పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ఫౌజీ’ చిత్రంలో స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన మనవడు చంద్రకుమార్ బోస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చారిత్రక వ్యక్తుల జీవితాలను, స్వాతంత్ర్య పోరాటంలో వారి పాత్రను సినిమాల్లో చిత్రీకరించేటప్పుడు వాస్తవాలకు ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రకుమార్ బోస్ కోరారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన నాయకుల త్యాగాలు, సేవలు, పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించేలా వారి పాత్రలను చూపించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ వివాదంపై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను చంద్రకుమార్ బోస్ కోరారు. వివాదాస్పద టీజర్‌కు కేంద్ర చలనచిత్ర ధ్రువీకరణ మండలి అనుమతి ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. టీజర్‌ను వెంటనే తొలగించి, అవసరమైన మార్పులు చేసిన తర్వాత మళ్లీ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, ఈ టీజర్‌కు అనుమతులు ఇచ్చిన ప్రక్రియలో బాధ్యతారాహిత్యం జరిగి ఉంటే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ లేఖ ప్రతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా పంపించారు.
23న విడుదలైన ‘ఫౌజీ’ టీజర్ రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి బెర్లిన్ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో నేతాజీ సుభాష్ చంద్రబోస్, జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌ను కలిసినట్లు చూపించారు. ఆ సందర్భంలో ప్రభాస్ పోషిస్తున్న కల్పిత గూఢచారి పాత్రను పరిచయం చేసే విధానం చరిత్రను వక్రీకరించేలా ఉందన్నది చంద్రకుమార్ బోస్ ప్రధాన అభ్యంతరం. నిజ జీవిత చారిత్రక వ్యక్తులను కల్పిత కథాంశంతో ముడిపెట్టేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
చిత్ర దర్శకుడు హను రాఘవపూడి, చిత్ర నిర్మాణ సంస్థ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరారు. అయితే ప్రభాస్‌పై లేదా చిత్ర బృందంపై వ్యక్తిగతంగా తనకు వ్యతిరేకత లేదని, నేతాజీకి సంబంధించిన అభ్యంతరాలను పరిష్కరించి టీజర్‌తో పాటు సినిమాలోనూ చారిత్రక గౌరవాన్ని కాపాడితే చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తానని స్పష్టం చేశారు.
