

ఆదిలాబాద్ విమానాశ్రయంతో సరిహద్దు ప్రాంతాలకు ప్రయోజనం

ఆదిలాబాద్‌లో ప్రతిపాదిత రక్షణ, పౌర విమానాశ్రయ సదుపాయాల ప్రాధాన్యాన్ని కూడా సీఎం వివరించారు. ఈ సదుపాయాలు అందుబాటులోకి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోనూ రవాణా, ఆర్థిక కార్యకలాపాలు, అభివృద్ధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ కేవలం సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదని, రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి దోహదపడే కీలక ప్రాజెక్టుగా నిలుస్తుందని పేర్కొన్నారు. పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణానికి సహకరించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు.

అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన

తెలంగాణ ప్రతిపాదనపై దేవేంద్ర ఫడ్నవీస్ సానుకూలంగా స్పందిస్తూ, మహారాష్ట్రకు, అక్కడి ప్రజలకు ప్రతికూల ప్రభావం ఉండకూడదన్నది తమ ప్రధాన పరిశీలన అని స్పష్టం చేశారు. నీటి అవసరాలకు సహకరించేందుకు అభ్యంతరం లేదని, అయితే తుది నిర్ణయానికి ముందు సాంకేతిక, పర్యావరణ, పరిపాలనాపరమైన అంశాలను పరిశీలించాల్సి ఉంటుందని తెలిపారు.

ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శుల నేతృత్వంలో అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ కమిటీ కింది అంశాలపై సమగ్ర అధ్యయనం చేయనుంది:

బ్యారేజీ ఎత్తును 152 మీటర్లకు పెంచే సాధ్యాసాధ్యాలు.

ప్రాణహిత నదిలో నీటి లభ్యత, నీటి తరలింపు సామర్థ్యం.

మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూముల విస్తీర్ణం, ప్రభావిత ప్రాంతాలు.

రైతులకు పరిహారం చెల్లింపు, భూసేకరణకు సంబంధించిన అంశాలు.

సాంకేతిక, పర్యావరణపరమైన ప్రభావాలు, ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు.

కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పరిధిలో అవసరమైన సాంకేతిక అధ్యయనాలు కొనసాగుతాయని సమావేశంలో ప్రస్తావించారు. ఇరు రాష్ట్రాల అధికారులు, నిపుణులు సంప్రదింపులు జరిపి, తదుపరి సమావేశాల కాలపరిమితులు, ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సూచించారు.

ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సుకు ఆహ్వానం

హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరుకావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఆహ్వానించారు. ఈ ఆహ్వానంపై ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించి, సదస్సుకు హాజరయ్యేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.

Related posts

జర్నలిస్ట్ మిత్రులకు ఉగాది పురస్కారాలు

Satyam News

ప్రధాని మోడీ అవతార పురుషుడు

Satyam News

హైదరాబాద్ రోడ్లపైకి మరో 60 కొత్త ఓలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు

Satyam News

ప్రపంచస్థాయి సాంకేతికతతో విపత్తు రక్షణ వ్యవస్థ బలోపేతం

Satyam News

రాష్ట్రపతి ఏడీసీగా నవ్య షెకావత్

Satyam News

వజ్రాల వ్యాపారి కిడ్నాప్: రూ.44 కోట్లు చెల్లింపు

Satyam News

Leave a Comment