ఏపీ PCC చీఫ్ వైఎస్ షర్మిల కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను సీఎం చంద్రబాబు నాయుడుకు అందించడంపై సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనంపై మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. షర్మిల చేసిన ట్వీట్‌ను రీపోస్ట్ చేస్తూ, సాక్షి పత్రిక తీరును లోకేష్ తీవ్రంగా ఖండించారు.
కుమార్తె వివాహానికి పెద్దవారిని ఆహ్వానించడం అనేది మన సంస్కృతి, మర్యాదల్లో భాగమన్నారు లోకేష్ . చంద్రబాబు గారికి వైఎస్ షర్మిల గారు అందించిన ఆహ్వానంపై సాక్షి ప్రచురించిన కథనం ఒక మహిళను తీవ్రంగా కించపరిచేలా ఉందని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాజీవితంలో, రాజకీయాల్లో అభిప్రాయభేదాలు ఉండవచ్చు కానీ, కనీస విలువలను ఎప్పుడూ కోల్పోకూడదని లోకేష్ హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై వ్యక్తిగత దాడులకు ఏమాత్రం స్థానం లేదని స్పష్టం చేసిన ఆయన, బాధ్యతారహితంగా కథనం రాసిన సాక్షి పత్రికను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో, ఈ శుభసందర్భంగా వైఎస్ షర్మిల గారికి, ఆమె కుటుంబానికి లోకేష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
అంతకుముందు, తండ్రి వయసున్న చంద్రబాబుకు శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాల్, ఆత్మీయ సంబంధాలు అంటూ సాక్షిలో వక్రభాష్యం చెప్పడం అభ్యంతరకరమని వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఇది తనపై, తన కుటుంబంపై జరిగిన వ్యక్తిత్వ హననమని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె, దీనిపై వైసీపీ అధినేత జగన్ సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
