కృష్ణహోమ్

ఆర్నాబ్ తుఫానుతో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలి

#Achemnaidu

ఆర్నాబ్ అత్యంత తీవ్ర తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు భారీ నష్టం వాటిల్లే పరిస్థితులు ఏర్పడ్డాయని, కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు బుధవారం లేఖ రాశారు. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని 14 జిల్లాల్లో 2,24,489 హెక్టార్లలో పంటలు నీటమునగడం లేదా దెబ్బతినడంతో సుమారు 3.45 లక్షల మంది రైతులు ప్రభావితమైనట్లు ప్రాథమిక నివేదికల ద్వారా వెల్లడైందని తెలిపారు.

పంటలు చేతికందే కీలక సమయంలో ప్రకృతి విపత్తు సంభవించడం రైతాంగానికి తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. అక్టోబర్ 28 తెల్లవారుజామున యానాంకు దక్షిణంగా ఆంధ్రప్రదేశ్–యానాం తీరాన్ని దాటిన ఆర్నాబ్ తుఫాను గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో గాలులు, గరిష్ఠంగా 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులకు కారణమైందని మంత్రి వివరించారు.

తీరం దాటే సమయంలో తుఫాను దాదాపు స్థిరంగా కొనసాగడంతో కృష్ణా నుంచి శ్రీకాకుళం వరకు పలు తీరప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయన్నారు. రాష్ట్రంలోని 688 మండలాలకు గాను 317 మండలాల్లో 10 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందని, శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు విస్తరించిన 16 జిల్లాల్లోని 325 మండలాల్లో 315 మండలాలు ఈ పరిధిలో ఉన్నాయని తెలిపారు.

విశాఖపట్నం జిల్లాలో సగటున 236.7 మి.మీ., విజయనగరంలో 212.1 మి.మీ., అనకాపల్లిలో 209.2 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, విశాఖ జిల్లా గోపాలపట్నంలో అత్యధికంగా 323.2 మి.మీ. వర్షం కురిసిందని పేర్కొన్నారు. గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాల్లోనూ భారీ వర్షాల కారణంగా పంటలు నీటమునిగాయని వివరించారు.

వరి పంటకే అత్యధిక ప్రభావం.. డెల్టా రైతులకు తీవ్ర నష్టం

ప్రాథమిక అంచనాల ప్రకారం 154 మండలాల్లో 2,11,726 హెక్టార్ల వ్యవసాయ పంటలు నీటమునగడం లేదా దెబ్బతినగా, ఇందులో వరి విస్తీర్ణమే 2,09,460 హెక్టార్లు ఉందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వ్యవసాయ పంటలకు సంబంధించి 3,18,704 మంది రైతులు, ఉద్యాన పంటలకు సంబంధించి మరో 25,914 మంది ప్రభావితమయ్యారని పేర్కొన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో 76,176 హెక్టార్లు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమలో 44,232, కాకినాడలో 42,222, తూర్పుగోదావరిలో 29,866, కృష్ణాలో 22,339, బాపట్లలో 4,032 హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు ప్రభావితమైనట్లు వివరించారు. అలాగే విజయనగరంలో 1,967 హెక్టార్లు, అనకాపల్లిలో 1,624, గుంటూరులో 570, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 422, శ్రీకాకుళంలో 374, పోలవరంలో 310, ఏలూరులో 274, విశాఖపట్నంలో 81 హెక్టార్లలో పంటలు నీటమునగడం లేదా దెబ్బతిన్నట్లు వెల్లడించారు.

ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 82 శాతం, కోనసీమలో 75 శాతం, కాకినాడలో 48 శాతం వరి విస్తీర్ణం నీటమునిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయని తెలిపారు. ఖరీఫ్ సీజన్‌లో వరి గింజ దశ నుంచి కోత దశకు చేరుకున్న తరుణంలో తుఫాను సంభవించడంతో పంటలు నేలకొరగడం, ధాన్యం మొలకెత్తడం, రంగు మారడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదముందన్నారు. ఇప్పటికే కోసిన ధాన్యానికి సైతం నష్టం వాటిల్లే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు.

అరటి, కొబ్బరి, కూరగాయల పంటలకూ తీవ్ర దెబ్బ

రాష్ట్రవ్యాప్తంగా 12,763 హెక్టార్లలో ఉద్యాన పంటలు ప్రభావితమయ్యాయని మంత్రి పేర్కొన్నారు. బలమైన గాలులకు అరటి తోటలు నేలకొరిగాయని, ముఖ్యంగా గెలలు వేసి కోతకు సిద్ధంగా ఉన్న మొక్కలు విరిగిపోవడం లేదా వేళ్లతో సహా కూలిపోవడంతో రైతులకు గణనీయమైన నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందన్నారు.

కూరగాయల తోటల్లో నీరు నిలిచిపోవడం వల్ల మొక్కలు వాడిపోవడం, వేర్లు కుళ్లిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదముందని తెలిపారు. పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లో కొబ్బరి తోటల్లో మట్టలు విరిగిపోవడం, పిందెలు, కాయలు రాలిపోవడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయని వివరించారు. బొప్పాయి, పూలు, తమలపాకు తోటలకు కూడా నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక సమాచారం అందిందన్నారు.

వర్షాలు తగ్గిన వెంటనే సంయుక్త క్షేత్రస్థాయి పరిశీలన

ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాలు ప్రాథమికమైనవేనని, వర్షాలు తగ్గి వరద నీరు పూర్తిగా తొలగిన తర్వాతే వాస్తవ పంట నష్టాన్ని నిర్ధారించగలమని మంత్రి స్పష్టం చేశారు. వ్యవసాయ, ఉద్యానవన, రెవెన్యూ శాఖల అధికారులు ప్రభావిత గ్రామాల్లో సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించి నష్టాన్ని అంచనా వేస్తారని తెలిపారు.

ఆ వివరాలతో సమగ్ర నివేదికను కేంద్రానికి సమర్పిస్తామన్నారు. వర్షాలు, బలమైన గాలులు కొనసాగుతున్న నేపథ్యంలో నష్టం మరింత పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. తుఫాను ముప్పును ముందుగానే గుర్తించి రైతులను అప్రమత్తం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పంటల వారీగా 1.05 కోట్లకు పైగా ముందస్తు సూచనలు జారీ చేసిందని మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు.

రైతు సేవా కేంద్రాల సిబ్బందిని క్షేత్రస్థాయిలో అప్రమత్తం చేసి, పంటల సంరక్షణకు అవసరమైన జాగ్రత్తలను తెలియజేయడంతో పాటు రైతులకు సహాయ సహకారాలు అందించేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో పంట నష్టాన్ని తగ్గించడం, రైతుల జీవనోపాధిని కాపాడటమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని తెలిపారు.

కేంద్రం తక్షణమే స్పందించాలి.. ముందస్తు నిధులు విడుదల చేయాలి

తుఫాను కారణంగా రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (NDRF), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (SDRF) నిబంధనల మేరకు నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ అందించేందుకు కేంద్ర సహాయం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

సమగ్ర నష్ట నివేదిక సమర్పణకు ముందే అత్యవసర సహాయక చర్యల కోసం ముందస్తుగా నిధులు విడుదల చేయాలని అభ్యర్థించారు. సకాలంలో ఆర్థిక సహాయం అందితే రైతుల కష్టాలను కొంతవరకు తగ్గించడంతో పాటు వారి జీవనోపాధిని పరిరక్షించేందుకు, రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన సహాయక, పునరుద్ధరణ చర్యలను వేగవంతం చేసేందుకు వీలవుతుందని వివరించారు.

ఈ విషయంలో కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ వ్యక్తిగతంగా చొరవ తీసుకుని ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి అండగా నిలవాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తన లేఖలో కోరారు.

Related posts

ఇరాన్‌లో సైన్యం గుప్పిట్లోకి పాలనా పగ్గాలు!

Satyam News

రేప్ కేసు నిందితుడైన ఆప్ ఎమ్మెల్యే పరార్

Satyam News

చిన జీయర్ కు శ్రీగురూజీ సవాల్

Satyam News

ప్లేటు ఫిరాయించిన సోనం వాంగ్ చుక్

Satyam News

సొంత చెల్లి గుర్తు లేదా..?? రాదా…?? జగన్‌..??

Satyam News

ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పిస్తున్న ప్రభుత్వం

Satyam News

Leave a Comment