కృష్ణహోమ్

వృద్ధి రేటు పెరుగుదలపై సీఎం చంద్రబాబు సమీక్ష

#collectors1

దేశ జీడీపీలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తుల వాటా 10 శాతానికి చేరుకోవడం గర్వకారణమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. రాష్ట్ర జీఎస్డీపీ లక్ష్యాలు, వృద్ధిరేటు, అభివృద్ధి ప్రణాళికలపై జిల్లా కలెక్టర్ల సదస్సులో దిశానిర్దేశం చేశారు.

రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల, జిల్లాల వారీ ప్రగతి అంశాలపై కలెక్టర్లు, శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలతో విస్తృతంగా చర్చించారు. జీఎస్డీపీ విషయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ప్రజల జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తాయని సీఎం పేర్కొన్నారు.

గిరిజన ప్రాంతాల్లో కూడా అభివృద్ధి అవకాశాలను సమర్థంగా వినియోగించుకోవాలని సీఎం సూచించారు. పార్వతీపురం, అల్లూరి జిల్లాల అభివృద్ధిలో తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, ముఖ్యంగా అల్లూరి జిల్లాలో కాఫీ పంటకు విలువ జోడింపు చేయడం వల్ల జీఎస్డీపీ పెరిగిందని తెలిపారు. వ్యవసాయం, సేవారంగం, పరిశ్రమల అభివృద్ధి సమన్వయంతో రాష్ట్రం వేగంగా ముందుకు వెళ్లగలదన్నారు.

కొన్ని జిల్లాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయని, వాటికి అనుబంధ పరిశ్రమలు, ప్లాంట్లు వస్తే భారీ స్థాయిలో అభివృద్ధికి అవకాశాలు ఏర్పడతాయని సీఎం అభిప్రాయపడ్డారు. జీఎస్డీపీ గ్రోత్‌లో జిల్లా కలెక్టర్ల పనితీరును అధ్యయనం చేస్తున్నామని, నూతన ఆవిష్కరణలతో అభివృద్ధి ఎలా సాధించాలనే అంశంపై కలెక్టర్లు వినూత్న ఆలోచనలు చేయాలని సూచించారు.

రాష్ట్ర స్థాయిలో కలెక్టర్ల మధ్య పోటీ ఉన్నట్లే, జిల్లా స్థాయిలో నియోజకవర్గాల మధ్య కూడా అభివృద్ధి పోటీ తీసుకురావాలని చంద్రబాబు నాయుడు అన్నారు. ఫీల్డ్ లెవల్ అధికారులకు విస్తృత అనుభవం, స్థానిక పరిస్థితులపై స్పష్టమైన అవగాహన ఉంటుందని, వారిని సమర్థంగా వినియోగించుకుంటే సంక్షేమం వేగంగా ప్రజలకు చేరుతుందని పేర్కొన్నారు. అలాగే వినూత్న ఆలోచనలను అమలు చేసేందుకు క్షేత్రస్థాయి అధికారులు కీలకమని తెలిపారు.

సూర్యలంక, మంగినపూడి, విశాఖపట్నం, శ్రీకాకుళం, మైపాడు వంటి ప్రాంతాల్లో బీచ్ ఫ్రంట్ అభివృద్ధి చేస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సీఎం వివరించారు. కొత్త జాతీయ రహదారులు ఏర్పడటం వల్ల లాజిస్టిక్స్ హబ్‌లు, టౌన్‌షిప్‌లు అభివృద్ధి చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. విజన్ యూనిట్లను జిల్లా కలెక్టర్లు సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు.

గతంలో పెద్ద జిల్లాల్లో 21 అసెంబ్లీ నియోజకవర్గాలను పర్యవేక్షించాల్సి వచ్చేదని, జిల్లా పర్యటనలకు ఒక పూట సమయం పట్టేదని సీఎం గుర్తుచేశారు. ప్రస్తుతం జిల్లాల విభజన తర్వాత ప్రతి కలెక్టర్ పరిధిలో కేవలం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు.

టెక్నాలజీ కూడా విస్తృతంగా అందుబాటులోకి రావడంతో గతంతో పోలిస్తే అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలు చేసే అవకాశం పెరిగిందన్నారు. ఇప్పుడు కలెక్టర్లు మరింత సమర్థవంతంగా పనిచేసి అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు చేరవేయాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు.

Related posts

యువతకు ఉద్యోగాలే లక్ష్యంగా భాగస్వామ్య సదస్సు

Satyam News

గ్రహణం రోజున ముస్లింల ర్యాలీ…!

Satyam News

డ్రగ్స్ రహిత తెలంగాణ సాధిద్దాం

Satyam News

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్టు

Satyam News

దళితుల హక్కుల కోసం మాట్లాడితే కేసులా?

Satyam News

శ్రీశైలంలో భారీ గా పెరిగిన భక్తుల రద్దీ

Satyam News

Leave a Comment