కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై సామాజిక మాధ్యమాల్లో అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు సినీ నటి బీజేపీ ఎంపి కంగనా రనౌత్ పై పోలీసు కేసు నమోదు అయింది. కంగనా వ్యాఖ్యలు సమాజంలో విద్వేషాలను ప్రోత్సహించేలా ఉన్నాయని, రాజ్యాంగబద్ధమైన విధేయతను ప్రశ్నించే విధంగా ఉన్నాయని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని కెప్టెన్ అతుల్ శర్మ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సోనియా గాంధీ జ్ఞాపకాల పుస్తకం లక్ష్యంగా చేసుకుని కంగనా రనౌత్ విమర్శలు చేశారు. గాంధీ కుటుంబంలోకి సోనియా గాంధీ వచ్చిన తరువాత ఆ కుటుంబ సభ్యుల హత్యలు జరిగినప్పటికీ, వాటికి సంబంధించిన పరిస్థితుల గురించి ఆమెకు తెలియకుండా ఎలా ఉన్నారంటూ ప్రశ్నించారు. తన చిత్రం ‘ఎమర్జెన్సీ’ నిర్మాణం కోసం పరిశోధనలు చేస్తున్న సమయంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అయితే కంగనా వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ కెప్టెన్ అతుల్ శర్మ పోలీసులను ఆశ్రయించారు.
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి మీడియా సలహాదారు, కాంగ్రెస్ నాయకుడు నరేశ్ చౌహాన్ కూడా కంగనా వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. సోనియా గాంధీ గురించి కంగనా చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని, అవి ఆమె ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయని విమర్శించారు. రాజకీయాల్లో కనీస సంయమనం, మర్యాద పాటించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
మండి వంటి కీలకమైన లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు బీజేపీకి ఎంతోకాలంగా సేవలందించిన అనుభవజ్ఞులైన నాయకులు, అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలను పక్కనపెట్టి సినీ ప్రముఖురాలైన కంగనాకు ఎందుకు అవకాశం కల్పించిందో బీజేపీ సమాధానం చెప్పాలని నరేశ్ చౌహాన్ ప్రశ్నించారు. ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి కంగనా తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారని అన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో ప్రకృతి విపత్తు సంభవించిన సమయంలో కూడా ఆమె పాత్రపై ప్రశ్నలు తలెత్తాయని గుర్తుచేశారు.
ప్రజల సమస్యలు, హిమాచల్ ప్రదేశ్ రాజకీయ ప్రయోజనాల కంటే ప్రచారం, వ్యక్తిగత ప్రాచుర్యానికే బీజేపీ ప్రాధాన్యత ఇస్తోందని చౌహాన్ ఆరోపించారు. ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ విలువలను, ప్రజాజీవితంలో పాటించాల్సిన మర్యాదను దెబ్బతీయడమే కాకుండా రాష్ట్ర ప్రతిష్ఠకు కూడా భంగం కలిగిస్తాయని అన్నారు. ఒక వ్యక్తి జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, అనుభవాలు, పోరాటాల గురించి పూర్తిగా తెలుసుకోకుండా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం తగదని ఆయన హితవు పలికారు.
